Share News

ప్రజలు లేని ప్రజావేదిక

ABN , Publish Date - Sep 17 , 2025 | 02:30 AM

పెద్దారవీడు మండలంలో ఉపాధి హామీ పథకం ప్రజావేదిక పేరుకే అన్నట్లు తయారైంది. అక్రమాలను, లెక్కల్లో తప్పులను వెలికితీయాల్సిన సామాజిక తనిఖీకి ప్రజలెవ్వరూ హాజరుకాలేదంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఈజీఎ్‌స సిబ్బంది, పనులను తనిఖీ చేసి నివేదిక ఇచ్చే ఉద్యోగులు కుమ్మక్కయ్యారు.

ప్రజలు లేని ప్రజావేదిక
సమావేశానికి హాజరైన ఫీల్డ్‌ అసిస్టెంట్లు, తనిఖీ సిబ్బంది

ఉపాధి హామీ అధికారులు, తనిఖీ సిబ్బంది మిలాఖత్‌

రూ.కోట్ల అవినీతిని కప్పిపుచ్చేందుకు యత్నాలు

మస్టర్లలో మృతిచెందిన వారి పేర్లు

ముందే అధికారి సంతకాలు

పెద్దారవీడు, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి) : పెద్దారవీడు మండలంలో ఉపాధి హామీ పథకం ప్రజావేదిక పేరుకే అన్నట్లు తయారైంది. అక్రమాలను, లెక్కల్లో తప్పులను వెలికితీయాల్సిన సామాజిక తనిఖీకి ప్రజలెవ్వరూ హాజరుకాలేదంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఈజీఎ్‌స సిబ్బంది, పనులను తనిఖీ చేసి నివేదిక ఇచ్చే ఉద్యోగులు కుమ్మక్కయ్యారు. సిబ్బంది చేసిన అక్రమాలకు నామమాత్రంగా తప్పులు జరిగినట్లు నివేదికలు తయారు చేశారు. అలా చేయడానికి తనిఖీ చేసిన వారికి భారీ మొత్తం ముట్టజెప్పారన్న ప్రచారం జరుగుతోంది. తనిఖీ సిబ్బంది తయారుచేసిన నివేదికలపై ప్రజావేదిక జరగక ముందే జిల్లాస్థాయి ప్రభుత్వ అధికారి సంతకాలు చేయడం వారి మధ్య ఉన్న సత్సంబంధాలకు నిదర్శనం. అసలు ఉపాధి హామీ పనులకు సంబంధించి ప్రజావేదిక జరుగుతుందన్న సమాచారం మండలంలోని అధికారపార్టీ, ప్రతిపక్ష నాయకులకు, ప్రజలకు కూడా తెలియకపోవడం చర్చనీయాంశమైంది. మండలంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా మండలంలోని 19 పంచాయతీలలో 637 పనులు చేసినట్లు, అందుకుగాను రూ.19,53,61,418కోట్లు ఖర్చు చేసినట్లు నిర్ధారించారు. ఆయా పనుల తనిఖీలకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. అయితే తనిఖీలలో వెలుగు చూసిన విషయాలను కప్పిపుచ్చేందుకు తనిఖీ, ఉపాధి సిబ్బందికి మధ్య భారీ స్థాయిలో ఆర్థిక ఒప్పందాలు కుదిరినట్లు సమాచారం.

మృతి చెందినవారికీ మస్టర్లు

మండలంలోని తోకపల్లి పంచాయతీ పరిధిలో జరిగిన ఉపాధి పనులకు సంబంధించి అక్రమాలు జరిగినట్లు తనిఖీ సిబ్బంది గుర్తించారు. తోకపల్లి పరిధితో మూడేళ్ల కిందట మృతి చెందిన నలుగురికి ఉపాధి పనులు చేసినట్లు తనిఖీ సిబ్బంది పరిశీలించి, వారిలో ముగ్గురికి మస్టర్లు వేసినప్పటికీ వేతనాలు ఒక్కరికి మాత్రమే ఇచ్చినట్లు నివేదికలో పేర్కొన్నారు.

సమావేశానికి ముందే అధికారి సంతకాలు

సామాజిక తనిఖీలో సిబ్బంది ఇచ్చిన నివేదికలపై జిల్లా స్థాయి అధికారి సమావేశం అనంతరం ప్రజావేదికలో ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను పూర్తిగా వినాలి. ఆ తర్వాత మాత్రమే ఆ నివేదికపై సంతకాలు చేయాలి. కానీ మంగళవారం ప్రజావేదిక జరగక ముందే ఆ అధికారి ఎంపీడీవో చాంబర్‌లో కూర్చొని తనిఖీ సిబ్బంది ఇచ్చిన నివేదికలపై సంతకాలు చేయడం అనుమానాలకు తావిస్తుంది.

Updated Date - Sep 17 , 2025 | 02:30 AM