Share News

మరమ్మతులకు నోచుకోని పైప్‌లైన్‌

ABN , Publish Date - May 24 , 2025 | 10:14 PM

దొనకొండ మండలంలోని గ్రామాల ప్రజలకు మంచినీటి సరఫరా నిమిత్తం నిర్మించిన మంచినీటి పథకం శిథిలావస్థకు చేరింది. తరచూ పైప్‌లైన్‌ లీకేజీలు, పైపులు పగలటం తదితర మరమ్మతులకు గురవుతుండటంతో ప్రజలకు మంచినీటి ఇబ్బందులు ఎదురవుతున్నా యి. ప్రతినిత్యం ఏదో ఒక ప్రాంతంలో పైప్‌లు పగలటం, సిబ్బంది గుర్తించి మరమ్మత్తులు చేపట్టేసరికి వారం రోజులు పట్టటం పరిపాటైంది.

మరమ్మతులకు నోచుకోని పైప్‌లైన్‌
చందవరం వద్ద పైప్‌లైన్‌ పగిలి వృథాగా పోతున్న సాగర్‌ నీరు

తరచూ లీకేజీలు

వృథాగా పోతున్న సాగర్‌ జలాలు

ప్రజలకు తప్పని మంచినీటి ఇబ్బందులు

దొనకొండ, మే 24 (ఆంధ్రజ్యోతి) : దొనకొండ మండలంలోని గ్రామాల ప్రజలకు మంచినీటి సరఫరా నిమిత్తం నిర్మించిన మంచినీటి పథకం శిథిలావస్థకు చేరింది. తరచూ పైప్‌లైన్‌ లీకేజీలు, పైపులు పగలటం తదితర మరమ్మతులకు గురవుతుండటంతో ప్రజలకు మంచినీటి ఇబ్బందులు ఎదురవుతున్నా యి. ప్రతినిత్యం ఏదో ఒక ప్రాంతంలో పైప్‌లు పగలటం, సిబ్బంది గుర్తించి మరమ్మత్తులు చేపట్టేసరికి వారం రోజులు పట్టటం పరిపాటైంది. తాజాగా చందవరం గ్రామ సమీపంలోని బత్తాయితోటలో పైపులైన్‌ లీకై నీరు మొత్తం వృథాగా పోతుంది. చందవరం ప్రాంతంలోని దాదాపు పది మంది రైతులకు చెందిన 40 ఎకరాల బత్తాయితోట మధ్యలో సాగర్‌నీటి పైప్‌లైన్‌ ఉంది. తరచూ పైపులు పగలటం, పైపులు లీకై నీరు మొత్తం బత్తాయి చెట్ల చుట్టూ నిండుకోవటంతో పంట దెబ్బతింటుందని రైతులు వాపోతున్నారు. తమ తోటలో పైప్‌లైన్‌ తొలగించకుంటే మరోసారి పైపులు పగిలినా, లీకులకు గురైనా తాము మరమ్మతులు చేపట్టనీయమని రైతులు పేర్కొంటున్నారు.

దొనకొండ ప్రధాన రహదారి పక్కన అనేక ప్రాంతాల్లో పైపులు లీకై సాగర్‌ జలాలు వృథాగా పోతున్నాయి. ఈపైప్‌లైన్‌ సమస్య కారణంగా వారానికి ఒకసారి, ఒక్కోసారి పది రోజులకు ఒకసారి నీటి సరఫరా జరుగుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల సమయంలో దొనకొండ సమీపంలోని బాదాపురం చెరువును మంచినీటి స్టోరేజీగా ఏర్పాటుచేసి ప్రజలకు మంచినీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని పాలకులు ప్రకటించటమే తప్పా ఆచరణలో అమలు జరగటం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. మండలంలోని ప్రజల దాహార్తి నిమిత్తం 1982లో నెదర్లాండ్‌ ఆర్థిక సహాయంతో 885 మిలియన్‌ లీటర్ల సామర్థ్యంతో చందవరం సమీపంలో సాగర్‌ జలాల స్టోరేజీని నిర్మించారు. స్టోరేజీ నిర్మించి దాదాపు 43 సంవత్సరాలు గడుస్తుండటంతో నిర్వహణ బాగోగులు లేకపోవటంతో శిథిలావస్థకు చేరుకుంది. పైప్‌లైన్‌ పాడైపోయి ఆపసోపాల నడుమ పథకం కొనసాగుతుంది. ఇప్పటికైనా సంబందిత అధికారులు స్పందించి ప్రజల మంచినీటి ఇబ్బందులను గుర్తించి ఎన్‌ఏపీ మంచినీటి పథకానికి నూతన పైప్‌లైన్‌ మంజూరు చేయించి గ్రామాల్లో ప్రజలకు నీటి సరఫరాకు ఇబ్బందిలేకుండా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - May 24 , 2025 | 10:14 PM