ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం
ABN , Publish Date - Apr 30 , 2025 | 01:24 AM
జిల్లాలో అన్ని ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపవచ్చని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో మంగళవారం పలు శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు
20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్
ఒంగోలు కలెక్టరేట్, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో అన్ని ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపవచ్చని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో మంగళవారం పలు శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వికసిత్ భారత్, స్వర్ణాంధ్రలో జిల్లాను భాగసామ్యం చేయడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు. జిల్లాలో ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పీ4 స్ఫూర్తితో కేంద్రప్రభుత్వ, ప్రైవేటు వ్యాపార, సేవా సంస్థలను తీసుకువస్తున్నారని తెలిపారు. ఈ విధానం ద్వారా జిల్లాలోని కిడ్నీ బాధితులను ఆదుకునేందుకు సీఎస్‌ఆర్ నిధులను రాబట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తద్వారా డయాలసిస్ సెంటర్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేయవచ్చన్నారు. జిల్లాలో 729 గ్రామ పంచాయతీల్లోని 1,009 ఊళ్లలో ఫ్లోరైడ్ సమస్య ఉందన్నారు. దాన్ని ఎదుర్కొనేందుకు 27 గ్రామాల్లో రక్షిత తాగునీటి సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తున్నదన్నారు. కనిగిరి ప్రాంతంలో 339, దర్శి ప్రాంతంలో 120, మార్కాపురం పరిధిలో 113 గ్రామాల్లో ఫ్లోరైడ్ సమస్య ఉందన్నారు. నీటిలో పీపీఎం 1.5లోపు ఉండాల్సి ఉండగా కనిగిరిలో 1.98 నుంచి 3.19 వరకు ఉందన్నారు. 16వ ఆర్థిక సంఘం ప్రతినిధులకు ఫ్లోరిన్ సమస్య ఉన్న ప్రాంతాలకు అదనపు గ్రాంటు ఇవ్వా లని కోరినట్లు తెలిపారు. కనిగిరి నియోజకవర్గంతోపాటు కొండపి లోని మర్రిపూడి మండలానికి పూర్తిస్థాయిలో రక్షిత తాగునీరు అందించాల్సిన అవసరం ఉందన్నారు. కనిగిరిలో డయాలసిస్ సెంటర్‌లో నెలకు 120మందికి సేవలు అందిస్తున్నారని, ఇంకా జిల్లాకు ఎన్ని అవసరమో ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వేసవిలో తాగునీటి ఎద్దడిని అధిగమించేందుకు తక్షణ అవసరాల కోసం జిల్లాలోని మునిసిపాలిటీలకు రూ.13.92కోట్లు మంజూరు చేశారని చెప్పారు. అందులో ఒంగోలు పట్టణానికి రూ.4.4కోట్లు ఇచ్చినట్లు దినకర్ తెలిపారు. జల్‌జీవన్ మిషన్ ద్వారా దీర్ఘకాలిక వనరుల లభ్యత ఆధారంగా ప్రతి గృహానికి సురక్షిత తాగునీరు కొళాయి ద్వారా సరఫరా చేసేందుకు వెలిగొండను పూర్తిచేయాల్సిన అవసరం ఉందన్నారు. వెలిగొండ పూర్తితో పశ్చిమప్రకాశంలో కరువుతోపాటు ఫ్లోరైడ్, కిడ్నీ బాధితుల సమస్యను పరిష్కరించడం సాధ్యమవుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో వచ్చేనెల 2న కేంద్రప్రభుత్వ సహకారంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమరావతిలో రూ.లక్ష కోట్లతో రాజధాని అభివృద్ధి పనుల ప్రారంభానికి జిల్లా నలుమూలల నుంచి భారీగా తరలిరావాలని ఆయన కోరారు. సమావేశంలో సీపీవో వెంకటేశ్వర్లుతోపాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.