Share News

‘ఉపాధి’లో గూడుపుఠాణీ

ABN , Publish Date - Sep 18 , 2025 | 02:19 AM

పెద్దారవీడు మండలంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో జరిగిన ఉపాధి పనులపై గూడుపుఠాణీ జరుగుతోంది. ప్రజలకు, ప్రజాప్రతి నిధులకు తెలియకుండానే సామాజిక తనిఖీలు చేసిన వారికి, ఆయా పనులను పర్యవేక్షించిన సిబ్బందికి మధ్య జరిగిన చీకటి ఒప్పందాల మేరకు నివేదికలను తారుమారు చేసే పనిలో నిమగ్నమయ్యారు.

‘ఉపాధి’లో గూడుపుఠాణీ
ప్రజావేదికలో పాల్గొన్న జిల్లా ఉన్నతాధికారులు (ఫైల్‌)

అక్రమాలను వెల్లడించేందుకు నిరాసక్తత

ఉన్నతాధికారుల సూచనలతో తప్పుడు నివేదికలు సిద్ధం

పెద్దారవీడు, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): పెద్దారవీడు మండలంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో జరిగిన ఉపాధి పనులపై గూడుపుఠాణీ జరుగుతోంది. ప్రజలకు, ప్రజాప్రతి నిధులకు తెలియకుండానే సామాజిక తనిఖీలు చేసిన వారికి, ఆయా పనులను పర్యవేక్షించిన సిబ్బందికి మధ్య జరిగిన చీకటి ఒప్పందాల మేరకు నివేదికలను తారుమారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇవన్నీ కూడా ఉపాధి పనుల్లో చోటుచేసుకున్న అక్రమాల సొమ్ముతో జేబులు నింపుకున్న జిల్లా అధికారుల సూచన మేరకు జరుగుతున్నట్లు సమాచారం. పెద్దారవీడు మండలంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో 19 పంచాయతీలలో 637 పనులు చేశారు. మొత్తం రూ.19,53,61,418 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రకటించారు. ఆయా పనులకు సంబంధించి పది రోజులుగా సామాజిన తనిఖీ బృందం విచారణ చేపట్టింది. సుమారు రూ.6 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు తనిఖీ సిబ్బంది నిర్ధారించినట్లు సమాచారం. అయితే వాటిని కప్పిపుచ్చకోవడానికి అప్పుడు పనిచేసిన ఉపాధి హామీ సిబ్బంది గూడుపుఠానీ చేసి తనిఖీ చేసిన సిబ్బందికి భారీగా ముడుపులు సమర్పించినట్లు ప్రచారం జరుగుతోంది.

తప్పుడు నివేదికలకు సిద్ధం

మండలంలో జరిగిన ఉపాధి పనులకు సంబంధించి జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తప్పుడు నివేదికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందికి రాజకీయ నేపథ్యాలు ఉండడంతో వారు సైతం అక్రమాలను ప్రోత్సహించినట్లు సమాచారం. వారి అండదండలతోనే ఉపాధి సిబ్బంది అక్రమాలకు పాల్పడినట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే మండల స్థాయి అధికారులు సామాజిక తనిఖీలకు సంబంధించిన సమాచారం రాజకీయ నాయకులకు, ప్రజలకు, పత్రికా ప్రతినిధులకు సమాచారం ఇవ్వలేదు. తూతూ మంత్రంగా ప్రజా వేదిక నిర్వహించి మమ అనిపించే ప్రయత్నం చేశారు. కానీ పత్రికలలో కథనాలు రావడంతో ఉపాధి పనులలో జరుగుతున్న అక్రమాలు వెలుగుచూసాయి.

నివేదికలు సిద్ధం చేస్తున్నాం

సాంబశివుడు, ఏపీవో

పెద్దారవీడు మండలంలో 2024-25 అర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పనులలో జరిగిన అక్రమాలపై తనిఖీ సిబ్బంది నివేదికలు తయారు చేస్తున్నారు. అవి పూర్తయిన వెంటనే ఉన్నతాధికారులకు పంపిస్తాం. వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.

Updated Date - Sep 18 , 2025 | 02:19 AM