కదులుతున్న బోగస్ డొంక
ABN , Publish Date - May 03 , 2025 | 12:47 AM
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో బోగస్ గ్రూపులను సృష్టించి రూ.కోట్లు దోచుకున్న అవినీతి ఆర్పీలపై చర్యలు తీసుకునేందుకు మెప్మా పీడీ సిద్ధమయ్యారు. గడిచిన మూడు నెలల్లో నగరంలో బ్యాంకుల ద్వారా పొందిన రుణాలు ఎన్ని? ఏఏ గ్రూపుల వారు తీసుకున్నారు? అసలు ఎన్ని.. బోగస్ ఎన్ని? అన్న దానిపై క్షేత్రస్థాయి నుంచి విచారణకు సిద్ధమయ్యారు.
ఆన్‌లైన్ రుసుం పేరుతో ఎస్టీలను మోసం చేసిన ఆర్పీ
పురుష గ్రూపుల రుణాల్లోనూ చేతివాటం
56 సంఘాలపై విచారణ కమిటీని నియమించిన మెప్మా పీడీ
ఒంగోలు, కార్పొరేషన్, మే 2 (ఆంధ్రజ్యోతి) : పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో బోగస్ గ్రూపులను సృష్టించి రూ.కోట్లు దోచుకున్న అవినీతి ఆర్పీలపై చర్యలు తీసుకునేందుకు మెప్మా పీడీ సిద్ధమయ్యారు. గడిచిన మూడు నెలల్లో నగరంలో బ్యాంకుల ద్వారా పొందిన రుణాలు ఎన్ని? ఏఏ గ్రూపుల వారు తీసుకున్నారు? అసలు ఎన్ని.. బోగస్ ఎన్ని? అన్న దానిపై క్షేత్రస్థాయి నుంచి విచారణకు సిద్ధమయ్యారు. అందుకోసం నలుగురు ఉద్యోగులను నియమించారు. అయితే అధికారుల వద్ద ప్రాథమికంగా కొంత సమాచారం ఉంది. మరింత లోతుగా విచారణకు సిద్ధమయ్యారు. ఇప్పటికే కేశవస్వామి పేటకు చెందిన యానాది సామాజికవర్గానికి చెందిన 14 పొదుపు సంఘాలు తమకు జరిగిన అన్యాయంపై రోడ్డెక్కి నిరసన తెలియజేయడంతో మెప్మా అధికారులు వారి వద్ద నుంచి వివరాలు సేకరించారు. దీంతో ఉలిక్కిపడిన కేశవస్వామిపేట బాధ్యతలు చూసే ఆర్పీ పొదుపు సంఘాల పేరుతో తాను తీసుకున్న సొమ్మును తిరిగి బ్యాంకులకు చెల్లిస్తానని, ఆ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని బతిమాలే ప్రయత్నం చేసినట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు జరిగిన మోసంతో తాము చాలా నష్టపోయామని తెలిపిన పొదుపు సంఘాల మహిళలు.. ఆన్‌లైన్ పేరుతో కూడా ఆర్పీ తమను మోసం చేసిందని వాపోయారు. వాస్తవానికి రుణాలకు సంబంధించి ఆన్‌లైన్ చేయడానికి ఎలాంటి ఫీజులు లేకపోయినా, వేలకు వేలు తీసుకున్నదని ఆరోపించారు. ఇదే విషయమై కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
ఆ ఆర్పీపై వేటు
మెప్మా అధికారులు సైతం కేశవస్వామిపేట ఆర్పీపై సీరియస్‌గా దృష్టి సారించారు. ఇప్పటికే తమ వద్ద ఉన్న సమాచారంతోపాటు, బ్యాంకుల వారీగా వివరాలు సేకరించి ఆ ఆర్పీని ఆ బాధ్యతల నుంచి తొలగించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంచితే అదే ఆర్పీ ఇప్పటికే ఏడు పురుషుల గ్రూపుల పేరుతో రుణాలు తీసుకుని సొంతానికి వాడుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. అయితే గతంలో ఆర్పీలుగా ఉంటూ అవినీతికి పాల్పడిన వారిని విధుల నుంచి తొలగించారు. వారు నేటికీ వారు ఆర్పీలుగా చెలామణి అవుతూ రుణాలు పేరుతో బ్యాంకులను బురిడీ కొట్టిస్తున్నారు. అలాంటి వారిపై శాఖాపరంగా చర్యలకు డ్వామా అధికారులు సిద్ధమైనట్లు తెలిసింది. దీంతో అక్రమాలకు పాల్పడిన ఆర్పీలలో ఆందోళన మొదలైంది. తాము చేసిన అవినీతి, అక్రమాలను సరిచేసుకునే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. అలాగే బోగస్ గ్రూపులకు సహకరించిన మెప్మా కార్యాలయ ఉద్యోగుల పాత్రపైనా అధికారులు దృష్టి సారించారు. ఇందులో కేవలం ఆర్పీలు మాత్రమే కాదని, సీఎంఎం, సీవోలు, కార్యాలయంలోని ఓ ఉద్యోగి కుమ్మక్కై ఈ తరహా దోపిడీకి పాల్పడినట్లు సమాచారం. మొత్తంగా మెప్మాలో బోగస్ గ్రూపుల బాగోతం వెలుగులోకి రావడంతో అందులో భాగస్వాములైన వారు ఉలిక్కిపడుతున్నారు. తమకు తెలిసిన దారుల్లో వాటిని కప్పిపుచ్చుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిసింది.