చింతతీర్చిన చిరుసాయం
ABN , Publish Date - Aug 25 , 2025 | 01:07 AM
చిరుసాయం ఆయన జీవితంలో కొత్త వెలుగులు తీసుకొచ్చింది. చిన్నతనం నుంచి రెండు కాళ్లు పనిచేయకున్నా.., ఆర్థికంగా సొంత కాళ్లపై నిలబడాలన్న ఆయన లక్ష్యానికి ఆ సాయమే ఉపకరించింది.
బల్లికురవ, ఆగస్టు 24 (ఆంద్రజ్యోతి): చిరుసాయం ఆయన జీవితంలో కొత్త వెలుగులు తీసుకొచ్చింది. చిన్నతనం నుంచి రెండు కాళ్లు పనిచేయకున్నా.., ఆర్థికంగా సొంత కాళ్లపై నిలబడాలన్న ఆయన లక్ష్యానికి ఆ సాయమే ఉపకరించింది. దివ్యాంగుండైన మల్లా శ్రీనుకు ఇటీవల మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్కూటీని అందజేయగా, దీనికి వెనుక ట్రాలీ బిగించుకొని ఆ ట్రాలీపై చిరువ్యాపారం చేస్తూ జీవనం వెళ్లదీస్తూ పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.
బల్లికురవ ఎస్టీ కాలనీకి చెందిన మల్లా శ్రీనుకు చిన్న తనం నుండే రెండు కాళ్లు పనిచేయడం లేదు. వివాహం అయిన సమయం నుంచి తన భార్యపైనే ఆధార పడి బతుకు బండిని నెట్టుకొస్తున్నాడు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బల్లికురవ గ్రామానికి వచ్చిన మంత్రి రవికుమార్‌ను మల్లా శ్రీను నేలపై పాకుతూ కనిపించాడు. స్పందించిన మంత్రి మూడు చక్రాల స్కూటీని అందిస్తాను నడుపుతావా..? అని అడిగి స్కూటీని అందజేశారు. అయితే కేవలం తన అవసరాల కోసం ఆ స్కూటీని వినియోగించకుండా కుటుంబానికి చేదోడుగా ఉండేలా చిరువ్యాపారం చేయడానికి శ్రీను స్కూటిని వినియోగిస్తున్నాడు. వెనుక చిన్న ట్రాలీని బిగించి దానిపై ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకుంటూ జీవనం వెళ్లదీస్తున్నాడు. భార్యను కూడా తనతోపాటు గ్రామాలకు తీసుకెళ్లి సాయత్రం వరకు ప్లాస్టిక్ సామాన్లు అమ్మకాలు చేపట్టి ఇంటికి వస్తున్నాడు. కాళ్లు పనిచేయకున్నా, తనకు మూడుచక్రాల వాహనం తన కుటుంబాన్ని పోషించుకుంటున్న దివ్వాంగుడు మల్లా శ్రీనును ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. ఆయనకు ముగ్గురు కుమారులు కాగా, తన తమ్ముడి కుమార్తెలకు తానే చేదోడు వాదోడుగా నిలుస్తున్నాడు.