చిన్నారిపై దాడి చేసింది చిరుతే
ABN , Publish Date - Aug 17 , 2025 | 10:49 PM
నల్లమల అటవీ ప్రాంతంలోని చిన్నారుట్ల గిరిజన గూడెంలో నిద్రిస్తున్న చిన్నారిపై దాడి చేసింది చిరుతేనని దోర్నాల రేంజ్ అధికారి హరి ఆదివారం తెలిపారు.
గూడెంవాసులు అప్రమత్తంగా ఉండాలన్న రేంజ్ అధికారి హరి
పెద్దదోర్నాల, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి) : నల్లమల అటవీ ప్రాంతంలోని చిన్నారుట్ల గిరిజన గూడెంలో నిద్రిస్తున్న చిన్నారిపై దాడి చేసింది చిరుతేనని దోర్నాల రేంజ్ అధికారి హరి ఆదివారం తెలిపారు. ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారిని చిరుత పులి నోట కరుచుకొని వెళ్తుండగా గమనించిన తల్లిదండ్రులు అంజయ్య, లింగేశ్వరి కేకలు వేయడంతో పాపను వదిలి పారిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అటవీ శాఖాధికారులకు పలు సందేహాలు ఏర్పడ్డాయి. చిన్నారిని తీసుకుపోయింది చిరుతపులా.. లేక మరేదైనా జంతువా.. అని ఆలోచనలో పడ్డారు. ఈ క్రమంలో గూడెం పరిసరాల్లో 15 చోట్ల నిఘా కెమెరాలను ఏర్పాటు చేసి, ఆ శాఖ సిబ్బంది మొబైల్ టీమ్ రహస్య పర్యవేక్షణ చేశారు. రెండ్రోజుల పాటు ఎలాంటి జంతువు జాడా సీసీ ఫుటేజీకి చిక్కలేదు. శనివారం రాత్రి గూడెం పరిసరాల్లో చిరుతపులి సంచరిస్తూ కెమెరాకు చిక్కింది. దీంతో అటవీ శాఖాధికారులు ఉన్నతాధికారులకు సమాచారాన్ని అందించారు. చిరుత పులి వల్ల ఎలాంటి నష్టం వాటిల్లక ముందే వారి ఆదేశాల మేరకు చిరుతను పట్టి మరేదైనా అభయారణ్యంలో వదలడమా, రక్షణ చర్యలు చేపట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తునట్లు ఎఫ్‌ఆర్‌వో హరి తెలిపారు. మనిషి రక్తం అలవాటు పడితే ప్రమాదకరమన్నారు. గూడెం వాసులు రాత్రివేళ బయటకు రావద్దని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలను జారీచేశారు. అటవీ శాఖ సిబ్బంది నిత్యమూ పర్యవేక్షిస్తుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హరి స్పష్టం చేశారు.