కిలో పొగాకు రూ.351
ABN , Publish Date - Nov 04 , 2025 | 12:35 AM
దక్షిణాది మార్కెట్లో సోమవారం పొగాకు కిలో గరిష్ఠ ధర రూ.351 పలికింది. ఈ సీజన్‌లో ఇదే అత్యధికం. గతంలో ఒకసారి కిలో రూ.346 వరకు వెళ్లి తిరిగి రూ.315కు దిగజారింది. అలా నడుస్తున్న మార్కెట్లో వారం రోజుల నుంచి క్రమంగా ధరల్లో పెరుగుదల కనిపించింది.
ఈ సీజన్‌లో ఇదే అధికం
వారం నుంచి గరిష్ఠ ధరలో పెరుగుదల
రెండు కేంద్రాల్లో ముగిసిన కొనుగోళ్లు
ఒంగోలు, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి) : దక్షిణాది మార్కెట్లో సోమవారం పొగాకు కిలో గరిష్ఠ ధర రూ.351 పలికింది. ఈ సీజన్‌లో ఇదే అత్యధికం. గతంలో ఒకసారి కిలో రూ.346 వరకు వెళ్లి తిరిగి రూ.315కు దిగజారింది. అలా నడుస్తున్న మార్కెట్లో వారం రోజుల నుంచి క్రమంగా ధరల్లో పెరుగుదల కనిపించింది. నాలుగు రోజుల క్రితం కిలో రూ.335, రెండు రోజుల క్రితం రూ.346 పలికింది. సోమవారం టంగుటూరు వేలం కేంద్రంలో ఏకంగా రూ.351 ధర లభించింది. మిగతా వాటిలో గరిష్ఠ ధర కిలో రూ.350గా ఉంది. నాలుగు రోజుల క్రితం సగటున 35శాతం నుంచి 40శాతం వరకు నోబిడ్‌లు ఉండగా సోమవారం అవి 22.50శాతానికి తగ్గాయి. దక్షిణాదిలో 11 వేలం కేంద్రాలు ఉండగా నెల్లూరు జిల్లా పరిధిలోని కలిగిరి, డీసీపల్లి కేంద్రాలలో శనివారంతో కొనుగోళ్లు ముగిశాయి. మిగిలిన తొమ్మిది కేంద్రాల్లో సాగుతుండగా ఈ వారంలో ఒంగోలు-2, కనిగిరి, పొదిలి కేంద్రాల్లో కూడా వేలం ముగుస్తుందని సమాచారం.