దేశభద్రత రంగంలో గొప్ప మైలురాయి
ABN , Publish Date - May 08 , 2025 | 10:47 PM
ఆపరేషన్ సిందూర్ విజయం దేశ భద్రత రంగంలో ఒక గొప్ప మైలు రాయిగా నిలిచిందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉగ్రవాదుల అణచివేతలో భారత సైన్యం ప్రదర్శించిన వ్యూహాత్మక ధైర్యసాహసాలు ప్రశంశనీయమని కొనియాడారు. ఈవిజయంతో దేశ శత్రువులకు గట్టి బుద్ధి చెప్పగలిగామన్నారు.
ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి
గిద్దలూరు టౌన్, మే 8 (ఆంధ్రజ్యోతి) : ఆపరేషన్ సిందూర్ విజయం దేశ భద్రత రంగంలో ఒక గొప్ప మైలు రాయిగా నిలిచిందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉగ్రవాదుల అణచివేతలో భారత సైన్యం ప్రదర్శించిన వ్యూహాత్మక ధైర్యసాహసాలు ప్రశంశనీయమని కొనియాడారు. ఈవిజయంతో దేశ శత్రువులకు గట్టి బుద్ధి చెప్పగలిగామన్నారు. భారత భద్రత దళాల శౌర్యం ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేసిందన్నారు. ప్రధానమంత్రి మోదీ దూరదృష్టి, రక్షణశాఖ సమర్థత, భద్రత వ్యవస్థల సమన్వయం ప్రధాన కారణమని పేర్కొన్నారు. దేశభద్రతకు మార్గదర్శకులుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌లో దేశ సైనిక రంగంలో మహిళల కీలక పాత్రను గర్వకారణంగా గుర్తించాలని, ఈకీలక చర్యల్లో ఆర్మీ లెఫ్ట్‌నెంట్ కల్నల్ సోఫియా ఖురేషీ, భారత వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ వ్యోమికాసింగ్ సమర్థత, నేతృత్వం, నిబద్ధత అత్యంత ప్రశంశనీయమని పేర్కొన్నారు. వీరి ధైర్యసాహసాలు భారతసైన్యంలో నూతనతరం మహిళలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. గిద్దలూరు నియోజకవర్గానికి చెందిన అనేక మంది యువకులు భారత సైన్యంలో సేవలందిస్తూ దేశరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్నారని, వారి ధైర్యం, దేశభక్తి, త్యాగ స్వభావం ఆదర్శప్రాయమన్నారు. ప్రతి సైనికుడికీ, అధికారికీ హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తూ దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే వీరులకు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి వినమ్ర వందనాలు అర్పించారు.
కంభం : పాకిస్థాన్‌లో ఉగ్రవాదుల స్థా వరాలపై ఆపరేషన్ సిందూర్‌ను విజయవంతంపై కంభం మాజీ సైనికుల సంఘం అభినందనలు తెలిపింది. ఉగ్రవాదుల స్థావరాలను ధ్వం సం చేసినందుకు మాజీ సైనికులు హర్షం వ్యక్తం చేశారు. పాక్ ప్రేరేతిత ఉగ్రవాదులు మతం ఆధారంగా కుట్రలు పన్ని హిందుస్థాన్‌లో మతాల మధ్య చిచ్చురేపాలని చూసిందన్నారు. ఆపరేషన్ సిం దూర్ విజయవంతం చేసినందుకు ప్రధాని మోదీకి మాజీసైనికులు అభినందనలు తెలిపారు.
గిద్దలూరు : ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడం పట్ల మాజీ ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. అమాయకులను పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదులపై, వారి స్థావరాలపై విజయవంతంగా దాడులు నిర్వహించి బుద్ధి చెప్పారని అభినందించారు. దేశం కోసం పోరాడుతున్న ఇండియన్ ఆర్మీకి, సైన్యానికి ప్రతి ఒక్కరూ తోడుగా, అండగా నిలువాలని కోరారు.