బండపై బాదుడు
ABN , Publish Date - Dec 18 , 2025 | 02:49 AM
జిల్లాలో గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వినియోగదారులపై భారం మోపుతున్నారు. డెలివరీ బాయ్స్ ద్వారా ఒక్కో బండపై బిల్లుకంటే రూ. 30 నుంచి రూ.50 వరకూ అదనంగా బాదేస్తున్నారు. రవాణా చార్జీల పేరుతో మరికొంత రాబట్టుకుంటున్నారు.
గ్యాస్ సిలిండర్‌లపై అదనంగా డెలివరీ చార్జి
ఐవీఆర్‌ఎస్ ద్వారా ఫిర్యాదులు
24 ఏజెన్సీలకు జేసీ షోకాజ్ నోటీసులు
అందులో 19 పశ్చిమప్రాంతంలోనివే
జిల్లాలో గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వినియోగదారులపై భారం మోపుతున్నారు. డెలివరీ బాయ్స్ ద్వారా ఒక్కో బండపై బిల్లుకంటే రూ. 30 నుంచి రూ.50 వరకూ అదనంగా బాదేస్తున్నారు. రవాణా చార్జీల పేరుతో మరికొంత రాబట్టుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీపం పథకంపై ప్రజల్లో సంతృప్తి శాతం తెలుసుకునేందుకు నిర్వహించిన ఐవీఆర్‌ఎస్ (ఇంటరాక్టివ్ వాయుస్ రెస్పాన్స్ సిస్టం)లో ఈ విషయం వెల్లడైంది. వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనిపై జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ సీరియస్ అయ్యారు. 24 ఏజెన్సీలకు నోటీసులు జారీ చేశారు. వాటిలో 19 పశ్చిమ ప్రాంత మండలాల్లోనివే కావడాన్ని బట్టి చూస్తే అక్కడ ఏజెన్సీల నిర్వాహకుల బాదుడు ఏస్థాయిలో కొనసాగుతుందో అర్థమవుతోంది.
త్రిపురాంతకం, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ, ప్రజాప్రతినిధుల పనితీరు, పథకాల అమలు.. ఇలా ప్రతిదానికీ సర్వే నిర్వహించే క్రమంలో ఐవీఆర్‌ఎస్ (ఇంటరాక్టివ్ వాయుస్ రెస్పాన్స్ సిస్టం) కాల్స్ బాగా ఉపయోగపడుతున్నాయి. ఈ నేపపథ్యంలో ఇటీవల గ్యాస్ వినియోగదారుల నుంచి ఐవీఆర్‌ఎస్ కాల్స్ ద్వారా ప్రభుత్వం సమాచారం రాబట్టగా జిల్లాలో గ్యాస్ బండపై బాదుడు గురించి ఇబ్బడిముబ్బడిగా ఫిర్యాదులు అందాయి. డెలివరీ బాయ్స్ ప్రవర్తన, అధికమొత్తం వసూళ్లు, రశీదులు ఇవ్వకపోవడం, డెలివరీ సమయంలో ఆన్‌లైన్ పేమెంట్‌కు అంగీకరించకుండా నగదు ఇవ్వాలని డిమాండ్ చేయడాన్ని వినియోగదారులు ప్రధానంగా ప్రస్తావించి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐవీఆర్‌ఎస్ ఫీడ్‌బ్యాక్ గణాంకాలను జాయింట్ కలెక్టర్లకు ప్రభుత్వం పంపించింది. తక్షణమే దీనిపై దృష్టి సారించి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించింది. దీంతో జిల్లాలో ఎక్కువ ఫిర్యాదులు అందిన 15 ఏజెన్సీలకు, గ్యాస్ డెలివరీ బాయ్స్ అదనంగా వసూళ్లు చేస్తున్నారన్న కారణంతో మరో 9 ఏజెన్సీలకు జేసీ నోటీసులు జారీ చేశారు.
వసూళ్లు షరామామూలే
వినియోగదారులు అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేయనప్పటికీ ఏళ్లతరబడి గ్యాస్ బండపై అదనపు బాదుడు వ్యవహారం నడుస్తూనే ఉంది. డెలివరీ బాయ్స్ వసూలు చేస్తున్న అదనపు మొత్తాల నుంచి వాటాలు తీసుకునే ఏజెన్సీ నిర్వాహకులు కొందరైతే, నామమాత్రపు జీతాలు ఇస్తూ అదనపు సంపాదనతో నెట్టుకురండి అని నియమించినవారు మరికొందరు. డెలివరీ సమయంలో చాలామంది వినియోగదారులకు అవగాహన లేకపోవడంతో బాయ్స్ అడిగినంత ఇచ్చి బండ తీసుకొంటున్నారు. ఇలా ప్రతి సిలిండర్‌పై తక్కువలో రూ.20 నుంచి రూ.40 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. ఇదే విషయం ఐవీఆర్‌ఎ్‌సకు స్పష్టంగా వినియోగదారులు చెప్పారు. ఆన్‌లైన్ ద్వారా పేమెంట్ చేసుకునే వెసులుబాటు ఉన్నా నగదు రూపంలోనే ఇవ్వాలని డెలివరీ బాయ్స్ కొందరు అడుగుతున్నారని ఫిర్యాదులు అందాయి. అలాగే సమీప గ్రామాల వినియోగదారుల నుంచి రవాణా చార్జీల పేరుతో భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారు. నిర్దేశిత దూరం వరకు చార్జీ లేకుండా గ్యాస్ అందించాల్సి ఉన్నప్పటికీ అందరివద్ద రవాణా చార్జీల పేరుతో వసూళ్లు చేస్తున్నట్లు వినియోగదారులు చెప్తున్నారు. స్థానిక సివిల్ సప్లై అధికారుల పర్యవేక్షణ కరువవడం, ఇతర అధికారిక తనిఖీలు లేకపోవడంతో ఏజెన్సీ నిర్వాహకులది కూడా ఆడిందే ఆటగా మారింది.
గ్రామాల్లో అనధికార రీఫిల్లింగ్ సెంటర్లు
గ్రామీణ ప్రాంతాల్లో చిన్నచిన్న గ్యాస్ స్టౌవ్‌లకు, ఇతర వినియోగాలకు రీఫిల్లింగ్ చేసే సెంటర్లు కూడా అనధికారికంగా గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు, డెలివరీబాయ్స్ ఆఽధీనంలో నడుస్తున్నాయి. వీరికి గృహ వినియోగ సిలిండర్‌లను అందజేస్తుండగా వాటితో ఇతర వినియోగాలకు రీఫిల్లింగ్ చేసి భారీగా ఆర్జిస్తున్నారు. అందులో అందరూ వాటాలు వేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వాస్తవంగా రీఫిల్లింగ్ సెంటర్లకు తప్పనిసరిగా ప్రభుత్వం లైసెన్స్ (అనుమతి) ఇవ్వాలి. తగిన ప్రామాణికాలు ఉంటేనే అనుమతిస్తారు. అగ్ని ప్రమాదాలు నివారించే పరికరాలతోపాటు రీఫిల్లింగ్‌ను సుశిక్షితులైన వారు మాత్రమే చేయాల్సి ఉంది. వీటన్నింటినీ తుంగలో తొక్కి అక్రమ వ్యాపారానికి చేదోడుగా ఏజెన్సీ నిర్వాహకులే వ్యవహరిస్తూ అనధికారిక రీఫిల్లింగ్ సెంటర్లను ప్రోత్సహిస్తున్నారు. ఇటువంటి సెంటర్లు పలుచోట్ల దర్శనమిస్తున్నాయి.
ఫిర్యాదులు వచ్చిన ఏజెన్సీలు ఇవీ..
పశ్చిమ ప్రాంతంలో వివిధ ఏజెన్సీలపై ఐవీఆర్ ఎస్‌లో వినియోగదారులు ఫిర్యాదులు చేశారు. వాటిలో కొమరోలు, పెద్దారవీడు, పుల్లలచెరువు, కనిగిరి, రాచర్లలో రెండు, అర్ధవీడు, మార్కాపురం, కురిచేడు, ఎర్రగొండపాలెంలో రెండు, కొనకనమిట్ల, ముండ్లమూరు, తాళ్లూరు, పొదిలి ఏజెన్సీలు ఉన్నాయి. వీటన్నింటికీ జేసీ గోపాలకృష్ణ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇకనుంచైనా తరచూ మండల, జిల్లాస్థాయి అధికారుల పర్యవేక్షణతో తనిఖీలు జరుగుతుంటే కొంతవరకైనా ఈ అక్రమ బాదుడు వ్యవహారాన్ని అరికట్టవచ్చని వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు.