Share News

విద్యాశాఖలో బదిలీల కోలాహలం

ABN , Publish Date - May 22 , 2025 | 01:43 AM

జిల్లా విద్యాశాఖలో బదిలీల కోలాహలం మొదలైంది. ఇప్పటికే ఉద్యోగుల స్థానచలనాలకు సంబంధించిన ప్రక్రియ నడుస్తోంది. దాన్ని ఈనెల 2లోపు పూర్తి చేయాలని పాఠశాల విద్య కమిషనర్‌ ఆదేశించారు. తాజాగా ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన షెడ్యూల్‌ విడుదలైంది.

విద్యాశాఖలో బదిలీల కోలాహలం
సమావేశంలో మాట్లాడుతున్న డీఈవో కిరణ్‌కుమార్‌

ఉపాధ్యాయుల స్థానచలనాలకు షెడ్యూల్‌ విడుదల

ఎంఈవోలతో డీఈవో సమావేశం

ఉద్యోగులకు సంబంధించి ఇప్పటికే మొదలైన ప్రక్రియ

ఒంగోలు విద్య, మే 21 (ఆంధ్రజ్యోతి) : జిల్లా విద్యాశాఖలో బదిలీల కోలాహలం మొదలైంది. ఇప్పటికే ఉద్యోగుల స్థానచలనాలకు సంబంధించిన ప్రక్రియ నడుస్తోంది. దాన్ని ఈనెల 2లోపు పూర్తి చేయాలని పాఠశాల విద్య కమిషనర్‌ ఆదేశించారు. తాజాగా ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన షెడ్యూల్‌ విడుదలైంది. దీంతో హడావుడి ప్రారంభమైంది. బదిలీల నిర్వహణ ఒక యజ్ఞమే. దీనికోసం ఖాళీల వివరాలు, ఇతర జాబితాల తయారీలో విద్యాశాఖ అధికారులు తలమునకలై ఉన్నారు.

ఖాళీలపై కసరత్తు

ఉపాధ్యాయ సంఘాల నాయకులతో కుదిరిన ఒప్పందం మేరకు మళ్లీ తాజాగా ఖాళీలపై కసరత్తు ప్రారంభించారు. హైస్కూళ్లలో ఒక సెక్షన్‌లో 49మందికిపైగా విద్యార్థులు ఉంటే రెండో సెక్షన్‌ చేయనున్నారు. అదేవిధంగా ఫౌండేషన్‌ స్కూళ్లలో 20మందికిపైగా విద్యార్థులు ఉంటే రెండో ఎస్జీటీ పోస్టు ఇవ్వమన్నారు. ఈ రెండు అంశాలపై తాజాగా కసరత్తు చేశారు. హైస్కూళ్లలో కొత్తగా రెండో సెక్షన్‌కు అనుమతించడంతో సుమారు 20చోట్ల కొత్తగా గణితం పోస్టు కేటాయించాల్సి వచ్చింది. సుమారు 10 ఇంగ్లీషు పోస్టులు కూడా అవసరమయ్యాయి. 30 ఫౌండేషన్‌ స్కూళ్లకు కొత్తగా రెండో ఎస్జీటీ పోస్టు కేటాయించారు. దీంతో ఖాళీల వివరాల్లో తేడాలు వచ్చాయి.

ఖాళీల వివరాల్లో తేడాలు వస్తే చర్యలు : డీఈవో

జిల్లాలోని ఖాళీల వివరాలను ఖరారు చేసేందుకు బుధవారం స్థానిక డీఆర్‌ఆర్‌ఎం మునిసిపల్‌ హైస్కూల్‌లో మండల విద్యాధికారుల సమావేశం నిర్వహించారు. డీఈవో కిరణ్‌కుమార్‌ హాజరై పలు సూచనలు చేశారు. తాజా మార్గదర్శకాల మేరకు మండలాల్లో ఖాళీలను ధ్రువీకరించాలని ఆదేశించారు. ఖాళీల ప్రకటనలో తేడా వస్తే సంబంధిత ఎంఈవోలే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. హెచ్‌ఎం ఖాళీలు, ఉమ్మడి జిల్లాలో గ్రేడ్‌-2 హెచ్‌ఎంల బదిలీలకు సంబంధించిన అన్ని వివరాలను బుధవారం మధ్యాహ్నమే వెబ్‌సైట్‌లో ఉంచారు. హెచ్‌ఎంలుగా ఒకేస్థానంలో ఐదేళ్లు పూర్తిచేసి తప్పనిసరిగా బదిలీ కావాల్సిన వారు, క్లియర్‌ వేకెన్సీలు, ఐదేళ్లు పూర్తయిన ఖాళీలను కూడా వెబ్‌సైట్‌లో పెట్టారు. హెచ్‌ఎంల బదిలీ దరఖాస్తు గడువు గురువారంతో ముగుస్తుంది. బదిలీ దరఖాస్తులను పరిశీలించడం, అభ్యంతరాలను పరిశీలించి పరిష్కరించేందుకు డీఈవో ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేస్తున్నారు.

Updated Date - May 22 , 2025 | 01:43 AM