కల సాకారం
ABN , Publish Date - Nov 26 , 2025 | 02:46 AM
మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా కావాలన్న పశ్చిమప్రాంత ప్రజల కల సాకారమైంది. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వారి ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త జిల్లా ఏర్పాటుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. మొత్తం నాలుగు నియోజకవర్గాలతో జిల్లా ఏర్పడనుంది.
మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా
నాలుగు నియోజకవర్గాలు, రెండు రెవెన్యూ డివిజన్లు
పశ్చిమ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన సీఎం చంద్రబాబు
ప్రకాశంలోకి తిరిగి అద్దంకి, కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గాలు
కొత్తగా అద్దంకి కేంద్రంగా రెవెన్యూ డివిజన్
అందులోకి దర్శి నియోజకవర్గం
మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులకు సీఎం ఆమోదం
నేడు కేబినెట్ సమావేశంలో అధికార ముద్ర
మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా కావాలన్న పశ్చిమప్రాంత ప్రజల కల సాకారమైంది. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వారి ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త జిల్లా ఏర్పాటుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. మొత్తం నాలుగు నియోజకవర్గాలతో జిల్లా ఏర్పడనుంది. అందులో రెండు డివిజన్లు ఉండనున్నాయి. తద్వారా ఉమ్మడి జిల్లాను నాటి వైసీపీ ప్రభుత్వం అశాస్ర్తీయంగా విభజించి చేసిన తప్పును ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా ప్రభుత్వం సరిచేసింది. ఇక అద్దంకి, కందుకూరు నియోజకవర్గాలు తిరిగి ప్రకాశం జిల్లాలోకి రానున్నాయి. అలాగే దర్శి, అద్దంకి నియోజకవర్గాలను కలిపి అద్దంకి డివిజన్ ఏర్పాటు చేయనున్నారు. బుధవారం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో అధికార ముద్ర పడిన వెంటనే ప్రక్రియ మొదలుకానుంది.
ఒంగోలు, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): పశ్చిమప్రాంతంలోని మార్కాపురం, గిద్దలూరు, వైపాలెం, కనిగిరి నియోజకవర్గాలతో మార్కాపురం కేంద్రంగా జిల్లా ఆవిర్భవించనుంది. అందులో మార్కాపురం, కనిగిరి రెవెన్యూ డివిజన్లు ఉంటాయి. వాటి పరిధిలో 21 మండలాలు ఉండనున్నాయి. గతంలో ఉమ్మడి జిల్లా నుంచి బాపట్ల జిల్లాలోకి వెళ్లిన అద్దంకి, నెల్లూరు జిల్లాలోకి వెళ్లిన కందుకూరు నియోజకవర్గాలు తిరిగి ఒంగోలు కేంద్రంగా ఉన్న ప్రకాశంలోకి చేరనున్నాయి. ఈ పరిధిలో ప్రస్తుతం ఒంగోలు రెవెన్యూ డివిజన్ ఉండగా గతం నుంచి డివిజన్ కేంద్రంగా ఉన్న కందుకూరు కలవడంతోపాటు కొత్తగా అద్దంకి డివిజన్ ఏర్పాటు కానుంది. ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతల సూచనలకు ప్రాధాన్యతనిస్తూ మంత్రివర్గ ఉపసంఘం ఈ మేరకు సిఫారసు చేసింది. వీటిపై విస్తృత కసరత్తు అనంతరం సీఎం చంద్రబాబునాయుడు మంగళవారం ఉపసంఘంతో జరిగిన భేటీలో గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.
అప్పట్లో పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం అనంతరం తొలిగా 1970లో ఒంగోలు కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పడిన విషయం విదితమే. అప్పటివరకు గుంటూరులో ఉన్న ఒంగోలు డివిజన్, నెల్లూరు జిల్లాలో ఉన్న కందుకూరు డివిజన్, కర్నూలు జిల్లాలో ఉన్న మార్కాపురం డివిజన్‌లను కలిపి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా ఒంగోలు జిల్లా ఏర్పాటు చేశారు. అనంతరం రెండేళ్లకు జిల్లాకు చెందిన ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు పేరును పెట్టారు. 52 ఏళ్ల తర్వాత వైసీపీ ప్రభుత్వంలో జిల్లాల పునర్విభజన జరగ్గా అశాస్ర్తీయంగా చేశారు. ఒంగోలుకు సుదూరంగా ఉన్న మార్కాపురం ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లా చేయాలని ఆప్రాంత ప్రజలు ఎన్నో ఏళ్లుగా కోరుతున్నా వారి కోరికను నాటి జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. పార్లమెంట్ స్థానం యూనిట్ పేరుతో పశ్చిమప్రాంతం మొత్తాన్ని ప్రకాశంలోనే ఉంచింది. ఒంగోలుకు సమీప ప్రాంతమైన కందుకూరు నియోజకవర్గాన్ని సుదూరమైన నెల్లూరు జిల్లాలోకి, అద్దంకి నియోజకవర్గాన్ని ఏరంకంగాను అనువు లేని బాపట్ల జిల్లాలోకి మార్చారు. ఆ మార్పుపై అన్ని ప్రాంతాల ప్రజల్లోను తీవ్ర నిరసన వ్యక్తమైనా ఆనాటి సీఎం జగన్ ఏ మాత్రం పట్టించుకోకుండా విభజన చేశారు.
ఇచ్చిన మాట ప్రకారమే జిల్లా
గత సాధారణ ఎన్నికల సమయంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు, కందుకూరు, అద్దంకి యోజకవర్గాలను తిరిగి ఒంగోలు జిల్లాలోకి చేర్చుతానని చంద్రబాబు, యువగళం పాదయాత్ర సమయంలో యువనేత నారా లోకేష్ స్పష్టమైన హామీ ఇచ్చారు. దానికి కట్టుబడి ప్రస్తుతం పునర్విభజనకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అయితే దర్శి నియోజకవర్గాన్ని కూడా తొలుత మార్కాపురం జిల్లాలోకి చేర్చుతారన్న చర్చ సాగినప్పటికీ ఆ ప్రాంత ప్రజల కోరిక మేరకు ప్రకాశంలోనే ఉంచుతున్నారు. అంతేకాక మంత్రి రవికుమార్ సూచన మేరకు కొత్తగా అద్దంకి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయనున్నారు. దర్శి నియోజకవర్గం మొత్తాన్ని అద్దంకి డివిజన్‌లోకి చేర్చనున్నారు. తద్వారా వారికి డివిజన్ కేంద్రం దగ్గరకానుంది. మరోవైపు మార్కాపురం జిల్లాతోపాటు ఆ ప్రాంతంలో గిద్దలూరు డివిజన్ ఏర్పాటును తొలుత పరిశీలన చేసినా తర్వాత దానిని ఆపేసి కనిగిరి డివిజన్‌లోకి గిద్దలూరు నియోజకవర్గం మొత్తాన్ని చేర్చనున్నారు. అలాగే మార్కాపురం, వైపాలెం నియోజకవర్గాలను మార్కాపురం డివిజన్‌లో ఉంచారు. తాజా పునర్విభజనపై మంత్రి స్వామి ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ అన్ని ప్రాంతాల ప్రజల ఆకాంక్ష, ఆప్రాంత ప్రజాప్రతినిధుల సూచనలను పరిగణనలోకి తీసుకునే సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. రెండు ప్రాంతాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రణాళికాబద్ధ కార్యాచరణతో అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధి అవకాశాల మెరుగునకు చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఇతర మంత్రివర్గ ఉపసంఘ సభ్యులకు ఈ సందర్భంగా ప్రజల పక్షాన స్వామి కృతజ్ఞతలు తెలిపారు.