Share News

సాగునీటి రంగానికి ఊతం

ABN , Publish Date - Dec 28 , 2025 | 11:25 PM

ఈ ఏడాది జిల్లాలోని సాగునీటి వనరుల పరిస్థితి గతం కన్నా మెరుగైంది. ఆ రంగానికి ప్రస్తుత ప్రజా ప్రభుత్వం ఊతం ఇచ్చింది. వెలిగొండ పనులు పుంజుకున్నాయి. వచ్చే సీజన్‌కు తొలిదశ పూర్తి లక్ష్యంగా జరుగుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన గుండ్లకమ్మ ప్రాజెక్టులో ప్రస్తుత ప్రభుత్వ చర్యలతో ఈ ఏడాది పూర్తిస్థాయిలో నీరు నిల్వ చేయగలిగారు.

సాగునీటి రంగానికి ఊతం
వెలిగొండ టన్నెల్‌ అంతర్భాగంలో జరుగుతున్న పనులు

ఆశాజనకంగా వెలిగొండ.. లైనింగ్‌ పనులు వేగవంతం

ఫీడర్‌ కాలువకు టెండర్లు.. వచ్చే సీజన్‌కు తొలివిడత పూర్తి

గుండ్లకమ్మలో పూర్తిస్థాయి నీటి నిల్వ

సంగమేశ్వరంపై ఉన్నతస్థాయిలో కదలిక

సాగర్‌ కాలువలు, చిన్ననీటి వనరులకు మరమ్మతులు

చెక్‌డ్యాంలు, చెరువుల అభివృద్ధికి చర్యలు

ఈ ఏడాది జిల్లాలోని సాగునీటి వనరుల పరిస్థితి గతం కన్నా మెరుగైంది. ఆ రంగానికి ప్రస్తుత ప్రజా ప్రభుత్వం ఊతం ఇచ్చింది. వెలిగొండ పనులు పుంజుకున్నాయి. వచ్చే సీజన్‌కు తొలిదశ పూర్తి లక్ష్యంగా జరుగుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన గుండ్లకమ్మ ప్రాజెక్టులో ప్రస్తుత ప్రభుత్వ చర్యలతో ఈ ఏడాది పూర్తిస్థాయిలో నీరు నిల్వ చేయగలిగారు. ఇది దిగువ ప్రాంత రైతులకు ఉపకరిస్తోంది. కొండపి నియోజకవర్గంలోని సంగమేశ్వరం రిజర్వాయర్‌పై కదలిక వచ్చింది. తాజా పరిస్థితులకు అనుగుణంగా ప్రాజెక్టు పూర్తికి కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఎన్‌ఎస్పీ కాలువలకు మరమ్మతులు చేయడంతో ప్రస్తుత సీజన్‌లో నీటి సరఫరా సజావుగా సాగుతోంది. జలసంరక్షణ కోసం డ్వామా ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు ప్రారంభమయ్యాయి. మొత్తంగా ఈ ఏడాది సాగునీటి రంగం ఆశాజనకంగా కనిపిస్తోంది.

ఒంగోలు, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : వైసీపీ పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన రంగాలలో నీటి పారుదల కూడా ప్రధానమైనది. ఆ ప్రబావం జిల్లాలోని కీలక ప్రాజెక్టులతోపాటు ఇతర వనరులపైనా పడింది. గత ఏడాది అధికారంలోకి వచ్చిన ప్రజా ప్రభుత్వం తిరిగి సాగునీటి రంగాన్ని గాడిన పెట్టే ప్రయత్నం చేసింది. ఈ ఏడాది మరింతగా దృష్టి సారించింది. జిల్లాలో ప్రత్యేకించి పశ్చిమప్రాంతానికి అత్యంత కీలకమైన వెలిగొండ ప్రాజెక్టు పరిస్థితి ఆశాజనకంగా ఉంది. 3.36 లక్షల ఎకరాలకు సాగునీరు, 15 లక్షల మందికి తాగునీరు, పలు పారిశ్రామిక అవసరాలకు ఇదే ఆధారం. అందులో అత్యంత కీలకమైన రెండో టన్నెల్‌ లైనింగ్‌ పనులు వేగంగా సాగుతున్నాయి. స్వయంగా జలవనరులశాఖ మంత్రి రెండు, మూడుసార్లు ప్రాజెక్టును సందర్శించి ఇచ్చిన ఆదేశాలతో ఆ పనులు కదిలాయి. సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి, నిరంతర పర్యవేక్షణ ప్రాజెక్టుపై కొనసాగుతోంది. ఈ క్రమంలో గత వైసీపీ ప్రభుత్వంలో పెండింగ్‌ పెట్టిన బిల్లులతోపాటు ఈ ఏడాది చేసిన పనులకు సంబంధించి సుమారు రూ.350 కోట్ల బిల్లుల చెల్లింపులు కూడా జరిగాయి. అత్యంత కీలకమైన ఫీడర్‌ కాలువ ఆధునికీకరణకు రూ.476 కోట్లు మంజూరుతోపాటు సత్వరం టెండర్లు పిలిచి పనులను చేపట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇతర పెండింగ్‌ పనుల్లోనూ కదలిక వచ్చింది. మొంథా తుఫాన్‌తో పనులకు తీవ్ర ఆటంకం ఏర్పడగా.. మంత్రి నిమ్మల వచ్చి పరిశీలించి అధికారులపై ఒత్తిడి పెట్టి మరీ తిరిగి పనులు సాగేలా చేయడం ద్వారా వచ్చే సీజన్‌కు వెలిగొండ నీరు వస్తుందన్న నమ్మకాన్ని ప్రజల్లో కలిగించారు.


సంగమేశ్వరంపై ప్రత్యేక దృష్టి

కొండపి నియోజకవర్గంలోని సంగమేశ్వరం రిజర్వాయర్‌పై అక్కడి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి డాక్టర్‌ స్వామి చొరవచూపడంతో ఉన్నత స్థాయిలో అధికారులు దృష్టి సారించారు. తాజా పరిస్థితులకు అనుగుణంగా ప్రాజెక్టు పూర్తికి కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. అలాగే మీడియం ఇరిగేషన్‌లో ఉమ్మడి జిల్లాలో ఉన్న రాళ్లపాడు, మోపాడు రిజర్వాయర్లు, కంభం చెరువు, పీబీ ఆనకట్ట వంటివాటిలోకి పుష్కలంగా నీరు రావడంతో ఆయకట్టుకు ఇవ్వగలిగారు. వాటితోపాటు చిన్న నీటివనరులుగా ఉన్న వందలాది చెరువులలో అత్యవసర మరమ్మతులకు అవసరమైన నిధులను ప్రభుత్వం ఇచ్చింది. సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించడంతో వారి పర్యవేక్షణలో ఆ పనులు చేపట్టారు.

జలసంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు

ఉమ్మడి జిల్లాలోని సాగు, తాగునీటికి ప్రధా న వనరుగా ఉండే ఎన్‌ఎస్పీ కాలువల మరమ్మతులు కూడా ఈ ఏడాది అవసరాలకు అనుగుణంగా చేశారు. గత వైసీపీ పాలనలో ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడంతో పం ట కాలువలు మొదలు బ్రాంచి కాలువల వర కు ఆధ్వానంగా మారి నీటి సరఫరాకు ఆటంకాలు ఎదురయ్యాయి. ప్రస్తుత ప్రజా ప్రభు త్వం ఈ ఏడాది కాలువల అత్యవసర మరమ్మతులకు నిధులు ఇవ్వడంతో నీటి సంఘాల ఆధ్వర్యంలో అధికారులు పనులు చేయించారు. దీంతో ప్రస్తుత సీజన్‌లో నీటి సరఫరా సజావుగా సాగుతోంది. ఇక జలసంరక్షణ కోసం డ్వామా ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు ప్రారంభమయ్యాయి. మొత్తంగా ఈ ఏడాది సాగునీటి రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వడంతో ఆది కాస్తంత ఆశాజనకంగా కనిపిస్తోంది.

నాడు నిర్లక్ష్యం.. నేడు నిండుకుండ

గత వైసీపీ ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన గుండ్లకమ్మ ప్రాజెక్టులో ప్రస్తుత ప్రభుత్వ చర్యలతో ఈ ఏడాది పూర్తిస్థాయిలో నీరు నిల్వ చేయగలిగారు. గతంలో ఒకట్రెండు గేట్లకు అత్యవసర మరమ్మతులు కూడా చేయించని వైసీపీ ప్రభుత్వం నిర్వాకం వల్ల వరద నీటికి గేట్లు కొట్టుకుపోయి రెండు, మూడేళ్లు ఆయకట్టుకు నీరందక రైతులు తీవ్రంగా నష్టపోయారు. అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి మొత్తం గేట్ల మరమ్మతులు పూర్తి చేయించింది. దాని వల్ల ఈ ఏడాది ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో (3.50టీఎంలు) నీటి నిల్వ చేసే పరిస్థితి ఏర్పడింది. అంతేకాక మొంథా తుపాన్‌ సమయంలో ఒక రోజు రాత్రి లక్షా 65వేల క్యూసెక్కుల భారీ వరద వచ్చినా గేట్లు తట్టుకొని నిలబడ్డాయి.

Updated Date - Dec 28 , 2025 | 11:25 PM