మహిళా సాధికారతకు పెద్దపీట!
ABN , Publish Date - Aug 16 , 2025 | 12:17 AM
మహిళ సాధికారత కోసం కూటమి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలన్నీ వెనుకడుగు వేయకుండా అమలు చేస్తున్నామని, అందులో భాగంగా స్త్రీశక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం కల్పిస్తున్నట్లు రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి పేర్కొన్నారు.
సూపర్ సిక్స్ హామీలన్నీ అమలు చేస్తున్నాం..
జగన్‌లాగాప్రజలను మోసం చేయలేదు.. : మంత్రి స్వామి
ఒంగోలులో మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ప్రారంభం
హాజరైన ఎంపీ మాగుంట, ఎమ్మెల్యేలు దామచర్ల, బీఎన్, కలెక్టర్ అన్సారియా
ఒంగోలు కార్పొరేషన్, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి) : మహిళ సాధికారత కోసం కూటమి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలన్నీ వెనుకడుగు వేయకుండా అమలు చేస్తున్నామని, అందులో భాగంగా స్త్రీశక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం కల్పిస్తున్నట్లు రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి పేర్కొన్నారు. స్త్రీశక్తి పథకం ద్వారా ఆర్టీసీ మహిళలకు ఉచితంగా ప్రయాణం పథకాన్ని మంత్రి స్వామి శుక్రవారం ఒంగోలులో లాంఛనంగా ప్రారంభించారు. స్థానిక ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ తమీమ్‌అన్సారియా, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బీఎన్.విజయ్‌కుమార్, మారటోరియం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, దర్శి ఇన్‌చార్జి గొట్టిపాటి లక్ష్మి, మేయర్ గంగాడ సుజాత, ఒడా చైర్మన్ షేక్ రియాజ్‌లతో కలిసి ఉచిత బస్సులను ప్రారంభించారు. అనంతరం మంత్రి స్వామి మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా మహిళలకు ఆర్టీసీ ఉచితంగా ప్రయాణించే పథకం ప్రారంభించడం సంతోషంగా ఉందని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళులాగా భావిస్తుందని తెలిపారు. లోటు బడ్జెట్‌లు ఉన్నప్పటికీ సూపర్‌సిక్స్ హామీలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. గడిచిన ఐదేళ్ళు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అరాచకాలు చేసిన జగన్ ప్రజల సంక్షేమాన్ని విస్మరించారని మంత్రి ఆరోపించారు. జగన్‌లాగా మోసం చేయలేదని, అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. పేదలకు త్వరలోనే ఇచ్చే ఇళ్ళ పట్టాలు కూడా మహిళల పేరుతో ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. ఎంపీ మాగుంట మాట్లాడుతు ఆర్టీసీ మహిళలకు ఉచిత ప్రయాణం వారికి ఎంతో ప్రయోజనం కలిగిస్తుందని చెప్పారు. ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ ప్రతి ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. స్త్రీశక్తి పథకం మరింత సమర్ధవంతంగా అమలు చేస్తామని తెలిపారు ఎమ్మెల్యే బీఎన్. విజయ్‌కుమార్ మాట్లాడుతూ ఇచ్చిన హామీలన్నీ సమర్ధవంతంగా అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు. కలెక్టర్ అన్సారియా మాట్లాడుతూ మహిళకు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణించడం కోసం జిల్లాలో 316 బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. అలాగే ఐదు ప్రధాన బస్‌డిపోలు, 20 సాధారణ బస్‌స్టాండ్‌లలో మౌలిక వసతులు కల్పించామని, అలాగే ప్రయాణం సమయంలో మహిళలకు మరింత భద్రత ఉండేలా అవసరమైన చర్యలు తీసుకుననట్లు చెప్పారు. ఈ సందర్భంగా విజయవాడలో సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించిన కార్యక్రమాన్ని ప్రయాణికులు వీక్షించేందుకు ఆర్టీసీ అధికారులు ఎల్‌ఈడీ స్ర్కీన్‌లు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఆర్‌ఎం సత్యనారాయణ, డిపో మేనేజర్ శ్రీనివాసరావు, సూపరింటెండెంట్ బి.ఫణికుమార్, టీడీపీ నాయకులు, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే దామచర్ల స్వయంగా బస్సును నడపగా మంత్రి స్వామి, సత్య, బీఎన్.విజయ్‌కుమార్, గొట్టిపాటి లక్ష్మిలతోపాలు పలువురు మహిళలు బస్సులో ప్రయాణించారు.
ఉచిత ప్రయాణంపై సర్వత్రా హర్షం
కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రారంభిం చడంపై వృద్ధులు, విద్యార్థినులు, గృహిణుల హర్షం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీశైలం వెళ్లి వస్తా..
- డక్కుల లక్ష్మమ్మ, రామలేరు గ్రామం
ఎన్నో సంవత్సరాల నుంచి శ్రీశైలం వెళ్ళాలని కోరిక ఉంది. అయితే అంత డబ్బులు లేక ఆశ తీరలేదు. అయి తే చంద్రబాబు పుణ్యమా అని ఒక్కసారి అయినా ఉచిత ప్రయాణంతో శ్రీశైలం వెళ్ళి వస్తాను. తరువాత విజయ వాడ కనకదుర్గ అమ్మవారిని కూడా చూడాలి. ఇన్నాళ్ళకు నా కోరిక తీర బోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది.
చాలా సంతోషంగా ఉంది..
- వెన్నెల, విద్యార్థిని, ఒంగోలు
చాలా చాలా హ్యాపీగా ఉంది. ఆర్టీసీ బస్సు ల్లో ఉచిత ప్రయాణం కల్పించడం విద్యార్థినుల కు ఎంతో ఉపయోగపడుతుంది. నేను ఒంగోలు లో బీటెక్ చదువుతున్నాను. నా ఫ్రెండ్స్ చాలా మంది ఇతర ప్రాంతాల నుం చి వస్తుంటారు. ప్రతిరోజు బస్సులో వచ్చి, అక్కడ నుంచి కాలేజీకి ఆటోలో రావాలి. వాళ్ళకి రోజుకు రూ.150 ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఆ బాధ లేదు. హ్యాపీగా బస్సులో ఫ్రీగా ప్రయాణం చేయొచ్చు. ఈ పథకం విద్యార్థినులకు మేలు జరుగుతుంది. బస్‌పాస్‌లు కూడా తీసుకునే పనిలేదు.