Share News

రేషన్‌ తీసుకుంది 86.55 శాతం

ABN , Publish Date - Jul 18 , 2025 | 11:22 PM

జిల్లాలో రేషన్‌ పంపిణీ ప్రక్రియ ముగిసింది. జిల్లాలో జూలై నెలకు సంబంధించి ఈనెల 1 నుంచి రేషన్‌ పంపిణీ ప్రక్రియ ప్రారంభించగా ఈనెల 15వ తేదీతో ఆ ప్రక్రియముగిసింది.

రేషన్‌ తీసుకుంది 86.55 శాతం

ముగిసిన పంపిణీ ప్రక్రియ

ఒంగోలు మండలంలో అత్యధికంగా 93.23శాతం నమోదు

జిల్లాలో 6,61,187 తెల్ల కార్డులకుగాను 5,72,237 మంది బయోమెట్రిక్‌

వైసీపీ హయాంలో 60 శాతంలోపే

ఒంగోలు కలెక్టరేట్‌, జూలై 18 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో రేషన్‌ పంపిణీ ప్రక్రియ ముగిసింది. జిల్లాలో జూలై నెలకు సంబంధించి ఈనెల 1 నుంచి రేషన్‌ పంపిణీ ప్రక్రియ ప్రారంభించగా ఈనెల 15వ తేదీతో ఆ ప్రక్రియముగిసింది. జిల్లాలో 1,392 రేషన్‌ షాపుల పరిధిలో 6,61,187 తెల్లకార్డులు ఉండగా అందులో 5,72,237 మంది బియ్యాన్ని తీసుకున్నారు. అంటే ప్రతి వంద మందిలో 87 మంది రేషన్‌ తీసుకున్నారు. అలా జిల్లా వ్యాప్తంగా 86.55 శాతం మంది తమ రేషన్‌ తీసుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మొబైల్‌వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్‌ పంపిణీ ప్రక్రియ చేపట్టినా 50నుంచి 60శాతం మందిలోపు మాత్రమే రేషన్‌ అందేవి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్డుదారులకు సకాలంలో నిత్యవసర సరుకులు అందించేందుకు గత నెల నుంచి రేషన్‌షాపుల ద్వారానే బియ్యం పంపిణీ చేపట్టింది. రేషన్‌షాపుల ద్వారా ఉదయం, సాయంత్రం సమయంలో రెండు పూటల కార్డుదారులకు సరుకులు ఇస్తుండటంతో వారి సమయానుకూలంగా ఉన్న సమయంలో ఆయా రేషన్‌షాపుల వద్ద సరుకులు తీసుకుంటున్నారు.

ఒంగోలులో అత్యధిక పంపిణీ

ఒంగోలు అర్బన్‌, రూరల్‌ మండలాల్లో 108 రేషన్‌షాపులు ఉండగా ఆ షాపుల పరిధిలో 64,790 కార్డులు ఉండగా 60,405 మంది రేషన్‌ తీసుకున్నారు. అంటే దాదాపు 93.23శాతం మంది తమ రేషన్‌సరుకులను తీసుకున్నారు. సీఎ్‌సపురం మండలంలో 35 రేషన్‌షాపుల పరిధిలో 11,832 రేషన్‌కార్డులు ఉండగా 8,725 మంది రేషన్‌ తీసుకున్నారు. సుమారు 73.74 శాతం మంది మాత్రమే తీసుకున్నారు. ఇక మిగిలిన మండలాల్లో 76శాతం నుంచి 90శాతం మేర లబ్ధిదారులు తమ రేషన్‌ను తీసుకున్నారు. ప్రజాప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో కార్డుదారులందరూ సకాలంలో రేషన్‌ తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయి.

Updated Date - Jul 18 , 2025 | 11:22 PM