అట్టడుగున 74,530 కుటుంబాలు
ABN , Publish Date - May 04 , 2025 | 01:33 AM
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పీ4 సర్వేలో అట్టడుగు స్థాయిలో జిల్లాలోని 74,530 కుటుంబాలు ఉన్నట్లు గుర్తించారు. వాటి ఆర్థికాభివృద్ధికి దాతల సాయంతో జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టాల్సి ఉంది. పేదరిక నిర్మూలనే ప్రధాన లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పీ4 కార్యక్రమాన్ని చేపట్టిన విషయం విదితమే.
పీ4 సర్వేలో గుర్తింపు
ప్రభుత్వం నుంచి గ్రామాలవారీగా జిల్లా అధికారులకు జాబితా
బంగారు కుటుంబాలుగా ప్రకటించి ఆర్థికాభివృద్ధి చర్యలకు ఆదేశం
ఒంగోలు మే 3 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పీ4 సర్వేలో అట్టడుగు స్థాయిలో జిల్లాలోని 74,530 కుటుంబాలు ఉన్నట్లు గుర్తించారు. వాటి ఆర్థికాభివృద్ధికి దాతల సాయంతో జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టాల్సి ఉంది. పేదరిక నిర్మూలనే ప్రధాన లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పీ4 కార్యక్రమాన్ని చేపట్టిన విషయం విదితమే. వివిధ సామాజిక, ఆర్థిక అంశాల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా సచివాలయం యూనిట్‌గా పీ4 సర్వేను నిర్వహించింది. అందులో మొత్తం 27 అంశాలపై ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరించి వాటి ఆధారంగా ఆ కుటుంబాల ఆర్థిక స్థితిగతులను అంచనా వేశారు. అందులో అట్టడుగు స్థాయిలో ఉన్న 20శాతం కుటుంబాలను పీ4 కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఉగాది పర్వదినం రోజున అమరావతిలో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌లు ప్రారంభించారు. పేదరికంలో అట్టడుగున ఉన్న కుటుంబాల అభివృద్ధి లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో లబ్ధిదారులైన పేద కుటుంబాలను బంగారు కుటుంబంగా, అందుకు సహకరించే దాతలను మార్గదర్శిగా నామకరణం చేశారు.
వచ్చే ఉగాదికి పూర్తి
ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి ఒకస్థాయికి ఈ కార్యక్రమాన్ని చేర్చి వచ్చే ఏడాది ఉగాది నాటికి పూర్తిస్థాయి ఫలితాలు అందేలా చేయాలన్నది ప్రభుత్వ సంకల్పం. పీ4 సర్వే ఆధారంగా ఆయా జిల్లా, మండలం, సచివాలయం వారీగా పేదరికంలో అట్టడుగున ఉన్న కుటుంబాల జాబితాలను ప్రకటించింది. ఆ ప్రకారం జిల్లాలో 74,530 కుటుంబాలను పీ4 కార్యక్రమం కింద ఆర్థికంగా అభివృద్ధి చేయాలి. అందుకు సంబంధించిన జాబితాలు జిల్లా యంత్రాంగానికి అందాయి. జిల్లాలోని 38 మండలాల్లోని సచివాలయాల పరిధిలో 5.89 లక్షల కుటుంబాలను యంత్రాంగం సర్వే చేసి ప్రభుత్వానికి నివేదించింది. ఆ ప్రకారం ఆర్థికంగా వెనుకబడి ఉన్న 20శాతం చూస్తే సుమారు లక్షా 20వేల కుటుంబాలు ఆర్థిక సహకారం అందించాలి. అయితే 74,550 కుటుంబాల జాబితాలను పంపించారు.
గరిష్ఠంగా టంగుటూరు మండలంలో..
ప్రభుత్వం నుంచి సమగ్రంగా వివరాలు అందడంతో తదుపరి చర్యలపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. పట్టణాల్లో గరిష్ఠంగా ఒంగోలు అర్బన్‌లో 7,809 కుటుంబాలు అట్టడుగున ఉన్నాయి. కనిష్ఠంగా దర్శిలో 610 ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే గరిష్ఠంగా టంగుటూరు మండలంలో 3,037 కుటుంబాలు, కనిష్ఠంగా పొదిలి మండలంలో 601 కుటుం బాలు ఉన్నట్లు ప్రభుత్వం పంపిన జాబితాలో పేర్కొంది.