టీచర్ల బదిలీలకు 6,797 దరఖాస్తులు
ABN , Publish Date - May 29 , 2025 | 01:40 AM
ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీలకు 6,797 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుకు మంగళవారంతో గడువు ముగిసింది. ప్రస్తుతం సెకండరీ గ్రేడ్ టీచర్ల దరఖాస్తుల పరిశీలన జరుగుతోంది. ప్రాథమిక పాఠశా లల హెచ్‌ఎంలు, గ్రేడ్-2 హెచ్‌ఎంలు, స్కూలు అసిస్టెంట్ల దరఖాస్తుల పరిశీలన పూర్త యింది.
4,092 మందికి తప్పనిసరి మార్పు
ముఖంచాటేసిన 93 మంది
ఒంగోలు విద్య, మే 28 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీలకు 6,797 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుకు మంగళవారంతో గడువు ముగిసింది. ప్రస్తుతం సెకండరీ గ్రేడ్ టీచర్ల దరఖాస్తుల పరిశీలన జరుగుతోంది. ప్రాథమిక పాఠశా లల హెచ్‌ఎంలు, గ్రేడ్-2 హెచ్‌ఎంలు, స్కూలు అసిస్టెంట్ల దరఖాస్తుల పరిశీలన పూర్త యింది. వీరికి సంబంధించిన ప్రాథమిక సీనియారిటీ జాబితాలు కూడా విడుదల య్యాయి. బదిలీలకు హైస్కూల్ గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయులు 141 మంది, ప్రాథమిక పాఠశాలల హెచ్‌ఎంలు 149 మంది, సెకండరీ గ్రేడ్ టీచర్లు 3,531 మంది, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, హిందీ, ఇంగ్లీషు 1,696 మంది, స్కూల్ అసిస్టెంట్ గణితం, పీఎస్, బీఎస్, సోషల్, పీడీలు 1,233 మంది, పీఈటీలు 32 మంది, మ్యూజిక్ టీచర్ ఒకటి, తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం భాషా పండితులు 14 మంది కలిపి మొత్తం 6,797 మంది దరఖాస్తు చేసుకున్నారు.
4,092 మంది తప్పనిసరి బదిలీ
జిల్లాలో దరఖాస్తు చేసిన వారిలో 4,092 మంది తప్పని సరిగా బదిలీ కావాల్సి ఉంది. వీరిలో ఒకే పాఠశాలలో 8 సంవత్సరాలు, ఐదేళ్లు పూర్తయిన టీచర్లు ఉన్నారు. తప్పనిసరి బదిలీల్లో గ్రేడ్ -2 హెచ్‌ఎంలు 14 మంది, పీఎస్ హెచ్‌ఎంలు 27 మంది, ఎస్‌జీటీలు 2,438 మంది, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, హిందీ, ఇంగ్లీషు 954 మంది, గణితం, పీఎస్, బీఎస్, సోషల్ స్టడీస్ 626 మంది, పీఈటీలు 12 మంది, మ్యూజిక్ టీచర్ ఒకరు, తెలుగు, హిందీ, సంస్కృతం భాషా పండితులు 10 మంది ఉన్నారు. అభ్యర్థన మేరకు బదిలీ కోసం 2,705 మంది దరఖాస్తు చేశారు.
దరఖాస్తు చేయని 93 మంది
పాఠశాల విద్య కమిషనర్ వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం తప్పనిసరిగా బదిలీ కావాల్సిన 999మంది దరఖాస్తు చేసుకోగా జిల్లాలో 93మంది తప్పించుకున్నారు. నిబంధనల ప్రకారం ఒక పాఠశాలలో ఎనిమిది సంవత్సరాలు పూర్తయిన వారు టీచర్ల పునర్విభజనకు గురైన వారు తప్పనిసరిగా బదిలీకి దరఖాస్తు చేసుకోవాలి. అయితే జిల్లాలో 93మంది బదిలీకి దరఖాస్తు చేయకుండా ముఖం చాటేశారు. వీరిని బదిలీల ప్రక్రియ పూర్తయిన తర్వాత మిగిలిపోయిన వాటిలో 4వ కేటగిరీ స్థానాల్లో నియమిస్తారు.
అయ్యోర్లకు అగచాట్లు
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో హైస్కూల్ ప్రధానోపాధ్యాయుల బదిలీలు, ఉద్యోగోన్నతల ప్రక్రియ మొత్తం గజిబిజి గందరగోళంగా మారింది. జిల్లా అధికారుల అనాలోచిత నిర్ణయంతో అయ్యోర్లు స్థానిక డీఆర్‌ఆర్‌ఎం మునిసిపల్ హైస్కూల్లో చిమ్మచీకట్లో పడిగాపులు పడాల్సి వచ్చింది. పాఠశాల విద్యా కమిషనర్ ప్రకటించిన షెడ్యూల్‌ను అధికారులు బేఖాతరు చేయడంతో ఈ పరిస్థితి దాపురించింది. ఈనెల 30న జరగాల్సిన హెచ్‌ఎం ఉద్యోగోన్నతుల ప్రక్రియను రెండు రోజులు ముందుగా బుధవారం రాత్రి చేపట్టడంతో హెచ్‌ఎంల సినియారిటీ జాబితాలోని స్కూల్ అసిస్టెంట్‌లు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. జిల్లా నలుమూలల నుంచి వందల కిలోమీటర్లు ప్రయాణించి తీవ్ర వ్యయప్రయాసలకు లోనయ్యారు. చివరికి గురువారానికి వాయిదా వేయడంతో ఉసూరుమంటూ తిరుగుబాట పట్టారు.
కమిషనర్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ప్రధానోపాధ్యాయుల బదిలీల సీనియారిటీ జాబితా ఈనెల 27 ప్రకటించాల్సి ఉండగా ఆ జాబితా 28వ తేదీ రాత్రి 8 గంటలకు కూడా అతీగతి లేదు. ప్రధానోపాధ్యాయుల బదిలీల ఉత్తర్వులు ఈనెల30న విడుదల చేయాల్సి ఉంది. అదేరోజు హెచ్‌ఎంలుగా స్కూల్ అసిస్టెంట్‌లకు ఉద్యోగోన్నతి కల్పించాల్సి ఉంది. బుధవారం నిర్వహించిన అపెక్స్ సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ బుధవారం సాయంత్రానికి హెచ్‌ఎం బదిలీ ఉత్తర్వులు విడుదల చేస్తున్నామని, వెంటనే పదోన్నతల ప్రక్రియను చేపట్టాలని ఆర్జేడీ, డీఈవోలను ఆదేశించారు. బుధవారం వీలుకాని వారు గురువారం హెచ్‌ఎంల కౌన్సెలింగ్ నిర్వహించుకోవచ్చని చెప్పారు. అయితే బుధవారమే కౌన్సెలింగ్ నిర్వహించాలని డీఈవో, ఆర్జేడీ నిర్ణయించారు. అన్ని ఉపాధ్యాయ సంఘాల గ్రూపుల్లో సమాచారం పంపారు. బుధవారం సాయంత్రం హెచ్‌ఎంల పదోన్నతల కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని, హెచ్‌ఎంల సీనియారిటీ జాబితాలోని అందరూ హాజరుకావాలని అందులో ఆదేశించారు. ఆ జాబితాలోని ఉపాధ్యాయులు ఆఘమేఘాలపై బయలుదేరి ఒంగోలు చేరుకుని పడిగాపులు కాశారు. రాత్రి 8 గంటల వరకూ చీకట్లోనే వేచిచూశారు. ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతుల సీనియారిటీ జాబితాపై చెప్పిన అభ్యంతరాలను పరిష్కరించకుండా ప్రమోషన్ కౌన్సెలింగ్‌కు పూనుకోవడంపై మండిపడ్డారు. కౌన్సెలింగ్‌ను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు డీఈవో ప్రకటించడంతో ఉసూరుమంటూ వెనుదిరిగారు.