జిల్లాకు 6.61 లక్షల స్మార్ట్ రేషన్ కార్డులు
ABN , Publish Date - Sep 27 , 2025 | 01:21 AM
రేషన్ పంపిణీలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం తాజాగా కార్డుదారులకు స్మార్ట్ కార్డుల జారీకి చర్యలు తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పంపిణీ చేసింది. మన జిల్లాకు శుక్రవారం చెన్నై నుంచి ప్రత్యేక వాహనంలో స్మార్ట్ కార్డులను తీసుకొచ్చారు.
చెన్నై నుంచి నేరుగా మండల కేంద్రాలకు తరలింపు
త్వరలో డీలర్ల ద్వారా పంపిణీకి చర్యలు
ఒంగోలు కలెక్టరేట్, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి) : రేషన్ పంపిణీలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం తాజాగా కార్డుదారులకు స్మార్ట్ కార్డుల జారీకి చర్యలు తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పంపిణీ చేసింది. మన జిల్లాకు శుక్రవారం చెన్నై నుంచి ప్రత్యేక వాహనంలో స్మార్ట్ కార్డులను తీసుకొచ్చారు. జిల్లాలో 6.61 లక్షల రేషన్ కార్డులు ఉండగా వాటి స్థానంలో స్మార్ట్ కార్డులు ఇవ్వనున్నారు. దీన్ని ఏటీఎం కార్డు తరహాలో రూపొందించారు. కార్డుదారుడి ఫొటోతోపాటు కుటుంబ సభ్యులు, ప్రభుత్వ గుర్తింపు ముద్ర మాత్రమే ఉంటాయి. ఆ కార్డు ద్వారా సులభతరంగా రేషన్ దుకాణాల నుంచి సరుకులు తీసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. వేలిముద్రలు పడకపోయినా ఆ కార్డును స్కాన్ చేసి రేషన్ తీసుకోవచ్చు. ఈ స్మార్ట్ కార్డులను చెన్నై నుంచి నేరుగా మండలాలకు వాహనాల్లో చేరుస్తున్నారు. వాటిని తహసీల్దార్ల ద్వారా డీలర్లకు అందజేస్తారు. వచ్చేనెల మొదటివారం లోపు కార్డుదారులకు పంపిణీ చేయనున్నట్లు సమాచారం.