టీచర్ల బదిలీలకు 4,652 దరఖాస్తులు
ABN , Publish Date - May 25 , 2025 | 01:25 AM
ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి శనివారం సాయంత్రానికి 4,652 దరఖాస్త్తులు వచ్చాయి. ఇప్పటికే గ్రేడ్ టూ ప్రధానోపాధ్యాయులకు దరఖాస్తు గడువు ముగిసింది. స్కూల్ అసిస్టెంట్‌లు, ప్రాథమిక పాఠశాలల హెచ్‌ఎంలకు శనివారం రాత్రికి ముగియాల్సి ఉంది. అయితే సాఫ్ట్‌వేర్ లోపంతో దొర్లిన తప్పులు సరికాకపోవడంతో ఆదివారం కూడా దరఖాస్తుకు అవకాశం కల్పించారు.
స్కూల్ అసిస్టెంట్‌లకు నేడు కూడా అవకాశం
ప్రారంభమైన పరిశీలన
మొదటి దశలో ఎంఈవోలు
జిల్లాస్థాయిలో 11 బృందాలు ఏర్పాటు
ఒంగోలు విద్య, మే 24 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి శనివారం సాయంత్రానికి 4,652 దరఖాస్త్తులు వచ్చాయి. ఇప్పటికే గ్రేడ్ టూ ప్రధానోపాధ్యాయులకు దరఖాస్తు గడువు ముగిసింది. స్కూల్ అసిస్టెంట్‌లు, ప్రాథమిక పాఠశాలల హెచ్‌ఎంలకు శనివారం రాత్రికి ముగియాల్సి ఉంది. అయితే సాఫ్ట్‌వేర్ లోపంతో దొర్లిన తప్పులు సరికాకపోవడంతో ఆదివారం కూడా దరఖాస్తుకు అవకాశం కల్పించారు. ఉపాధ్యాయుల బదిలీల దరఖాస్తుల పరిశీలన ప్రారంభమైంది. హెచ్‌ఎంల బదిలీల దరఖాస్తుల పరిశీలన పూర్తయింది. శనివారం రాత్రికి వారి ప్రాథమిక సీనియారిటీ జాబితా విడుదల కానుంది. స్కూల్ అసిస్టెంట్ల బదిలీలకు దరఖాస్తు గడువు మరో రోజు పొడిగించారు. అయినప్పటికీ మొదటి దశ పరిశీలన ప్రక్రియను మండల విద్యాధికారులు చేపట్టారు. వాస్తవానికి హైస్కూళ్లలో పనిచేస్తున్న ఎస్‌ఏల దరఖాస్తుల పరిశీలన ఉప విద్యాధికారులు చేయాల్సి ఉంది. అయితే వేలసంఖ్యలో వస్తుండటంతో మొదటి దశ పరిశీలన బాధ్యతలను ఆర్‌జేడీ ఎంఈవోలకు అప్పగించారు. శుక్రవారం రాత్రి 11 గంటలకు ఎంఈవోలకు ఆర్‌జేడీ వెబెక్స్ సమావేశం నిర్వహించి ఈ బాధ్యతలను అప్పగించారు. ఆ ప్రకారం హైస్కూల్ హెచ్‌ఎంలు తమ పాఠశాలలో బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్న ఎస్‌ఏల వివరాలను పరిశీలించి ధ్రువీకరిస్తున్నారు. ఆతర్వాత ఆ టీచర్ దరఖాస్తు ప్రింట్ తీసి, ఎస్‌ఆర్‌తో సహా ఎంఈవో కార్యాలయానికి వెళ్లి ఆ వివరాలన్నీ ధ్రువీకరించుకుంటున్నారు.
డీఈవో ఆధ్వర్యంలో రెండో దశ పరిశీలన
రెండో దశ పరిశీలన జిల్లాస్థాయిలో డీఈవో ఆధ్వర్యంలో జరుగుతోంది. అది కూడా స్థానిక డీఆర్‌ఆర్‌ఎం హైస్కూల్‌లో ప్రారంభమైంది. ఇందుకోసం 11 బృందాలను ఏర్పాటు చేస్తూ డీఈవో కిరణ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. మొదటి దశలో ఎంఈవోల పరిశీలన పూర్తయిన తర్వాత ఆ టీచర్ ఎస్‌ఆర్‌లోని మొదటి పేజీ, పుట్టిన తేదీ, మొదట జాయినింగ్, ఉద్యోగోన్నతి పొందిన వివరాలన్నీ ఎస్‌ఆర్ పేజీలను నకళ్లు తీసి దరఖాస్తు ప్రింట్ కాపీకి జతచేసి డీఈవోకు సమర్పించాలి. స్పౌజ్ సర్టిఫికెట్, ప్రాధాన్యత కేటగిరీ పాయింట్లకు సంబంధించిన వైద్య ధ్రువీకరణ పత్రాల జెరాక్స్ కాపీలు జిల్లాస్థాయి పరిశీలనకు పంపాలి. పది టీంలు ఆ వివరాలను పరిశీలిస్తాయి. ఒక బృందం మాత్రం తప్పనిసరిగా బదిలీ కావాల్సిన వారందరూ దరఖాస్తు చేశారా? లేదా? అన్న విషయాన్ని పరిశీలిస్తుంది. జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ల బదిలీలకు 3వేలకుపైగా దరఖాస్తులు రాగా వాటిలో సగానికిపైగా మొదటి దశ పరిశీలన పూర్తయినట్లు అధికారులు చెప్తున్నారు. ఇదిలా ఉండగా బదిలీ దరఖాస్తులకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌లో అనేక లోపాలు ఉత్పన్నమవుతున్నాయి. ఇది ఉపాధ్యాయులకు తలనొప్పిగా మారింది. దీంతో ప్రక్రియలోనూ జాప్యం జరుగుతోంది
వచ్చిన దరఖాస్తులు ఇలా..
గ్రేడ్ టూ ప్రధానోపాధ్యాయులు 141మంది, స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ (తెలుగు, ఇంగ్లీష్, హిందీ) సబ్జెక్టులకు 1,156మంది, స్కూల్ అసిస్టెంట్ నాన్‌లాంగ్వేజ్ (గణితం, ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్)లకు 1,624 మంది, ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎంలు 138మంది, సెకండరీ గ్రేడ్ టీచర్‌లు 1,593 మంది బదిలీలకు దరఖాస్తు చేశారు. సెకండరీ గ్రేడ్ టీచర్‌ల బదిలీలకు దరఖాస్తు గడువు ఈనెల 27 వరకూ ఉంది.