3.70 లక్షల కోట్లు ఏమయ్యాయి.. అధ్యక్షా..!
ABN , Publish Date - Mar 13 , 2025 | 11:49 PM
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా కేవలం సంక్షేమ పథకాలకు రూ.2.30 లక్షల కోట్లు ఖర్చు చేశారు. కానీ 2019 నుంచి 2024 మధ్య మొత్తం రూ.6 లక్షల కోట్లు అప్పులు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మరి మిగిలిన రూ.3.70 లక్షల కోట్ల రూపాయాలు ఏమయ్యాయి..?’ అని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి గురువారం అసెంబ్లీలో ప్రస్తావించారు

- వైసీపీ విధ్వంసంపై అసెంబ్లీలో ఎమ్మెల్యే నారాయణరెడ్డి ప్రస్తావన
మార్కాపురం, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): ‘గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా కేవలం సంక్షేమ పథకాలకు రూ.2.30 లక్షల కోట్లు ఖర్చు చేశారు. కానీ 2019 నుంచి 2024 మధ్య మొత్తం రూ.6 లక్షల కోట్లు అప్పులు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మరి మిగిలిన రూ.3.70 లక్షల కోట్ల రూపాయాలు ఏమయ్యాయి..?’ అని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి గురువారం అసెంబ్లీలో ప్రస్తావించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు అప్పులు రూ.9.71 లక్షల కోట్లు ఉన్నాయన్నారు. 2014-19 మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాం ముగిసే నాటికి రూ.3.71 లక్షల కోట్ల అప్పులున్నాయన్నారు. విభజిత రాష్ట్రంలో మన రాష్ట్రవాటాగా అప్పట్లో అప్పులే ఉన్నాయన్నారు. కానీ ప్రజలపై, రాష్ట్రప్రభుత్వంపై ఎలాంటి భారం పడకుండా నాడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంతోజాగ్రత్తగా అనుభవంతో పనిచేశారన్నారు. కానీ ఒక అనుభవరాహిత్యం కల్గిన వ్యక్తికి రాష్ట్ర ప్రజలు పట్టం కడితే ఆర్థిక విధ్వంసం సృష్టించాడని విమర్శించారు. రూ.6 లక్షల కోట్ల మేర ఐదేళ్ల వ్యవధిలో అప్పులు మిగిల్చారన్నారు. ముఖ్యంగా విద్యుత్‌రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి రూ.1.29 లక్షల కోట్ల మేర అప్పులు మిగిల్చిన ఘనత మాజీ సీఎం జగన్‌కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. ట్రూఅప్ చార్జీల పేరుతో రూ.వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపారన్నారు. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన తర్వాతసీఎం చంద్రబాబు ఎంతో అనుభవంతో ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధితో ముందుకు సాగుతున్నారని చెప్పారు. విద్యుత్ సంక్షోభాన్ని సృష్టించిన వైసీపీ ప్రభుత్వమే నేడు ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. వారి హయాంలో 9 సార్లు ఇష్టారీతిన విద్యుత్‌ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపారన్నారు. రైతాంగం, ఆక్వా, ఎస్సీ, ఎస్టీలు తదితర రంగాలకు రాయితీపై కూటమి ప్రభుత్వం విద్యుత్ అందిస్తోందన్నారు. ఇంధన సంస్థ ఆక్వా రంగంతోపాటు నాపరాయి, చీమకుర్తి గ్రానైట్, పలకల పరిశ్రమలపై కూడా దృష్టిపెట్టి రాయితీలిచ్చి ఆదుకోవాలని కోరారు.