Share News

2,84,279 మంది లబ్ధిదారులు.. రూ.124.89 కోట్లు!

ABN , Publish Date - Oct 01 , 2025 | 02:15 AM

ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ బుధవారం జరగనుంది. జిల్లాలోని 2,84,279 మంది లబ్ధిదారులకు ఇంటింటికీ వెళ్లి పింఛన్‌ సొమ్మును అందజేయనున్నారు. అందుకు అవసరమైన రూ.124.89 కోట్లను ప్రభుత్వం రెండు రోజుల క్రితమే విడుదల చేసింది.

2,84,279 మంది లబ్ధిదారులు.. రూ.124.89 కోట్లు!

నేడు జిల్లాలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ

ఇంటింటికీ వెళ్లి ఇవ్వనున్న సచివాలయ సిబ్బంది

ఒంగోలు నగరం, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ బుధవారం జరగనుంది. జిల్లాలోని 2,84,279 మంది లబ్ధిదారులకు ఇంటింటికీ వెళ్లి పింఛన్‌ సొమ్మును అందజేయనున్నారు. అందుకు అవసరమైన రూ.124.89 కోట్లను ప్రభుత్వం రెండు రోజుల క్రితమే విడుదల చేసింది. వాటిని సోమవారమే వార్డు, గ్రామ సచివాలయాల సిబ్బంది బ్యాంకుల నుంచి డ్రా చేసుకుని సిద్ధంగా ఉంచారు. బుధవారం ఉదయాన్నే లబ్ధిదారుల ఇంటి తలుపుతట్టి పింఛన్‌ సొమ్మును అందజేయనున్నారు. జిల్లాలోని 719 సచివాలయాల పరిధిలో ఉన్న లబ్ధిదారులకు పింఛన్‌ సొమ్మును అందించేందుకు 5,546 మంది సిబ్బందిని ప్రభుత్వం నియమించింది. ఎక్కడా ఎలాంటి ఆటంకం లేకుండా పర్యవేక్షించాలని మునిసిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవోలను కలెక్టర్‌ రాజాబాబు ఆదేశించారు.

ఒక్కరికీ నిలిపివేయలేదు!

ప్రభుత్వం బోగస్‌ పింఛన్‌దారులను ఏరివేసే ప్రక్రియలో భాగంగా వందలాది మందికి సచివాల యాల ద్వారా గత నెలలో నోటీసులు జారీ చేసింది. వాటిని అందుకున్న వారిలో కొందరు తాము పింఛన్‌ పొందేందుకు అర్హులమంటూ ప్రభుత్వానికి అప్పీలు చేసుకున్నారు. ఎక్కువ మంది తిరిగి తమ అర్హతను పరిక్షించాలని ప్రభుత్వాన్ని కోరలేదు. ఇలాంటి వారికి ఈ నెలలో పింఛన్‌ పంపిణీ నిలిపివేస్తారని అందరూ భావించారు. అయితే ప్రభుత్వం ఈనెలలో ఏ ఒక్కరికీ కూడా పింఛన్‌ను నిలుపుదల చేయలేదు. గత నెలలో పింఛన్‌ పంపిణీ చేసిన అందరికీ ఈనెలలో కూడా ఇంటి వద్దనే పింఛన్‌ సొమ్మును అందజేయనున్నారు.

Updated Date - Oct 01 , 2025 | 02:15 AM