Share News

అద్దంకిలో 220 కేవీ సబ్‌స్టేషన్‌

ABN , Publish Date - Oct 01 , 2025 | 11:45 PM

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాలలో మరింత మెరుగైన విద్యుత్‌ సరఫరాకు వీలుగా అద్దంకిలో 220 కేవీ సబ్‌స్టేషన్‌ ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది.

అద్దంకిలో 220 కేవీ సబ్‌స్టేషన్‌
అద్దంకి కొండ వద్ద ఉన్న 220 కేవీ సబ్‌స్టేషన్‌ కు ప్రతిపాదించిన స్థలం

ఏర్పాటుకు కసరత్తు చేస్తున్న మంత్రి, అధికారులు

స్థల పరిశీలన, ప్రతిపాదనలు సిద్ధం

అద్దంకి, అక్టోబరు1 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాలలో మరింత మెరుగైన విద్యుత్‌ సరఫరాకు వీలుగా అద్దంకిలో 220 కేవీ సబ్‌స్టేషన్‌ ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. దశాబ్డ కాలం క్రితం అద్దంకిలో 132 కెవి సబ్‌స్టేషన్‌ను కొండవద్ద ఏర్పాటు చేశారు. గ్రానైట్‌ పరిశ్రమ బాగా విస్తరించిన నేపథ్యంలో మార్టూరులో 132 కేవీ సబ్‌స్టేషన్‌ ఏర్పాటైంది. అదే సమయంలో దర్శిలో కూడా 132 కేవీ సబ్‌స్టేషన్‌ ఏర్పాటు చేశారు. కొత్తగా ఏల్చూరు వద్ద కూడా 132 కేవీ సబ్‌స్టేషన్‌ మంజూరైంది. ఇప్పటికే స్థల సేకరణ కూడా పూర్తయ్యింది. త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. అయితే అద్దంకికి అందుబాటులో 220 కేవీ సబ్‌స్టేషన్‌ లేకపోవటం నాలుగు వైపులా ఉన్న 132 కేవీ సబ్‌స్టేషన్లకు మధ్య ఉండే విధంగా అద్దంకి సమీపంలోని కొండ వద్ద ఇప్పటికే ఉన్న 132 కేవీ సబ్‌స్టేషన్‌ పక్కనే 220 కేవీ సబ్‌స్టేషన్‌ ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పటికే స్థల పరిశీలన కూడా పూర్తయ్యింది. ఇటీవల సమీక్షకు వచ్చిన సీఎండీ కూడా అద్దంకిలో 220 కేవీ సబ్‌స్టేషన్‌ ఏర్పాటు ఆవశ్యకతను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో దానికి గ్రీన్‌సిగ్నల్‌ వచ్చే అవకాశం ఉంది. ఈ స్టేషన్‌ ఏర్పాటుతో బాపట్ల జిల్లాలోని అద్దంకి, పర్చూరు నియోజకవర్గాలు, ప్రకాశం జిల్లాలోని దర్శి నియోజకవర్గానికి మరింత మెరుగైన విద్యుత్‌ సరఫరా చేసేందుకు అవకాశం కలగనుంది.

Updated Date - Oct 01 , 2025 | 11:45 PM