Share News

జిల్లాలో 1,779 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ

ABN , Publish Date - Dec 16 , 2025 | 10:56 PM

జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌ 2025-26 సీజన్‌లో మంగళవారం వ రకు (ఈనెల 16వరకు) 212 మంది రైతుల వద్ద నుంచి రూ.3.99 కోట్ల విలువైన 1779.6 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌. గోపాలకృష్ణ వెల్లడించారు.

జిల్లాలో 1,779 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ

212 మంది రైతుల నుంచి రూ.3.99 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు

జేసీ గోపాలకృష్ణ వెల్లడి

ఒంగోలు కలెక్టరేట్‌, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి ) : జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌ 2025-26 సీజన్‌లో మంగళవారం వ రకు (ఈనెల 16వరకు) 212 మంది రైతుల వద్ద నుంచి రూ.3.99 కోట్ల విలువైన 1779.6 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌. గోపాలకృష్ణ వెల్లడించారు. స్థానిక కలెక్టరేట్‌లోని జేసీ చాంబర్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేసీ మాట్లాడారు. జిల్లాలో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ద్వారా ధాన్యం సేకరణ తీరు, సాధిస్తున్న పురోగతిని వివరించారు. ఇప్పటి వరకు రూ.3.98 కోట్లను 211మంది రైతులకు చెల్లించినట్లు తెలిపారు. మిగిలిన డబ్బును తదుపరి బ్యాంకు బ్యాచ్‌ ప్రాసెస్‌లో జమ చేస్తామన్నారు. లేట్‌ ఖరీఫ్‌, ఎర్లీ రబీ సాగును దృష్టిలో పెట్టుకొని రైతుల నుంచి ప్రతి గింజను కొనుగోలు చేసేలా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టిందని చెప్పారు. రైతులకు మద్దతు ధర అందించేందుకు ప్రభుత్వం నిబద్ధతతో కూడిన ఏర్పాట్లను చేసిందన్నారు. గోనెసంచులు, రవాణావాహనాలు, టార్పాలిన్లు అందించనున్నట్లు తెలిపారు. ధాన్యాన్ని విక్రయించడంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూం 8008901457 నెంబర్‌ను సంప్రదించాలని, వాట్సప్‌ 7337359375లోనూ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు జేసీ తెలిపారు.

జిల్లాలో 45 ధాన్యంసేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. దళారులను ఆశ్రయించి మద్దతు ధర కన్నా తక్కువ ధరకు ధాన్యాన్ని విక్రయించి నష్టపోవద్దని సూచించారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్‌ వరలక్ష్మీ, ఇతర అధికారులు ఉన్నారు.

Updated Date - Dec 16 , 2025 | 10:56 PM