స్థూల ఉత్పత్తి లక్ష్యసాధనలో 15వ స్థానం
ABN , Publish Date - Dec 18 , 2025 | 02:45 AM
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) తొలి అర్ధభాగంలో స్థూల ఉత్పత్తి లక్ష్య సాధనలో జిల్లా 15వ స్థానంలో నిలిచింది. వ్యవసాయ అనుబంధ, పారిశ్రామిక, సేవా రంగాలు అన్నీ కలిపి ఈ ఏడాది రూ.60,185 కోట్లు జిల్లా స్థూల ఉత్పత్తిగా అంచనా వేసింది.
తొలి అర్ధ సంవత్సరంలో 41.52 శాతం సాధన
పారిశ్రామికంలో జిల్లా ప్రథమం
సేవా రంగంలో 9వ స్థానం
వ్యవసాయ అనుబంధ రంగాల్లో 24
కీలక సూచికలో ఏ గ్రేడ్
కలెక్టర్ల సదస్సులో ప్రకటించిన ప్రభుత్వం
ఒంగోలు, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) తొలి అర్ధభాగంలో స్థూల ఉత్పత్తి లక్ష్య సాధనలో జిల్లా 15వ స్థానంలో నిలిచింది. వ్యవసాయ అనుబంధ, పారిశ్రామిక, సేవా రంగాలు అన్నీ కలిపి ఈ ఏడాది రూ.60,185 కోట్లు జిల్లా స్థూల ఉత్పత్తిగా అంచనా వేసింది. కొన్ని రంగాలలో పన్నులు, ఇతర రూపాలలో అదనంగా మరో రూ.5,371 కోట్లు రాబడి అంచనా వేసి మొత్తం జిల్లా స్థూల ఉత్పత్తి విలువ రూ.65,556 కోట్లుగా నిర్ణయించుకున్నారు. అయితే తొలి ఆర్థిక సంవత్సరంలో రూ.27,220 కోట్లు మాత్రమే లక్ష్య సాధన జరిగింది. అంటే వార్షిక లక్ష్యంలో ఈ ఆరు మాసాలలో 41.52 శాతం సాధించినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇందుకు సంబంధించిన వివరాలను రెండు రోజులపాటు అమరావతిలో జరుగుతున్న రాష్ట్రస్థాయి కలెక్టర్ల సదస్సులో తొలి రోజైన బుధవారం ప్రభుత్వం ప్రకటించింది. ఈఏడాది మొత్తం రంగాల వారీ స్థూల ఉత్పత్తి లక్ష్యం, తొలి అర్ధ సంవత్సరంలో లక్ష్య సాధనను ప్రకటించిన ప్రభుత్వం ఆయా రంగాల వారీ వివరాలను కూడా వెల్లడించింది. అన్నిరంగాలను వ్యవసాయ అనుబంధ, పారిశ్రామిక, సేవా రంగాలుగా విభజించి రాష్ట్ర, జిల్లాల వారీగా వివరాలను అందులో ప్రకటించింది. సంబంధిత అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విస్తృత సమీక్ష చేశారు. మిగిలిపోయిన లక్ష్యాల సాధన కోసం తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్లు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు.
మంత్రి, కలెక్టర్ హాజరు
జిల్లా నుంచి ఈ సదస్సుకు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ స్వామి ప్రభుత్వం తరఫున పాల్గొనగా కలెక్టర్ రాజాబాబు జిల్లాకు సంబంధించి ఆయా అంశాలపై నివేదికలతో హాజరయ్యారు. తొలిరోజైన బుధవారం స్థూల ఉత్పత్తి, ఆయా రంగాల పురోగతితోపాటు కొన్ని అంశాలపై సమీక్ష జరిగింది. రెండో రోజైన గురువారం వివిధ సంక్షేమ రంగాలపై సమీక్ష నిర్వహించనన్నారు. మధ్యాహ్నం శాంతిభద్రతల అంశంపై సమీక్ష ఉండగా దానికి ఎస్పీ హర్షవర్థన్‌రాజు కూడా హాజరుకానున్నారు. తొలిరోజు సమావేశంలో ప్రభుత్వం ప్రకటించిన జిల్లాల వారీ స్థూల ఉత్పత్తి వార్షిక లక్ష్యాలు, తొలి అర్ధ సంవత్సరంలో లక్ష్య సాధన తదితర అంశాలను పరిశీలిస్తే.. ఈ ఏడాది స్థూల ఉత్పత్తి లక్ష్య సాధనలో జిల్లా 15వ స్థానంలో నిలిచింది. తొలి అర్ధ సంవత్సరంలో రూ.27,220 కోట్లు (41.52శాతం) సాధించింది. ఇంకా 58.48శాతం సాధించాల్సి ఉంది. వ్యవసాయం, అనుబంధ రంగాలు.. పారిశ్రామిక, సేవా రంగాల ద్వారా రాబడిని స్థూల ఉత్పత్తి కింద పరిగణనలోకి తీసుకొంటుండగా వ్యవసాయ అనుబంధ రంగాలలో జిల్లా వెనుకబడి ఉంది. దాని వల్ల మొత్తం లక్ష్య సాధనలో జిల్లా 15వ స్థానానికి పరిమితమైంది.
పారిశ్రామికంలో ప్రథమం
సాధారణంగా జిల్లాలో పంటల సాగు పరిశీలిస్తే తొలి అర్ధ సంవత్సరంలో పెద్దగా ప్రధాన పంటల సాగు ఉండదు. అంతేకాక ఆ ఉత్పత్తుల అమ్మకాలు కూడా రెండో ఆర్థిక సంవత్సరంలో ఉంటాయి. ఉద్యాన, ఆక్వా పరిస్థితి కూడా ఒక మోస్తరుగానే ఉంటుంది. దీని వల్ల వ్యవసాయ అనుబంధ రంగాల్లోని ఉత్పత్తుల లక్ష్య సాధనలో వెనుకబడినట్లు తెలుస్తోంది. అదేసమయంలో పారిశ్రామిక ఉత్పత్తుల లక్ష్యసాధనలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. అందుకు మైనింగ్ కారణమని తెలుస్తోంది.సేవా రంగాల రాబడిలో 9వ స్థానంలో నిలిచింది. ఆయా రంగాల వారీ పరిశీలిస్తే 2025-26లో జిల్లాలో వ్యవసాయ అనుబంధ రంగాల రాబడి వార్షిక లక్ష్యం రూ.24,544 కోట్లు కాగా తొలి అర్ధ సంవత్సరంలో 27.42శాతంతో రూ.6,729 కోట్లు మాత్రమే వచ్చినట్లు అంచనా. పారిశ్రామికరంగంలో రూ.10,886 కోట్ల లక్ష్యానికి అర్థసంవత్సరంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 61.29శాతం లక్ష్యాన్ని సాధించింది. సుమారు రూ.6,671 కోట్ల రాబడి వచ్చినట్లు సమాచారం. ఇక సేవా రంగాలలో రూ.24,755 కోట్ల లక్ష్యానికి తొలి అర్ధ సంవత్సరంలో 47.91శాతంతో రూ.11,860 కోట్ల రాబడి లభించింది. రాష్ట్రంలో జిల్లా 9వ స్థానంలో నిలిచింది. ఇదిలాఉండగా వివిధ పథకాల అమలు, పౌరులకు అందిస్తున్న సేవలు, స్థూల ఉత్పత్తి లక్ష్య సాధనకు తీసుకుంటున్న చర్యలు, పురోగతి, సామాజిక అంశాలపై పలు రూపాలలో ప్రభుత్వం రాష్ట్రస్థాయిలో శాఖల వారీ అలాగే జిల్లాల వారీ కీలక పనితీరు సూచికలు(కేపీఐ) ఆధారంగా పాయింట్లను కేటాయించింది. నాలుగు రంగాల గ్రేడ్‌లను కేటాయిస్తుంది. అన్ని అంశాలను కలిపి మొత్తం 643 పాయింట్లు ఇస్తుండగా అందులో జిల్లాకు 315 పాయింట్లు లభించాయి. రెండో గ్రేడ్ అయిన ఏ గ్రేడ్ జిల్లాకు దక్కింది.