1484 పాస్ పుస్తకాలు
ABN , Publish Date - Aug 20 , 2025 | 10:58 PM
రైతుల భూములకు సంబంధించి కీలకమైన పట్టాదారు పాసు పుస్తకాలకు రాజముద్ర పడింది. ఈ మేరకు రాజముద్రదతో కూడిన పుస్తకాలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. వైసీపీ పాలనలో రీ-సర్వే ప్రారంభించి రైతుల భూ హక్కు పత్రాలను జగన్ ఫొటోతో పంపిణీ చేసిన విషయం తెలిసిందే. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
రాజముద్రతో భూ యాజమాన్య హక్కు పత్రాలు సిద్ధం
త్వరలో పంపిణీ
రైతుల హర్షం
రెవెన్యూ కార్యాలయాలకు చేరిన రాజముద్రతో ఉన్న పుస్తకం
ఎర్రగొండపాలెం రూరల్, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): రైతుల భూములకు సంబంధించి కీలకమైన పట్టాదారు పాసు పుస్తకాలకు రాజముద్ర పడింది. ఈ మేరకు రాజముద్రదతో కూడిన పుస్తకాలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. వైసీపీ పాలనలో రీ-సర్వే ప్రారంభించి రైతుల భూ హక్కు పత్రాలను జగన్ ఫొటోతో పంపిణీ చేసిన విషయం తెలిసిందే. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మా భూముల హక్కు పత్రాలు, పాసు పుస్తకాలపై జగన్ ఫొటో ఏంటని పెద్ద ఎత్తున రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఎన్నికల ప్రచారంలో అధికారంలోకి రాగానే రైతుల పాసుపుస్తకాలకు రాజముద్రతో ముద్రించి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ మేరకు జగన్ ఫొటోతో ఉన్న పాసు పుస్తకాలను రద్దు చేశారు. వాటి స్థానంలో రాజముద్రతో కొత్త పుస్తకాలను ముద్రించారు. కొత్త పుస్తకాలు రెవెన్యూ కార్యాలయాలకు ఇప్పటికే చేరాయి. అందులో భాగంగా ఎర్రగొండపాలెం మండలంలో మొత్తం 1,484 పాసుపుస్తకాలు కార్యాలయానికి వచ్చినట్లు తహసీల్దార్ మంజునాథరెడ్డి తెలిపారు.
పలు గ్రామాలకు వచ్చిన పుస్తకాలివి
లింగవానిపల్లి గ్రామానికి 104, రాయవరానికి 252, బోయలపల్లికి 110, కటారువానిపల్లికి 166, కొలుకుల 704, లాలాపురానికి 148 మొత్తం 1,484 పుస్తకాలు వచ్చినట్లు తహసీల్దార్ తెలిపారు. వాటిని త్వరలో రైతులకు నేరుగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.