జిల్లాకు 146 ఏఐ పోస్టులు మంజూరు
ABN , Publish Date - Dec 03 , 2025 | 02:34 AM
జిల్లాలో ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలలకు ప్రభుత్వం అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ (ఏఐ) పోస్టులు మంజూరు చేసింది. ప్రతి స్కూలులో కనీసం ఒక టీచరైనా ఉండాలన్న లక్ష్యంతో వీరిని నియమిస్తోంది.
6వ తేదీకి ఎంపిక ప్రక్రియ పూర్తి
8 నుంచి పాఠశాలల్లో విధులకు ఇన్‌స్ట్రక్టర్లు
ఒంగోలు విద్య, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలలకు ప్రభుత్వం అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ (ఏఐ) పోస్టులు మంజూరు చేసింది. ప్రతి స్కూలులో కనీసం ఒక టీచరైనా ఉండాలన్న లక్ష్యంతో వీరిని నియమిస్తోంది. ఉమ్మడి జిల్లాకు 146 అకడమిక్ ఇన్‌స్ట్రక్టరు పోస్టులు మంజూరయ్యాయి. అందులో స్కూలు అసిస్టెంట్ పోస్టులు 86, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు 60 ఉన్నాయి. మొత్తం పోస్టుల్లో విభజిత ప్రకాశంకు 132 కేటాయించారు. స్కూలు అసిస్టెంట్ పోస్టుకు ఎంపికైన వారికి నెలకు రూ.12,500, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుకు ఎంపికైన వారికి నెలకు రూ.10వేల గౌరవ వేతనం చెల్లిస్తారు. ఈనెల 6వతేదీ నాటికి వీరి ఎంపికను పూర్తిచేయనున్నారు. ఈనెల 8న ఎంపికైన వారు పాఠశాలల్లో విధులకు హాజరు కావాల్సి ఉంటుంది. తాత్కాలిక పద్ధతిలో వీరు ఐదు నెలలపాటు అంటే వచ్చే ఏడాది మే 7వతేదీ వరకు కొనసాగనున్నారు. అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకంలో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఏఐ నియామకాలకు సంబంధించిన మార్గదర్శకాలను పాఠశాల విద్య కమిషనర్ మంగళవారం జారీచేశారు.