14 మందికి ఎస్‌ఏలుగా ఉద్యోగోన్నతి
ABN , Publish Date - Oct 04 , 2025 | 01:03 AM
జిల్లాలో పనిచేస్తున్న 14 మంది భాషా పండితులకు స్కూలు అసిస్టెంట్లుగా అడ్‌హక్ ఉద్యోగోన్నతులు కల్పించారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారి ఎ.కిరణ్‌కుమార్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. భాషాపండితుల ఉద్యోగోన్నతుల వ్యవహారం గత కొంతకాలంగా హైకోర్టులో పెండింగ్‌లో ఉంది.
హైకోర్టు ఆదేశాలతో భాషా పండితులకు ప్రమోషన్
ఒంగోలు విద్య, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో పనిచేస్తున్న 14 మంది భాషా పండితులకు స్కూలు అసిస్టెంట్లుగా అడ్‌హక్ ఉద్యోగోన్నతులు కల్పించారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారి ఎ.కిరణ్‌కుమార్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. భాషాపండితుల ఉద్యోగోన్నతుల వ్యవహారం గత కొంతకాలంగా హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. గతంలో గ్రేడ్-2 భాషాపండితులు, అర్హులైన సెకండరీ గ్రేడ్ టీచర్లకు ఉమ్మడి సీనియారిటీ ప్రాతిపదికన స్కూలు అసిస్టెంట్ తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం ఉద్యోగోన్నతులు ఇచ్చారు. ఆ తర్వాత కేవలం సంబంధిత గ్రేడ్-2 భాషా పండితులకు మాత్రమే ఆయా భాషల్లో స్కూలు అసిస్టెంట్లుగా ప్రమోషన్ ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆ మేరకు ప్రక్రియను డీఈవో చేపట్టారు. దీంతో ఉద్యోగోన్నతి కోల్పోతున్న ఎస్జీటీలు ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు వారికి కూడా స్కూలు అసిస్టెంట్ భాషల ఉద్యోగోన్నతులు ఇవ్వాలని ఉత్తర్వులు జారీచేసింది. దీనిపై ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ చేసింది. ప్రభుత్వ అప్పీల్‌ను సమర్ధిస్తూ కేవలం భాషా పండితులకు మాత్రమే ఉద్యోగోన్నతులు ఇవ్వాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు ఆరుగురు తెలుగు, ముగ్గురు హిందీ, ముగ్గురు ఉర్దూ, ఇద్దరు సంస్కృత గ్రేడ్-2 భాషాపండితులకు స్కూలు అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతులు ఇచ్చారు. ఈ ప్రమోషన్లు రిట్ అప్పీల్ తుది ఉత్తర్వులకు లోబడి ఉంటుందని వీరి నియామక ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.