100శాతం ఉత్తీర్ణత లక్ష్యం
ABN , Publish Date - Dec 06 , 2025 | 01:21 AM
వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు నూరుశాతం ఉత్తీర్ణత సాధించేలా వారికి తర్ఫీదును ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతంలో పదిలో విద్యార్థుల ఉత్తీర్ణత పెంచేందుకు ఏజిల్లాకు ఆ జిల్లా ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించి అమలుచేసే వారు.
పది పరీక్షలకు వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక
నేటి నుంచి అమలు
ఒంగోలు విద్య, డి సెంబరు 5 (ఆంధ్ర జ్యోతి) : వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు నూరుశాతం ఉత్తీర్ణత సాధించేలా వారికి తర్ఫీదును ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతంలో పదిలో విద్యార్థుల ఉత్తీర్ణత పెంచేందుకు ఏజిల్లాకు ఆ జిల్లా ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించి అమలుచేసే వారు. అయితే ప్రస్తుత ప్రజాప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఒకే కార్యాచరణ ప్రణాళిక అమలుకు సిద్ధమైంది. ఎస్సీఈఆర్టీ వందరోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. విద్యార్థులకు ప్రత్యేక తరగతుల నిర్వహణలో టీచర్లను చేయిపట్టి ఎస్సీఈఆర్టీ ముందుకు నడిపిస్తుంది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ కార్యాచరణ ప్రణాళికను కామన్‌గా అమలు చేస్తారు. జిల్లాలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో 29,117 మంది విద్యార్థులు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాయనున్నారు. వీరిలో 17,380 మంది ప్రభుత్వ పాఠశాలలు, 11,737 మంది ప్రైవేటు పాఠశాలల వారు ఉన్నారు. ప్రభుత్వ, జడ్పీ హైస్కూళ్లు, కేజీబీవీలు, ఏపీ మోడల్ స్కూళ్లు, ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లు, ప్రభుత్వ సంక్షేమ గురుకు లాల్లో చదువుతున్న విద్యార్థులందరికీ ఈ వంద రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తారు. ఎఫ్‌ఏ-1, ఎఫ్‌ఏ-2, ఎస్‌ఏ-1 పరీక్షల్లో మార్కుల ఆధారంగా విద్యార్థులను ఏబీసీడీలుగా విభజించి చదువులో వెనుకబడిన వారిపై ఎక్కువ ఫోకస్ పెట్టడమే కాకుండా అందరూ ఉత్తీర్ణుల య్యేలా ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఈ వందరోజుల ప్రణాళిక జిల్లాలో శనివారం నుంచి ప్రారంభం కానుంది. అందుకోసం విద్యాశాఖ అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు.