Share News

నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు!

ABN , Publish Date - Nov 13 , 2025 | 02:25 AM

‘మొద్దు నిద్ర వీడండి. గత ప్రభుత్వంలో పనిచేస్తున్నామనే భ్రమ నుంచి బయటకు రండి. నిర్దేశిత లక్ష్యంలోపు వెలిగొండ పనులను పూర్తి చేయండి. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అధికారులైనా, పనులు చేసే ఏజెన్సీలపైన అయినా వేటు తప్పదు’ అని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు హెచ్చరించారు.

నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు!
వెలిగొండ సొరంగం వద్ద వరద నీటి తొలగింపు పనులను పరిశీలిస్తున్న మంత్రి నిమ్మల

వెలిగొండను పూర్తి చేయడమే మా లక్ష్యం

నిర్దేశిత గడువులోపు ఎలా పనిచేయాలో చూడండి

జలవనరుల శాఖ మంత్రి నిమ్మల ఆదేశం

సమీక్షలతో అధికారుల ఉరుకులు పరుగులు

కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడిన రామానాయుడు

ఇద్దరు వీఆర్వోలపై చర్యలకు సూచన

త్రిపురాంతకం, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి) : ‘మొద్దు నిద్ర వీడండి. గత ప్రభుత్వంలో పనిచేస్తున్నామనే భ్రమ నుంచి బయటకు రండి. నిర్దేశిత లక్ష్యంలోపు వెలిగొండ పనులను పూర్తి చేయండి. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అధికారులైనా, పనులు చేసే ఏజెన్సీలపైన అయినా వేటు తప్పదు’ అని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు హెచ్చరించారు. వెలిగొండ ప్రాజెక్ట్‌ పనుల పురోగతిని బుధవారం ఆయన పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్షలు నిర్వహించారు. ఈనెల 7వతేదీన ఒకసారి ప్రాజెక్టు పనులను పరిశీలించిన మంత్రి.. అధికారులకు కొన్ని సూచనలు చేసి వెళ్లారు. ముఖ్యంగా వెలిగొండ ఫీడర్‌ కెనాల్‌ గండ్లు పూడ్చడం, టన్నెళ్లలోని నీటిని బయటకు పంపే పనులకు నిర్దేశిత గడువును అధికారుల నుంచే తీసుకొన్నారు. మళ్లీ వస్తానని ఆ సందర్భంగా చెప్పి వెళ్లారు. నాలుగురోజుల వ్యవధిలో మళ్లీ మంత్రి వస్తారని ఊహించలేదేమో కానీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మంత్రి వస్తున్న సమాచారంతో పనులు చేసేందుకు యంత్రాలను తెచ్చి ఉంచడాన్ని ఆయన గమనించారు. ప్రాజెక్టు పనుల పరిశీలన, సమీక్ష సందర్భంగా అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టన్నెళ్లలోకి వచ్చిన నీటిని తోడేందుకు కూడా ప్రణాళిక లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. నేను వేరే జిల్లాలో ఉండి కూడా ఇక్కడ పనుల ఫొటోలను తెప్పించుకుని చూశానని, ప్రాజెక్ట్‌ పట్ల తాము ఎంత శ్రద్ధతో పనిచేస్తున్నామో గ్రహించాలన్నారు. అత్యంత వెనుకబడిన ఈ ప్రాంతంలో ఫ్లోరైడ్‌ సమస్య పరిష్కారం వెలిగొండ పూర్తితోనే సాధ్యమవుతుందన్నారు. వరద నీరు ఎక్కువై సమీప పొలాలపైకి వచ్చి పాడైపోతే నేటికీ అధికారులు ఎందుకు స్పందించలేదని నిలదీశారు.

వ్యంగ్యాస్త్రాలు.. హెచ్చరికలు

మంత్రి నిమ్మల తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూనే అధికారులకు హెచ్చరికలు చేశారు. సమీక్షకు అధికారులు మాత్రమే ఉండాలని ప్రజలు, ప్రెస్‌ వద్దని నిర్వహణ బాధ్యతను చూసే అధికారి బయటకు పంపుతుండగా మంత్రి వారించారు. మాది ప్రజాప్రభుత్వమని, పరదాలు, బారికేడ్లతో పాలన చేయమని అందరినీ లోపలకు ఆహ్వానించి ప్రజల మధ్యే సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల్లో నుంచి ఒకరు ఏదో సమస్యను అడుగుతుండగా ముందు మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేని గెలిపించే బాధ్యత తీసుకోండని సున్నితంగా చెప్పారు. ఎర్రగొండపాలెం ప్రాంతంలో అభివృద్ధి మేము చేస్తాం, ఓట్లు ఇతరులకు ఎలా వేస్తారని ప్రశ్నించారు. అలాగే అధికారులతో మాట్లాడుతూ మనకు ఉన్న సమయం తక్కువ అని 2026లో వెలిగొండ నీళ్లు ఇవ్వాలనే లక్ష్యంతో పనిచేయాలన్నారు. ఇక 20-20 క్రికెట్‌ మ్యాచ్‌లాగా పనిచేయాలని, 50ఓవర్ల మ్యాచ్‌లాగా ఆడే ఆట కాదన్నారు. అలాగని చివరి ఓవర్లో ఆడదామని గడువు ముగిసేదాక ఆగితే అప్పుడు గెలవడం కష్టమని గుర్తించాలన్నారు. మళ్లీ నెలరోజుల వ్యవధిలోనే వచ్చి సమీక్షిస్తానని ఆ సమయంలో ఎవరి పనితీరు ఏంటో తెలుస్తుందని హెచ్చరించారు.

వీఆర్వోలపై చర్యలు తీసుకోండి

దోర్నాల మండలంలోని ఐనముక్కల, యడవల్లి వీఆర్వోలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ రాజాబాబును మంత్రి ఆదేశించారు. మొంథా తుఫాన్‌ సమయంలో వెలిగొండ టన్నెళ్ల నుంచి, తీగలేరు ప్రవాహానికి పలువురు రైతుల భూముల్లో పంటలు దెబ్బతిని, పొలాల్లో మట్టి మెరకలు వేసి నష్టపోయారన్నారు. గతంలో తాను వచ్చినప్పుడు చెప్పిన రైతులే ఈ రోజు కూడా వచ్చారన్నారు. కనీసం తాను వచ్చిన సమయంలో సమాచారం ఇచ్చేందుకు వీఆర్వోలు అందుబాటులో లేరని కలెక్టర్‌తో ఆయన ఫోన్‌లో చెప్పారు. వారికి మెమో ఇచ్చి సరైన సమాధానం లేకపోతే సస్పెండ్‌ చేయాలని సూచించారు. దోర్నాల పరిధిలో కొందరి స్తంభాలు పడిపోవడం, కొంతమంది పొలాల్లో ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతులు చేయకపోవడాన్ని రైతులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై నిమ్మల తీవ్రంగా స్పందించారు. అధికారులకు ఆ మాత్రం బాధ్యత లేకుంటే ఎలా అన్నారు. తుఫాన్‌ పోయిన తరువాత వెంటనే పట్టణాలకు, గృహ అవసరాలకువిద్యుత్‌ ఇస్తారని, మరి రైతులకు ఎందుకు ఇంకా ఇవ్వడంలేదని అన్నారు. ఈ విషయాన్ని విద్యుత్‌శాఖ అధికారులతోపాటు మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ దృష్టికి కూడా తీసుకెళ్లారు.

వెలిగొండ పూర్తి ధ్యేయంగా సీఎం కృషి : ఎమ్మెల్యేలు

వెలిగొండ ప్రాజెక్ట్‌ పూర్తి చేయాలనే లక్ష్యంతో నిరంతరం సీఎం చంద్రబాబు ఆలోచనతో ఉండి మంత్రి ద్వారా ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తున్నారని గిద్దలూరు, మార్కాపురం ఎమ్మెల్యేలు ముత్తుముల అశోక్‌రెడ్డి, కందుల నారాయణరెడ్డి అన్నారు. సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడుతూ వెలిగొండకు శంకుస్థాపన చేసింది చంద్రబాబేనని, దానిని పూర్తి చేసి ప్రారంభించే బాధ్యత ఆయనే తీసుకున్నారని చెప్పారు. ఈ ప్రాంత ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే పని చేయాలనే సంకల్పంతో సీఎం ఉన్నారని అన్నారు.

జాతికి అంకితం ఎలా చేశారు : ఎరిక్షన్‌బాబు

వెలిగొండ పూర్తి చేయకుండానే ఈ ప్రాంత ప్రజలను మోసం చేస్తూ గత వైసీపీ పాలకులు ప్రాజెక్టును జాతికి ఎలా అంకితం చేశారని టీడీపీ ఎర్రగొండపాలెం ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు ఎద్దేవా చేశారు. ఆరోజు చప్పట్లు కొట్టిన ఎమ్మెల్యే చంద్రశేఖర్‌ ఇప్పుడు వెలిగొండకు నిధులు ఇవ్వండని అడగడం చూసి ప్రజలు నవ్వుతున్నారని అన్నారు. ప్రజలకు మన ప్రభుత్వంపై నమ్మకం ఉందని, ఈ ప్రభుత్వ హయాంలోనే పూర్తవుతుందనే విశ్వాసంతో ఉన్నారని చెప్పారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్‌ సీఈ శ్యాం ప్రసాద్‌, ఇరిగేషన్‌ అడ్వయిజర్‌ వెంకటేశ్వరరావు, ఎస్‌ఈ అబూత్‌అలీ, మార్కాపురం ఇన్‌చార్జి సబ్‌ కలెక్టర్‌ శివరామిరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Nov 13 , 2025 | 02:25 AM