Share News

వెండి రథంపై ప్రహ్లాదరాయలు

ABN , Publish Date - Feb 01 , 2025 | 11:59 PM

రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు వెండి రథంపై భక్తులకు దర్శనం ఇచ్చారు.

వెండి రథంపై ప్రహ్లాదరాయలు
ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీ

మంత్రాలయం, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు వెండి రథంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. శనివారం మాఘమాసం తదియను పురస్కరించుకుని మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో అర్చకులు బృందావనానికి ప్రత్యేక పూజలు చేశారు. పూర్ణబోధపూజ మందిరంలో ఉత్సవమూర్తికి పాదపూజ చేసి పల్లకిలో ఊరేగించారు. పీఠాధిపతి సంస్థానపూజ చేశారు. అనంతరం వెండి రథాన్ని వివిధ పుష్పాలతో అలంకరించి ప్రహ్లాదరాయలను అధిష్టించి ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. అనంతరం మంటపంలో ఊంజలసేవ నిర్వహించారు.

మంత్రాలయంలో పోటెత్తిన భక్తులు

రాఘవేంద్ర స్వామి దర్శనార్థం భక్తులు పోటెత్తారు. మాఘమాసం శనివారం తదియ కావటంతో దక్షణాది రాష్ర్టాలైన ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివచ్చారు. దీంతో మఠం ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది. అన్నపూర్ణ భోజనశాల, మహాముఖద్వారం, మధ్వమార్గ్‌ కారిడార్‌, ప్రధాన రహదారులు, రాఘవేంద్ర సర్కిల్‌, నదితీరం భక్తులతో కోలాహలంగా మారింది. గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకొని రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. క్యూలైనన్లు, పరిమళప్రసాదం వద్ద భక్తుల సందడిగా మారింది. రథోత్సవాల ఊరేగింపులో పాల్గొని భక్తులు పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల ఆశీస్సులు పొందారు.

రాఘవేంద్రుడి సన్నిధిలో కర్ణాటక హైకోర్టు న్యాయాధికారి

రాఘవేంద్ర స్వామిని కర్ణాటక హైకోర్టు న్యాయాధికారి జస్టిస్‌ జ్యోతి ములిమణి కుటుంబ సమేతంగా శనివారం దర్శించుకున్నారు. మహముఖ ద్వారం వద్ద ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్లు వెంటేష్‌ జోషి, సురేష్‌ కోనాపూర్‌, ఐపీ నరసింహమూర్తి స్వాగతం పలికారు. గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకుని రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి విశేష పూజలు చేశారు. అనంతరం మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు మెమెంటో, శేషవస్త్రం, ఫల, పుష్ప, మంత్రాక్షితలు, పరిమళ ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించారు. వీరి వెంట తహసీల్దారు ఎస్‌ రవి, అనంతపురాణిక్‌, ఎస్‌ఐ శివాంజిల్‌, అనంతస్వామి, ప్రకాశ ఆచార్‌, పవనఆచార్‌, వ్యాసరాజార్‌, జయతీర్థ ఆచార్‌ ఉన్నారు.

Updated Date - Feb 01 , 2025 | 11:59 PM