Posani Krishna Murali: అది సజ్జల స్క్రిప్ట్.. పోలీసులతో పోసాని
ABN , Publish Date - Mar 01 , 2025 | 05:34 AM
తాను వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నట్లు... అవి కులాల మధ్య విభేదాలు సృష్టించే అవకాశమున్నట్లు తెలిసీ, ఉద్దేశపూర్వకంగానే మాట్లాడినట్లు అంగీకరించినట్లు ఆయన ‘కన్‌ఫెషన్ స్టేట్‌మెంట్’లో పోలీసులు పేర్కొన్నట్లు సమాచారం.
దాని ప్రకారమే నేను మాట్లాడాను.. భార్గవ్‌రెడ్డి దానిని వైరల్ చేశారు
పోలీసుల ముందు పోసాని అంగీకారం.. అన్నీ తెలిసే విద్వేషపూరిత వ్యాఖ్యలు
ఆయనపై మొత్తం 15 కేసులున్నాయి.. రిమాండ్ రిపోర్టులో పోలీసుల వెల్లడి
2 వారాలు కస్టడీ విధించిన కోర్టు.. రాజంపేట సబ్‌జైలుకు పోసాని తరలింపు
పోలీసులతో ‘లవ్ యూ రాజా...’ జడ్జిని ‘అన్నా’ అంటూ చిత్రాలు
రాయచోటి, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ముఖ్య నాయకుడు, అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పంపిన ‘స్ర్కిప్టు’ ప్రకారమే తాను మాట్లాడానని సినీనటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి పోలీసుల ముందు అంగీకరించినట్లు తెలిసింది. ఆ వీడి యోలను అప్పటి వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ సజ్జల భార్గవ్‌రెడ్డి వైరల్ చేశారని పోసాని పేర్కొన్నట్లు సమాచారం. తాను వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నట్లు... అవి కులాల మధ్య విభేదాలు సృష్టించే అవకాశమున్నట్లు తెలిసీ, ఉద్దేశపూర్వకంగానే మాట్లాడినట్లు అంగీకరించినట్లు ఆయన ‘కన్‌ఫెషన్ స్టేట్‌మెంట్’లో పోలీసులు పేర్కొన్నట్లు సమాచారం. గురువారం రాత్రి పొద్దుపోయాక అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు కోర్టులో పోసానిని హాజరు పరిచారు. అంతకుముందు పోలీసులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సరిగా బదులివ్వకుండా ‘ఐ లవ్ యూ రాజా’ అని వింతగా ప్రవర్తించిన పోసాని... కోర్టుహాలులో న్యాయాధికారిని ‘అన్నా’ అని సంబోధించారు. ఆయన తరఫున వైసీపీ లీగల్ సెల్ నుంచి పొన్నవోలు సుధాకర్‌రెడ్డితోపాటు ఏకంగా 15మంది న్యాయవాదులు కోర్టుకు హాజరయ్యారు. ప్రభుత్వం తరఫున రైల్వేకోడూరు కోర్టు ఏపీపీ చిన్నబాబు, మరో ఇద్దరు న్యాయవాదులు వాదనలు వినిపించారు. రాత్రి 10.30నుంచి అర్ధరాత్రి దాటాక 2.30వరకు వాదనలు జరిగాయి. చంద్రబాబు, పవన్‌కల్యాణ్, లోకేశ్‌ను పోసాని అసభ్యకరంగా మాట్లాడిన మాటల వీడియో క్లిప్‌లను ఏపీపీ చిన్నబాబు పెన్‌డ్రైవ్‌లో కోర్టుకు అందజేశారు. ‘‘పోసాని ఒక సామాజికవర్గాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడారు. సినీ పరిశ్రమలో రెండు సామాజికవర్గాల పెత్తనమే ఉందంటూ కులాల మధ్య చిచ్చుకు ప్రయత్నించారు’’ అని తెలిపారు. పోలీసులు పెట్టిన సెక్షన్లలో పస లేదని పోసాని తరఫు న్యాయవాది పొన్నవోలు పేర్కొన్నారు. ‘‘ప్రభుత్వం పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నట్టు.. పోసాని పనికిమాలిన వాడు, బుద్ధి లేనివాడు కాదు.
పోలీసులు పెట్టిన కొన్ని సెక్షన్లను పరిగణనలోకి తీసుకోకుండా రిమాండ్ తిరస్కరించి.. బెయిల్ మంజూరు చేయండి’’ అని కోరారు. జడ్జిని పలుమార్లు అన్నా.. అని పోసాని సంబోఽధించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తేజసాయి పోసానికి మార్చి 12వరకు రిమాండ్ విధిస్తూ... శుక్రవారం తెల్లవారుజాము 5.40గంటలకు తీర్పును వెల్లడించారు. కోర్టు ఆదేశాల మేరకు పోసానిని శుక్రవారం ఉదయం రాజంపేట సెంట్రల్ జైలుకు తరలించారు. ఆయనకు రిమాండ్ ఖైదీ నంబరు 2261 కేటాయించారు. జైలులో పోసాని కొద్దిపాటి అస్వస్థతకు గురయ్యారు. ప్రయాణాల కారణంగా అలిసిపోవడంతో స్వల్ప అస్వస్థతకు గురయ్యారని జైలులోని వైద్యుడు తెలిపారు. పోసాని తన స్నేహితుడు సాల్మన్‌రాజును పిలిపించుకుని మాట్లాడారు. రిమాండ్ ఖైదీలను ఉంచే సబ్‌జైలు కావడంతో ఇక్కడ ఐదు గదులు మాత్రమే ఉన్నాయి. అందులో ఒక గదిని పోసానికి కేటాయించారు. పోసాని కోరడంతో పడుకోవడానికి బెడ్ ఏర్పాటు చేశారు. జైలులో ఉదయం అల్పాహారంగా పొంగలి, మధ్యాహ్నం అన్నం, పప్పు పెట్టారు.
రిమాండ్ రిపోర్టులో కీలక వివరాలు...
జనసేన నేత మణి ఫిర్యాదు మేరకు ఓబుళవారిపల్లి పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసులో బుధవారం రాత్రి హైదరాబాద్‌లో పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయన రిమాండ్ రిపోర్టులో పలు కీలక వివరాలను పొందుపరిచారు. ‘‘కులాలు, వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా పోసాని కృష్ణమురళి మాట్లాడారు. వాటిని యూట్యూబ్ తదితర సోషల్ మీడియా వేదికలపై వైరల్ చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమ మీద, రాజకీయ పార్టీ నేతల మీద ఆయన చేసిన వ్యాఖ్యలు అత్యంత వివాదాస్పదమైనవి. సమాజంలో విభేదాలు సృష్టించి, అల్లర్లకు దారితీసేలా... ఉద్దేశపూర్వకంగానే మాట్లాడారు. ఒక ప్రముఖ నటుడిని కించపరిచేలా, ఆయన కుటుంబసభ్యులను అవమానించేలా దూషణలు చేశారు. ఇంకో వీడియోలో దళితులను అవమానించారు. తన పిల్లలకు దళితులతో వివాహం చేయబోనంటూ వ్యాఖ్యానించారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే పనిగా పెట్టుకుని... నేరానికి పాల్పడ్డారు. తన ‘పొలిటికల్ మాస్టర్స్’ను సంతృప్తి పరచడమే లక్ష్యంగా మాట్లాడారు. ఆయనపై రాష్ట్రవ్యాప్తంగా మరో 14కేసులు నమోదయ్యాయి. 4 కేసుల్లో చార్జిషీట్లు దాఖలయ్యాయి. పార్వతీపురం జిల్లా పాలకొండ పోలీసులు ఇచ్చిన నోటీసును పోసాని లెక్క చేయలేదు. చట్టంపట్ల ఆయనకు ఏమాత్రం గౌరవం లేదనేందుకు ఇదొక నిదర్శనం. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇంటర్నెట్‌లో ఉన్నాయి. ఆయనకు బెయిలు ఇస్తే... సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశముంది. ఈ కేసులో ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉన్నందున... పోసానిని జ్యూడీషియల్ కస్టడీవిధించండి’’ అని పోలీసులు కోర్టును కోరారు.
ఇవి కూడా చదవండి..
Pawan Kalyan: భవిష్యత్తులో ఏపీలో రాబోయే మార్పులు చెప్పిన పవన్
Vamsi Petition: బ్యారక్ మార్చండి.. లేదా ఖైదీలను పంపండి.. వంశీ పిటిషన్
మరిన్ని ఏపీ వార్తలు కోసం క్లిక్ చేయండి..