Share News

రైతు బజార్లలో రాజకీయ రాబందులు!

ABN , Publish Date - Jan 30 , 2025 | 12:59 AM

రాజకీయ రాబందులు రైతు బజార్లలో వాలిపోతున్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రైతుబజార్‌ను పంచుకుంటున్నాయి. తాము చెప్పినట్టుగానే వ్యవస్థ నడవాలని హుకుం జారీ చేస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించుకున్న పంటను అమ్ముకోనివ్వకుండా రైతులను ఇబ్బందులు పెడుతున్నాయి. రైతు వారీ షాపుల కార్డుల రెన్యువల్‌ దగ్గర నుంచి అక్కడ విక్రయించే కూరగాయల వరకు అన్నీ ఈ రాబందులు చెప్పినట్లే జరగాలంటున్నాయి. ఒక్కో రాజకీయ రాబందు ఒక్కో రాజకీయ నాయకుడి పేరుతో రైతుబజార్లలోకి చొరబడుతున్నాయి. వీటి వేధింపులు తట్టుకోలేక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. వీటిని అడ్డుకోవాల్సిన ఈవోలు రాజకీయ రాబందులకు వంతపాడుతుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

రైతు బజార్లలో రాజకీయ రాబందులు!

- రాజకీయ నేతల పేరు చెప్పి రైతు బజారుల్లోకి చొరబాటు

- రైతు వారీ షాపుల రెన్యువల్‌కు రూ.20 వేల నుంచి 30 వేల వరకు వసూలు

- కూరగాయల కొనుగోళ్లపై వ్యాపారులకు ఆంక్షలు.. ఆపై నగదు వసూలు

- అడ్డుకోవాల్సిన ఈవోలకు దళారులతో దోస్తీ!

- ఇబ్బందులు పడుతున్న రైతులు, వ్యాపారులు

రాజకీయ రాబందులు రైతు బజార్లలో వాలిపోతున్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రైతుబజార్‌ను పంచుకుంటున్నాయి. తాము చెప్పినట్టుగానే వ్యవస్థ నడవాలని హుకుం జారీ చేస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించుకున్న పంటను అమ్ముకోనివ్వకుండా రైతులను ఇబ్బందులు పెడుతున్నాయి. రైతు వారీ షాపుల కార్డుల రెన్యువల్‌ దగ్గర నుంచి అక్కడ విక్రయించే కూరగాయల వరకు అన్నీ ఈ రాబందులు చెప్పినట్లే జరగాలంటున్నాయి. ఒక్కో రాజకీయ రాబందు ఒక్కో రాజకీయ నాయకుడి పేరుతో రైతుబజార్లలోకి చొరబడుతున్నాయి. వీటి వేధింపులు తట్టుకోలేక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. వీటిని అడ్డుకోవాల్సిన ఈవోలు రాజకీయ రాబందులకు వంతపాడుతుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):

ఎన్టీఆర్‌ జిల్లాలో సుమారుగా 12 రైతుబజార్లు ఉన్నాయి. ప్రతి రైతుబజార్లో శాశ్వత దుకాణాలు, రైతు వారీ దుకాణాలు ఉంటాయి. విభిన్న ప్రతిభావంతులు, డ్వాక్రా సంఘాలు, రైతు సొసైటీలకు శాశ్వత దుకాణాలను కేటాయిస్తారు. ఇవి కాకుండా పండించిన పంటలను నేరుగా రైతుబజార్లలో విక్రయించుకునేందుకు రైతులకు రైతు వారీ దుకాణాలను ఇస్తారు. జిల్లాలో ఉన్న రైతు బజార్లలో 513 శాశ్వత దుకాణాలు, 1,000 రైతు వారీ దుకాణాలున్నాయి. రైతు వారీ షాపులను నిర్వహించుకునే వారికి మార్కెటింగ్‌ శాఖ కార్డులను జారీ చేస్తుంది. ఈ కార్డులను ప్రతి మూడు నెలలకు ఒకసారి రెన్యువల్‌ చేయాలి. ఈ ప్రక్రియను సంబంధిత రైతు బజార్ల ఈవోలు నిర్వర్తిస్తారు. దీనిలోకి రాజకీయ దళారులు చొరబడుతున్నారు. రెన్యువల్‌కి ఒక్కో కార్డుకు రూ.20 వేల నుంచి 30వేలు డిమాండ్‌ చేస్తున్నట్టు రైతులు నుంచి ఆరోపణలు వస్తున్నాయి. ఈ మొత్తాన్ని ముట్టజెప్పిన రైతుల కార్డులను మాత్రమే రెన్యువల్‌ చేయాలని ఈవోలను దళారులు ఆదేశించడం గమనార్హం. రైతుల పక్షాన ఉండాల్సిన ఈవోలు దళారులతో దోస్తీ కడుతున్నారు. కార్డులను రెన్యువల్‌ చేయాలని వెళ్లిన రైతులను ఈవోలే దళారుల వద్దకు పంపుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. డిమాండ్‌ చేసిన మొత్తాన్ని కౌంటర్‌ల్లో జమ చేసిన తర్వాతే కార్డులు రెన్యువల్‌ అవుతున్నాయి. ఇలా చేయని రైతులను మాత్రం ఈవోలు, దళారులు తిప్పించుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు తలలు పట్టుకుంటున్నారు. ప్రకృతి వైపరీత్యాలు ఒక వైపు కన్నీరు పెట్టిస్తుంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి రాజకీయ దళారులు అక్రమ వసూళ్లతో కన్నీరు పెట్టిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సరుకు మాది.. అమ్మకం మీది!

రైతు బజార్లలోని వ్యాపారులు కూరగాయలను హోల్‌సేల్‌ మార్కెట్‌ నుంచి కొనుగోలు చేస్తారు. రైతులు తమ పొలాల్లో పండించిన పంటలను ఇక్కడ విక్రయించుకుంటే కొంతమంది వ్యాపారులు మాత్రం హోల్‌సేల్‌ మార్కెట్‌ నుంచి సరుకులు తెచ్చుకుని వ్యాపారం చేస్తుంటారు. అయితే కూరగాయలను తమ వద్ద కొనుగోలు చేయాలని దళారులు వ్యాపారులను బెదిరిస్తున్నారు. తాము సరఫరా చేసిన సరుకు మాత్రమే రైతు బజార్లలో అమ్మకాలకు ఉండాలని ఒత్తిడి చేస్తున్నారు. తమను కాదని బయటి మార్కెట్‌ నుంచి కూరగాయలు కొనుగోలు చేస్తే బస్తాకు రూ.50 జరిమానా విధిస్త్తున్నారు. ఇలా ఒక వ్యాపారి రోజుకు ఎన్ని బస్తాల కూరగాయలను అమ్మితే అన్ని రూ.50లను దళారులకు చెల్లిస్తున్నారు. రోజురోజుకు ఈ దళారులు రైతు బజార్లలో పేట్రేగిపోతున్నారు. కట్టడి చేయాల్సిన ఈవోలు దళారుల వెనుక ఉన్న రాజకీయ గుర్తులను చూసి మౌనం వహిస్తున్నారు. వాళ్లతో వివాదాలు ఎందుకులే అని భావించి దళారులతోనే స్నేహ బంధాన్ని నడుపుకుంటున్నారు. ఫలితంగా రైతుబజార్‌ మీద వచ్చిన ఆదాయాన్ని చెరిసగం చేసుకుంటున్నారు.

Updated Date - Jan 30 , 2025 | 12:59 AM