Banakacharla : ‘బనకచర్ల’ మా అంతర్గతం!
ABN , Publish Date - Feb 07 , 2025 | 03:55 AM
ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న పోలవరం-బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ పథకం పూర్తిగా తమ రాష్ట్ర అంతర్గత వ్యవహారమని.. ఇందులో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు గానీ, తెలంగాణ గానీ జోక్యం చేసుకునేందుకు వీల్లేదని ఏపీ జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ స్పష్టం చేశారు.

తెలంగాణ, కృష్ణా బోర్డు జోక్యానికి వీల్లేదు: ఆంధ్ర
జల వనరుల శాఖ ప్రత్యేక సీఎ్‌సతో కేఆర్‌ఎంబీ సభ్య కార్యదర్శి భేటీ
సాగర్ ఎడమ కాలువ వద్ద రాష్ట్ర
ఎస్పీఎఫ్: సాయిప్రసాద్ స్పష్టీకరణ
బెజవాడలోనే బోర్డు కార్యాలయం: రాయ్‌పురే
అమరావతి, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న పోలవరం-బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ పథకం పూర్తిగా తమ రాష్ట్ర అంతర్గత వ్యవహారమని.. ఇందులో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు గానీ, తెలంగాణ గానీ జోక్యం చేసుకునేందుకు వీల్లేదని ఏపీ జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ స్పష్టం చేశారు. గురువారమిక్కడ వెలగపూడి సచివాలయంలో బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే ఆయన్ను కలిశారు. పోలవరం-బనకచర్లపై తెలంగాణ లేవనెత్తిన అభ్యంతరాలు.. నీటి లెక్కలు.. వాటర్ గేజ్‌ల అమరిక అంశాలను ప్రస్తావించగా.. సాయిప్రసాద్ ఘాటుగా స్పందించారు. ‘ఈ ప్రాజెక్టు పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశం. మా అంతర్గత జలాల వ్యవహారం. దీనిపై తెలంగాణకు అభ్యంతరాలేమిటి? ఇందులో కేఆర్‌ఎంబీ జోక్యం ఏమిటి’ అని ప్రశ్నించారు. అభ్యంతరాలను బోర్డు లేవనెత్తడం లేదని.. తెలంగాణ మాత్రమే లేవనెత్తిందని రాయ్‌పురే చెప్పారు. నాగార్జున సాగర్ ఎడమ ప్రధాన కాలువ వద్ద సీఐఎ్‌సఎ్‌ఫను తొలగించాక.. భద్రతా సిబ్బంది లేకపోవడంపైనా చర్చకు వచ్చింది. అక్కడ రాష్ట్ర ఎస్పీఎఫ్ బలగాలను నియమించేందుకు ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావును సాయిప్రసాద్ ఆదేశించారు. తెలంగాణ ప్రతిపాదించినట్లుగా ఏపీ పరిధిలోలోని కృష్ణా ప్రాజెక్టుల్లో వాటర్ గేజ్‌లు ఏర్పాటు చేసేది లేదని రాయ్‌పురేకు తేల్చిచెప్పారు. జల వనరుల శాఖ ఇంజనీర్లను ఐదేళ్ల కాలానికి కేఆర్‌ఎంబీకి డిప్యుటేషన్‌పై పంపడానికి ఎలాంటి అభ్యంతరమూ లేదన్నారు. కాగా.. విజయవాడలోనే కృష్ణా బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని రాయ్‌పురే ఆయనకు చెప్పారు.