Polavaram Project: 2026 జూన్‌లోగా పోలవరం పనులు పూర్తి
ABN , Publish Date - Sep 04 , 2025 | 03:41 AM
పోలవరం ప్రాజెక్ట్ కుడి, ఎడమ కాలువల కనెక్టివిటీ్‌సకు గ్యాంట్రీస్ సంఖ్యను పెంచి 2026 జూన్ కల్లా పనులు పూర్తి చేసేలా ముందుకు వెళ్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయు...
రూ.739 కోట్లతో పునరావాస కాలనీల నిర్మాణం: నిమ్మల
అమరావతి, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్ట్ కుడి, ఎడమ కాలువల కనెక్టివిటీ్‌సకు గ్యాంట్రీస్ సంఖ్యను పెంచి 2026 జూన్ కల్లా పనులు పూర్తి చేసేలా ముందుకు వెళ్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. బుధవారం పోలవరం ప్రాజెక్ట్, దాని ఎడమ ప్రధాన కాలవ, పునరావాస పనులపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. ‘వానాకాలం, భారీ వరదల్లో సైతం డీవాటరింగ్ చేస్తూ, పోలవరం పనులు జరుగుతుండటంపై విదేశీ నిపుణులు సంతృప్తి వ్యక్తం చేశారు. బట్రప్ డ్యాంతో ఎగువ కాఫర్‌డ్యాం సీపేజ్‌ను కంట్రోల్ చేసి, పనులు చేయగలుగుతున్నాం. గ్యాప్-1 రాక్ ఫిల్ పనులపై సంతృప్తి వ్యక్తంచేస్తూ, మోడల్ డ్యామ్‌ను పూర్తి చేయాలని నిపుణులు సూచించారు. షెడ్యూల్ ప్రకారమే డయాఫ్రం వాల్ నిర్మాణం జరుగుతూ, 42 శాతం పూర్తైంది. పోలవరం నిర్మాణంతోపాటు భూసేకరణ, పునరావాసం పనులకు సమ ప్రాధాన్యత ఇస్తున్నాం. పునరావాస కాలనీల ఇళ్ల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన కోసం రూ.739కోట్ల పనులకు టెండర్లు పిలిచాం. ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు తరలించేలా పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులు వేగంగా జరుగుతున్నాయి. టీఎంసీకి, క్యూసెక్కులకు తేడా తెలియని జగన్, వైసీపీ నాయకులు పోలవరంపై దుష్ప్రచారం చేస్తే నమ్మే స్థితిలో ప్రజలు లేరు’ అన్నారు. సమీక్షలో జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, ఆర్‌అండ్‌ఆర్ కమిషనర్ రాంసుందర్‌రెడ్డి, నీటిపారుదల శాఖ సలహాదారు వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.