Share News

Polavaram project: మళ్లీ తెరపైకి లిఫ్టు

ABN , Publish Date - May 21 , 2025 | 04:27 AM

పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించి డెడ్ స్టోరేజీ నుంచి నీటిని ఎత్తిపోసే లిఫ్ట్ ఇరిగేషన్ పథకం గతంలో తీవ్ర వ్యతిరేకతకు గురైంది. ఇప్పుడు ఇంజనీరింగ్ అధికారులు అదే పథకాన్ని పునఃప్రారంభించాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

Polavaram project: మళ్లీ తెరపైకి లిఫ్టు

పోలవరం డెడ్‌ స్టోరేజీ నుంచి గోదావరి జలాలు తోడేద్దాం

2021 నాటి ఉత్తర్వును బయటకు తీసిన ప్రాజెక్టు అధికారులు

డ్యాం ఎత్తును 41.15 మీటర్లకు కుదించిన జగన్‌

దానికి విరుగుడుగా ఎత్తిపోతల నిర్మాణానికి జీవో 134 జారీ

అప్పట్లోనే సర్వత్రా విమర్శల వెల్లువ

అమరావతి, మే 20 (ఆంధ్రజ్యోతి): మూలనపడేసిన పోలవరం ఎత్తిపోతల పథకం మళ్లీ తెరపైకి వచ్చింది. దీనిని చేపట్టేందుకు సిద్ధమైన ప్రాజెక్టు ఇంజనీరింగ్‌ అధికారులు ఆకస్మికంగా పూర్వపు జీవో 134ను బయటకు తీయడం కలకలం రేపుతోంది. వాస్తవానికి పోలవరం ఉసురు తీసేలా దాని ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు కుదిస్తూ ముఖ్యమంత్రిగా నాడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. నిల్వ సామర్థ్యాన్ని తగ్గించినందుకు విరుగుడుగా డెడ్‌ స్టోరేజీ నుంచి గోదావరి జలాలను పశ్చిమ గోదావరి మెట్ట ప్రాంతానికి తీసుకెళ్లేందుకంటూ రూ.912.84 కోట్లతో ఎత్తిపోతల పథకం నిర్మించాలని జీవో 134 జారీచేశారు. ప్రాజెక్టు డెడ్‌ స్టోరేజీలో 35 మీటర్ల వద్ద నుంచి ఎత్తిపోతల ద్వారా నీటిని తోడేసేందుకు ఆమోద ముద్ర వేశారు. దీనిపై అప్పట్లోనే సాగునీటిరంగ నిపుణులు, సాగునీటి సంఘాల సమాఽఖ్య ప్రతినిధులు పెద్దఎత్తున నిరసన తెలిపారు. పోలవరం బ్యారేజీగా మిగిలిపోతుందంటూ ‘ఆంధ్రజ్యోతి’ వరుస కఽథనాలు ప్రచురించింది. నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు కూడా ఈ నిర్ణయాన్ని ఆక్షేపించారు. ఎత్తును కుదించడం వల్ల 194.60 టీఎంసీల నిల్వ సామర్థ్యం నుంచి 119 టీఎంసీల నిల్వకు ప్రాజెక్టు పరిమితమవుతుందని.. బహుళార్థ సాధక ప్రాజెక్టు నుంచి చిన్న తరహా బ్యారేజీగా పోలవరం మిగిలిపోతుందని, దీనిని పూర్తి చేసినా..


గోదావరి జిల్లాలకు సాగునీరు అందదని నిపుణులు హెచ్చరించారు. రూ.55,848 కోట్లను వ్యయం చేసి ప్రాజెక్టును నిర్మించినా ఏమాత్రమూ ప్రయోజనం ఉండదన్నారు. జల విద్యుత్కేంద్రం కూడా నిరుపయోగంగా మారుతుందని స్పష్టం చేశారు. ప్రజా వ్యతిరేకత తీవ్రతరం కావడంతో.. జగన్‌ ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) డ్యాం పనులు ప్రారంభించలేదు. ఫలితంగా గోదావరికి వచ్చిన భారీ వరదకు డయాఫ్రం వాల్‌ ధ్వంసమైంది. తర్వాత ఎగువ కాఫర్‌ డ్యాంలో సీపేజీ వచ్చింది. గైడ్‌బండ్‌ కూడా కుంగిపోయింది. ఈ పరిణామాల దరిమిలా కేంద్ర జలశక్తి శాఖ నిర్మాణ పనులను తన నియంత్రణలోకి తీసుకుంది. పనులపై సలహాలివ్వడానికి అమెరికా, కెనడాలకు చెందిన నిపుణులను నియమించింది. వారి సూచనల మేరకే ఇప్పుడు కొత్త డయాఫ్రం వాల్‌ పనులు, ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం సన్నాహక పనులు జరుగుతున్నాయి. ఈ తరణంలో.. పోలవరం ఇంజనీరింగ్‌ అధికారులు ఒక్కసారిగా జగన్‌ ఆలోచనలను అమలు చేసేందుకు సన్నద్ధమయ్యారు. ఈ ఆర్థిక సంవత్సరంలో పోలవరం డెడ్‌స్టోరేజీలో 35 మీటర్ల వద్ద నుంచి నీటిని ఎత్తిపోసేలా లిఫ్ట్‌ ఇరిగేషన్‌ చేపడదామని, దీనిపై గతంలొనే జీవో జారీ అయిందని జల వనరుల శాఖ ఉన్నతాఽధికారులకు నివేదించడం గమనార్హం. వారి ఆలోచనలు మంత్రి నిమ్మల రామానాయుడి దృష్టికి కూడా వెళ్లినట్లు సమాచారం.


ఈ వార్తలు కూడా చదవండి..

Tiruvuru Political Clash: తిరువూర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. దేవినేని అవినాష్ అరెస్ట్

Liquor Case Remand: లిక్కర్ కేసు.. ఆ ఏడుగురు మళ్లీ జైలుకే

Read Latest AP News And Telugu News


Updated Date - May 21 , 2025 | 04:27 AM