Polavaram Diaphragm Wall Work: చకచకా వాల్ నిర్మాణం
ABN , Publish Date - Aug 13 , 2025 | 04:23 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశించిన లక్ష్యాల మేరకు పోలవరం ప్రాజెక్టు ప్రధాన పనులు చురుగ్గా సాగుతున్నాయి...
ఇప్పటికి 500 మీటర్లు పూర్తి
3 ట్రెంచ్ కట్టర్లు.. గ్రాబర్లతో వేగంగా పనులు
డిసెంబరుకల్లా డయాఫ్రం వాల్ సిద్ధం
పోలవరం ఇంజనీరింగ్ అధికారుల విశ్వాసం
ప్రాజెక్టు పురోగతిపై మంత్రి నిమ్మల టెలికాన్ఫరెన్స్
నెలాఖరులో పోలవరానికి విదేశీ నిపుణులు
రిజర్వాయర్లలో నీటి నిల్వలపై రేపు సీఎం సమీక్ష
అమరావతి, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశించిన లక్ష్యాల మేరకు పోలవరం ప్రాజెక్టు ప్రధాన పనులు చురుగ్గా సాగుతున్నాయి. ప్రధానంగా డయాఫ్రం వాల్ నిర్మాణం 500 మీటర్లు పూర్తయిందని జల వనరులమంత్రి నిమ్మల రామానాయుడికి ఈఎన్‌సీ నరసింహమూర్తి తెలియజేశారు. 3 ట్రెంచ్ కట్టర్లు.. గ్రాబర్లతో వేగవంతంగా పనులు జరుగుతున్నాయని చెప్పారు. డిసెంబరు నాటికి వాల్ పనులు పూర్తిచేస్తామన్న ధీమా వ్యక్తం చేశారు. మంత్రి నిమ్మల మంగళవారం విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి ఈ సందర్భంగా పోలవరం ఇంజనీరింగ్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రాజెక్టును 2027 డిసెంబరు నాటికి పూర్తిచేయాలని ముఖ్యమంత్రి లక్ష్యం విధించారని, స్పష్టమైన షెడ్యూల్ విడుదల చేశారని మంత్రి గుర్తుచేశారు. దాని ప్రకారమే నిర్మాణ పనులు చురుగ్గా సాగుతుండడంపై హర్షం వ్యక్తం చేశారు. డయాఫ్రం వాల్ నిడివి 1,396 మీటర్లు కాగా.. ఇప్పటికి సంక్లిష్టమైన ప్రదేశంలో 500 మీటర్ల వరకు పనులు పూర్తయ్యాయని అధికారులు చెప్పారు. వరదల సమయంలోనూ డీవాటరింగ్ చేస్తూ శరవేగంగా పనులు చేపడుతున్నామని అన్నారు. ఎగువ కాఫర్‌డ్యామ్ నిర్మాణ పనులూ వేగంగా సాగుతున్నాయని చెప్పారు. 2027 డిసెంబరునాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఈఎన్‌సీ తెలిపారు. ఈ చారిత్రక ఘట్టం కోసం అహర్నిశలూ శ్రమిద్దామని నిమ్మల అధికారులతో అన్నారు. గత ప్రభుత్వం చేసిన చారిత్రక తప్పిదాన్ని చక్కదిద్దామని చెప్పారు. ఇంకోవైపు.. అమెరికా, కెనడాలకు చెందిన నిపుణులు నెలాఖరులో పోలవరానికి రానున్నారు. ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించి డయాఫ్రం వాల్, ఎర్త్ కం రాక్‌ఫిల్ (ఈసీఆర్‌ఎఫ్) డ్యాం నిర్మాణ పనులను పరిశీలిస్తారు. ఆమోది ంచిన డిజైన్ల మేరకు సాగుతున్నాయా.. లేదా.. నాణ్యత ఎలా ఉందో సమీక్షిస్తారు.
4 శాఖల అధికారులతో సీఎం చర్చ
జల వనరుల శాఖతో లింకున్న పంచాయతీరాజ్, మునిసిపాలిటీ, గ్రామీణాభివృద్ధి శాఖలతో గురువారం సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలో నీటి నిల్వలు.. రిజర్వాయర్లలో నీటిమట్టాలు తదితర ఆంశాలపై అధికారులతో చర్చిస్తారు.