Prime Minister Narendra Modi: ఏపీలో పర్యటించడం ఆనందంగా ఉంది.. ఎక్స్‌లో ప్రధాని మోదీ
ABN , Publish Date - Oct 16 , 2025 | 08:21 PM
ఏపీ పర్యటనపై ప్రధాని నరేంద్ర మోదీ తన ఎక్స్ ఖాతాలో గురువారం ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ఏపీలో పర్యటించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.
కర్నూలు: జిల్లాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించిన సంగతి తెలిసిందే. పర్యటనలో భాగంగా గురువారం నన్నూరులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ సభా వేదిక పైనుంచి వివిధ ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.13,429 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు.
సీఎం, డీసీఎంలపై ప్రధాని ప్రశంసలు..
నన్నూరు సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ఏపీలో అనంత అవకాశాలు ఉన్నాయని అన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీలోనూ యువశక్తి ఉందని నొక్కిచెప్పారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రూపంలో ఏపీకి శక్తివంతమైన నాయకత్వం ఉందని ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వం నుంచీ ఏపీకి సహకారం అందిస్తున్నామని పేర్కొన్నారు.
ఏపీ స్వాభిమాన సంస్కృతి భూమి..
ఈ సందర్భంగా ఏపీ పర్యటనపై ప్రధాని నరేంద్ర మోదీ తన ఎక్స్ ఖాతాలో గురువారం ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ఏపీలో పర్యటించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. పరిశ్రమలను బలోపేతం చేసి.. పౌరులను శక్తిమంతం చేసేలా అనేక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామని వెల్లడించారు. ఏపీ కనెక్టివిటీని పెంచే కార్యక్రమంలో పాల్గొనడం గర్వకారణంగా ఉందని అన్నారు.
శ్రీశైలం మల్లన్న ఆశీర్వాదం పొందడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఏపీ స్వాభిమాన సంస్కృతి భూమి.. విజ్ఞాన ఆవిష్కరణల కేంద్రం అని కొనియాడారు. స్వచ్ఛశక్తి నుంచి సంపూర్ణ శక్తి ఉత్పత్తి వరకు భారత్ కొత్త రికార్డులు సృష్టిస్తోందని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాలను పాటిస్తా: మంత్రి కొండా సురేఖ
తెలంగాణ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలకి ఆమోదం