Chandrababu: ప్లాస్టిక్ రహితంగా నగరాలు
ABN , Publish Date - Jun 18 , 2025 | 03:59 AM
ఈఏడాది అక్టోబరు 2కల్లా విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి నగరాలతో పాటు మరో 17 కార్పొరేషన్లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పూర్తిగా అరికట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈనగరాల్లో క్లాత్ బ్యాగుల వినియోగాన్ని పెంచాలని చెప్పారు.
అక్టోబరు 2కల్లా ప్రధాన నగరాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను కట్టడి చేయాలి
2 నెలల్లో సర్క్యులర్ ఎకానమీపై కొత్త పాలసీ
ఏడాదిలోగా 3 సర్క్యులర్ ఎకానమీ పార్కులు
వ్యర్థాల నిర్వహణలో ప్రతిభకు స్వచ్ఛత అవార్డులు
పేరుకున్న చెత్తను వెంటనే తొలగించాలి: సీఎం
అమరావతి, జూన్ 17(ఆంధ్రజ్యోతి): ఈఏడాది అక్టోబరు 2కల్లా విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి నగరాలతో పాటు మరో 17 కార్పొరేషన్లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పూర్తిగా అరికట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈనగరాల్లో క్లాత్ బ్యాగుల వినియోగాన్ని పెంచాలని చెప్పారు. అలాగే 87 పట్టణ ప్రాంతాల్లో 157 రెడ్యూ్‌స-రీయూజ్-రీసైకిల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. మంగళవారం సచివాలయంలో సర్క్యులర్ ఎకానమీపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను పటిష్ఠ పరిచేలా రెండు నెలల్లో సర్క్యులర్ ఎకానమీపై తుది పాలసీని తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. మొదటగా మూడు ప్రాంతాల్లో సర్క్యులర్ ఎకానమీ పార్కులను ఏడాదిలోగా ఏర్పాటు చేయాలన్నారు. అలాగే వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లలో ఆధునిక యంత్రాల వినియోగాన్ని పెంచాలని సూచించారు. రాష్ట్రంలో పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించాలని స్పష్టం చేశారు. 90 రోజుల్లోగా రీసైక్లింగ్, చెత్తను వేరు చేయడంపై కార్యాచరణ ప్రణాళిక ఇవ్వాలన్నారు. వ్యర్థాల నుంచి సంపద సృష్టి, వనరుల పునర్వియోగంపై ప్రధానంగా చర్చించారు. సర్క్యులర్ ఎకానమీ పార్కులు ఏర్పాటుపై మెటీరియల్ రీసైక్లింగ్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా ప్రతిపాదనలను పరిశీలించారు. మొదటి దశలో భాగంగా విశాఖపట్నంలో 400 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న సర్క్యులర్ ఎకానమీ పార్కును అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలని, ఇందుకోసం వివిధ దేశాల్లోని పార్కులను పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు. వీటితో భారీగా పెట్టుబడులు వచ్చేలా చూడాలని చెప్పారు.
11 రంగాలు, 3 శాఖలపై దృష్టి
సర్క్యులర్ ఎకానమీ కింద కేంద్రప్రభుత్వం గుర్తించిన మున్సిపల్, వాహనాలు, లిథియం బ్యాటరీలు, జిప్సం, టైర్లు, రబ్బర్, ఎలకా్ట్రనిక్, వ్యవసాయం, పారిశ్రామిక, ఆక్వా వ్యర్థాలు వంటి 11 రంగాలపై దృష్టి పెట్టాలని సీఎం చెప్పారు. దీంతో పాటు అదనంగా గనులు, చేనేత, పశు సంవర్థక శాఖలతో కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. వ్యర్థాల నిర్వహణలో అత్యుత్తమ ప్రదర్శన కనబరచిన వారికి ప్రోత్సాహకంగా స్వచ్ఛత అవార్డులను వచ్చే ఏడాది అక్టోబరు 2 నుంచి ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. స్థానిక సంస్థలు, స్వయం సహాయక సంఘాలు, అంగన్‌వాడీలు, పాఠశాలలు, కళాశాలలు, బస్టాండ్లు, ఆసుపత్రులు, ఎన్జీఓల వారీగా అవార్డులు ఇవ్వాలని నిర్దేశించారు.
రాష్ట్రంలో 52 వ్యర్థాల క్లస్టర్లు
జిల్లాకు రెండు చొప్పున రాష్ట్రంలోని పట్టణాలు, పంచాయతీ ప్రాంతాల్లో మొత్తం 52 వ్యర్థాల క్లస్టర్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వ్యర్థాల్లో ఎక్కువగా వ్యవసాయరంగం నుంచి 40 లక్షల మెట్రిక్ టన్నులు, పశువులు-ఆక్వా-పౌల్ట్రీ రంగాల 347 లక్షల మెట్రిక్ టన్నులు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిరోజు 88 లక్షల గృహాల నుంచి 1,329 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు వస్తున్నాయని తెలిపారు. రాజస్థాన్, కర్ణాటక, మహారాష్ట్రలో సర్క్యులర్ ఎకానమీ కోసం అందిస్తున్న ప్రోత్సాహకాల వివరాలను అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు.
ప్రత్యక్షంగా లక్ష ఉద్యోగాలు..
రాష్ట్రంలో సర్క్యులర్ ఎకానమీ సమర్థంగా అమలు చేయగలిగితే జీఎస్డీపీకి ఏడాదికి రూ. 15 వేల కోట్లు జత చేరుతుందని అంచనా. అలాగే మరో రూ. 10 వేల కోట్ల విలువైన మెటీరియల్‌ను ఉత్పత్తి రంగానికి సరఫరా చేసే అవకాశం ఉంటుంది. ఈ విలువ జోడింపుతో రాష్ట్రం జీఎస్టీ రూపంలో రూ. 3 వేల కోట్ల ప్రతి ఏటా ఆర్జించవచ్చు. మరో వైపు ప్రత్యక్షంగా లక్ష మందికి ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి. 10 వేల మైక్రో ఎంటర్‌ప్రెన్యూర్‌లకు ఉపాధి లభిస్తుంది. దీంతో పాటు పరోక్షంగా 10 లక్షల మందికి ఉపాధి కలుగుతుంది. దీనికి తోడు పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుంది. కర్బన ఉద్గారాలు తగ్గుతాయి. భూ, జల, వాయు కాలుష్యాన్ని గణనీయంగా అరికట్టవచ్చు.