AP High Court: లోకాయుక్తను నియమించకపోవడాన్ని సవాల్ చేస్తూ పిల్
ABN , Publish Date - Sep 04 , 2025 | 03:32 AM
గత ఏడాది సెప్టెంబరు 14 నుంచి ఖాళీగా ఉన్న లోకాయుక్త పోస్టును భర్తీ చేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర...
అమరావతి, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): గత ఏడాది సెప్టెంబరు 14 నుంచి ఖాళీగా ఉన్న లోకాయుక్త పోస్టును భర్తీ చేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలనశాఖ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగువారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులిచ్చింది. లోకాయుక్త నియామక ప్రక్రియను నాలుగు వారాల్లో పూర్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాది తాండవ యోగేష్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఇది బుధవారం విచారణకు రాగా పార్టీ ఇన్‌పర్సన్ తాండవ యోగేష్ వాదనలు వినిపించారు. అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ... లోకాయుక్త నియామకం విషయంలో రాష్ట్రప్రభుత్వం చట్టసవరణ చేసిందని, పూర్తి వివరాలు కోర్టు ముందు ఉంచుతామని తెలిపారు.