Physically Challenged Student Loses: ప్రతిభ ఉన్నా నిబంధనలే అడ్డంకి
ABN , Publish Date - Aug 14 , 2025 | 03:47 AM
ఇంటర్మీడియట్‌లో తనకు లభించిన మినహాయింపు మేరకు ఫస్ట్ లేదా సెకండ్ లాంగ్వేజీ కింద ఇంగ్లిష్ ఎంచుకోనందుకు..
ఇంటర్‌లో ఇంగ్లిష్ లాంగ్వేజీ ఎంచుకోకమెడిసిన్ సీటు కోల్పోతున్న తిరుపతి విద్యార్థి
దివ్యాంగ కేటగిరీలో ఇంటర్‌లో ఆంగ్లానికి మినహాయింపు
నీట్‌లో తప్పనిసరి కావడంతో మంత్రి లోకేశ్ స్పందించాలని కోరుతున్న విద్యార్థి కుటుంబం
తిరుపతి, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌లో తనకు లభించిన మినహాయింపు మేరకు ఫస్ట్ లేదా సెకండ్ లాంగ్వేజీ కింద ఇంగ్లిష్ ఎంచుకోనందుకు ఓ దివ్యాంగ విద్యార్థికి మెడిసిన్ సీటు కోల్పోయే పరిస్థితి నెలకొంది. తిరుపతికి చెందిన దాసరెడ్డి ప్రతా్‌పరెడ్డి కుమారుడు హరిహర బ్రహ్మారెడ్డి కృష్ణా జిల్లా కంకిపాడు శ్రీచైతన్య కాలేజీలో 2023-25 విద్యా సంవత్సరంలో ఇంటర్ బైపీసీ ఇంగ్లిష్ మీడియం చదివారు. శారీరక వైకల్యం కలిగిన విద్యార్థులకు ఇంటర్మీడియట్‌లో ఫస్ట్ లేదా సెకండ్ లాంగ్వేజీ కింద ఇంగ్లిష్ ఎంచుకోకుండా మినహాయింపు ఉంది. దాన్ని వినియోగించుకుని హరిహర బ్రహ్మారెడ్డి ఫస్ట్ లాంగ్వేజీగా ఇంగ్లిష్ మినహాయించుకుని సెకండ్ లాంగ్వేజీగా సంస్కృతం ఎంచుకున్నాడు. ఇంటర్ పరీక్షల్లో 90 శాతం మార్కులతో ఏ గ్రేడ్ సాధించాడు. నీట్‌లో దివ్యాంగ కేటగిరీలో 1174వ ర్యాంకు పొందాడు. ఆ ర్యాంకుతో అతనికి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు లభించే అవకాశముంది. ఈ నెల 19న కౌన్సెలింగ్‌కు హాజరు కావాల్సి ఉంది. అయితే నీట్ నిబంధనల ప్రకారం అభ్యర్థులు ఇంటర్‌లో తప్పనిసరిగా ఇంగ్లి్‌షను ఫస్ట్ లేదా సెకండ్ లాంగ్వేజీగా ఎంచుకోవాలి. ఈ విద్యార్థికి ఇంటర్ మార్కుల జాబితాలో కౌన్సెలింగ్‌లో సమర్పించాల్సిన ఇంటర్ మార్కుల జాబితాలో ఫస్ట్ లాంగ్వేజీ అన్న కాలమ్ వద్ద ఎగ్జెంప్టెడ్ అన్న అర్థంలో ‘ఇ’ అని పేర్కొన్నారు. దీంతో నీట్ కౌన్సెలింగ్‌లో హరిహర బ్రహ్మారెడ్డి మెడిసిన్ సీటు కోల్పోయే పరిస్థితి నెలకొంది. ఇంటర్‌లో రాష్ట్ర ప్రభుత్వమే దివ్యాంగ విద్యార్థులకు ఇంగ్లిష్ లాంగ్వేజీ నుంచీ మినహాయింపు ఇచ్చినందున తనకు ఇంగ్లి్‌షలో కనీస మార్కులు 35 కలిపి ఆ మేరకు కొత్త మార్కుల జాబితా జారీ చేయాలని బాధిత విద్యార్థి కోరుతున్నాడు. దివ్యాంగుడైన తమ కుమారుడు మెడిసిన్ సీటు సాధించినందుకు పొంగిపోయిన తల్లిదండ్రులు, తాజా పరిస్థితికి తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితే రాష్ట్రంలో ఐఐటీ సీటు సాధించిన విద్యార్థులకు ఎదురు కాగా విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించి వారికి ఇంగ్లిష్ సబ్జెక్టులో కనీస మార్కులు 35 కలుపుతూ జీవో జారీ చేయించారు. ఇప్పుడు కూడా విద్యా శాఖ మంత్రి లోకేశ్ స్పందిస్తే దివ్యాంగుడైన తమ కుమారుడికి మెడిసిన్ సీటు దక్కుతుందని ప్రతా్‌పరెడ్డి వేడుకుంటున్నారు. ఈ మేరకు మంత్రిని కలిసేందుకు ఆయన మంగళగిరి వెళ్లారు.