Enforcement Directorate: ఫోన్ ట్యాపింగ్‌లో లిక్కర్ స్కామ్ తీగ
ABN , Publish Date - Jul 16 , 2025 | 03:57 AM
వైసీపీ హయాంలో జరిగిన రూ.వేల కోట్ల మద్యం స్కామ్ నిందితులకు తెలంగాణకు చెందిన ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు ఆశ్రయం ఇచ్చిన వ్యవహారం ఇప్పుడు కలకలం రేపుతోంది.. రెండు రాష్ట్రాల్లోనూ సంచలనం రేపిన రెండు కేసులివి.
వేల కోట్ల కుంభకోణంలో మరో మలుపు
ఫోన్ ట్యాపింగ్ నిందితుడు శ్రవణ్‌రావుకు, లిక్కర్ స్కామ్ ఏ1 రాజ్ కసిరెడ్డికి అనుబంధం
దుబాయ్‌లో శ్రవణ్‌రావు కుటుంబానికి ఫ్లాట్
లిక్కర్ కేసు నిందితులకు అక్కడ ఆశ్రయం
దుబాయ్ నుంచి వస్తూ శంషాబాద్‌లో రాజ్ కసిరెడ్డి అరెస్టు
29సార్లు అక్కడికి వెళ్లొచ్చిన కిరణ్‌కుమార్
మరో నిందితుడు చాణక్యతో కలిసి ఫ్లాట్‌లో
దూకుడు పెంచిన సిట్, ఈడీ అధికారులు
2 కేసుల్లోని నిందితులకు దుబాయ్ బంధం
(హైదరాబాద్ - ఆంధ్రజ్యోతి)
వైసీపీ హయాంలో జరిగిన రూ.వేల కోట్ల మద్యం స్కామ్ నిందితులకు తెలంగాణకు చెందిన ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు ఆశ్రయం ఇచ్చిన వ్యవహారం ఇప్పుడు కలకలం రేపుతోంది.. రెండు రాష్ట్రాల్లోనూ సంచలనం రేపిన రెండు కేసులివి. గత ప్రభుత్వాల్లోని పెద్ద తలకాయలకు లాభం చేకూర్చడానికి నడిచిన వ్యవహారాలకు సంబంధించిన ఈ కేసుల్లో కీలక నిందితులను దుబాయ్ బంధం కలిపినట్టు తెలిసింది. లిక్కర్ స్కామ్‌లో ఏ1 రాజ్ కసిరెడ్డి దుబాయ్ నుంచి తిరిగి వస్తూ శంషాబాద్‌లో సిట్ అధికారులకు దొరికిపోయారు. లిక్కర్ స్కామ్ కేసులో నిందితులు కిరణ్‌కుమార్, చాణక్య దుబాయ్‌లోని శ్రవణ్‌రావుకు చెందిన ఫ్లాట్‌లో తల దాచుకున్నట్టు తెలిసింది. శ్రవణ్‌రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు. లిక్కర్ స్కామ్ బయటపడిన తర్వాతే 29 సార్లు కిరణ్‌కుమార్ దుబాయ్‌కు వెళ్లి వచ్చారని చెబుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..శ్రవణ్‌రావు కుటుంబసభ్యులకు దుబాయ్‌లో అత్యంత ఖరీదైన ఫ్లాట్ ఉంది. దాని అద్దె నెలకు సుమారు రూ.5 లక్షలు వస్తుంది. కానీ... శ్రవణ్‌రావు కొంతకాలంగా ఆ ఫ్లాట్‌ను అద్దెకు ఇవ్వలేదు. ఆ ఫ్లాట్‌లోనే మద్యం కుంభకోణం కేసులో నిందితులు కిరణ్‌కుమార్, చాణక్యతోపాటు మరికొందరు ఉంటున్నట్లు తాజా సమాచారం.
మద్యం కుంభకోణంపై విచారణ ప్రారంభమైనకాలం నుంచి, అంటే సుమారు 2024 డిసెంబరు నుంచి, ఆ కేసులోని కొందరు నిందితులకు ఆ ఫ్లాటే ఆవాసంగా మారింది. శ్రవణ్‌రావుకు మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డికి మధ్య సంబంధ బాంధవ్యాలు ఉన్నాయని చెబుతున్నారు. దానివల్లే లిక్కర్ నిందితులకు శ్రవణ్‌కుమార్ తన ఫ్లాట్‌లో ఆశ్రయం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరి మధ్య ఇంకా ఏవైనా ఇతర లావాదేవీలు ఉన్నాయా అనే అంశంపై అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం. కాగా దుబాయ్‌లో అత్యంత ఖరీదైన ప్రాంతంలో శ్రవణ్ రావు ఫ్లాట్ ఎలా కొనుగోలు చేశారు, ఏపీ లిక్కర్ స్కాం డబ్బులు ఏమైనా చేతులు మారాయా అని మనీలాండరింగ్ కోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆరా తీస్తోంది.
దుబాయ్‌కు హవాలా..
గత ప్రభుత్వ హయాంలో ప్రముఖ మద్యం బ్రాండ్లను నిలిపివేసి, తక్కువ పేరున్న బ్రాండ్లను ప్రోత్సహించడంలో రూ. 3,200 కోట్ల స్కామ్ జరిగినట్లు సిట్ ప్రాథమిక దర్యాపులో నిగ్గు తేల్చింది. అయితే ఈ స్కాంకు సంబంధించిన కథ మొత్తం దుబాయ్ కేంద్రంగానే నడిచినట్లు తెలుస్తోంది. రూ.కోట్ల లిక్కర్ స్కామ్ నిధులను హవాలా ఏజెంట్ల ద్వారా తరలించినట్లు సిట్ గుర్తించింది. దుబాయ్ లింకుల్ని పూర్తి స్థాయిలో విశ్లేశించడంపై అటు ఈడీ, ఇటు సిట్ దృష్టి సారించాయి.
లిక్కర్ మనీతో భూముల కొనుగోలు
లిక్కర్ కుంభకోణంతో సంపాదించిన వేల కోట్ల రూపాయల్ని తెలంగాణలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టినట్లు తేలింది. రాజ్ కసిరెడ్డి హైదరాబాద్ సమీపంలో పారిశ్రామిక కారిడార్‌లో ఏకంగా రూ. 150 కోట్లతో 90 ఎకరాలు భూమి కొనుగోలు చేసినట్లు సిట్ గుర్తించింది. మనీ రూటింగ్‌లో భాగంగా లిక్కర్ స్కాంలో సంపాదించిన మొత్తంతో భూములు కొని, ఆ భూముల్ని మరింత ఎక్కువ ధరకు మార్కెట్‌లో విక్రయించినట్లు తేలింది. 90 ఎకరాల్లో 60 ఎకరాలు విక్రయించారు. మిగిలిన 30 ఎకరాలు రాజ్ కసిరెడ్డికి సంబంధించిన సంస్థల పేర్లతో ఉన్నట్లు సిట్ కనుగొంది. అసలు భూములు ఎలా కొనుగోలు చేశారు ? విక్రయంతో వచ్చిన సొమ్ము ఎక్కడికి దారిమళ్లించారు ? అనే కోణంలో సిట్ ఆరా తీస్తుంది. హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన ప్రాంతంలోనూ రాజ్ కెసిరెడ్డి స్థలం కొనుగోలు చేసినట్లు తేలింది. కాగా ఏపీ లిక్కర్ స్కాం డబ్బులతో కొనుగోలు చేసిన ఆస్తుల్ని దర్యాప్తులో భాగంగా జప్తు చేయడంపై సిట్ దృష్టి సారించింది.