PG Medical Education : పీజీ వైద్య విద్యలో ఇన్ సర్వీస్ కోటా నిబంధనల సవరణ సరైనదే
ABN , Publish Date - Jan 17 , 2025 | 04:34 AM
వైద్యశాఖలో సివిల్ అసిస్టెంట్ సర్జన్‌లుగా చేస్తున్న వారు పీజీ వైద్య విద్యను అభ్యసించేందుకు కేటాయించే ఇన్ సర్వీస్ కోటా నిబంధనలను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులు సరైనవేనని హైకోర్టు తేల్చిచెప్పింది. ఇన్ సర్వీస్ కోటా కింద పీజీ సీటు పొందేందుకు నీట్ నిర్వహణ తేదీ

ఈ విషయంలో జోక్యం చేసుకోలేం: హైకోర్టు
జీవో 85ను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యం కొట్టివేత
అమరావతి, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): వైద్యశాఖలో సివిల్ అసిస్టెంట్ సర్జన్‌లుగా చేస్తున్న వారు పీజీ వైద్య విద్యను అభ్యసించేందుకు కేటాయించే ఇన్ సర్వీస్ కోటా నిబంధనలను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులు సరైనవేనని హైకోర్టు తేల్చిచెప్పింది. ఇన్ సర్వీస్ కోటా కింద పీజీ సీటు పొందేందుకు నీట్ నిర్వహణ తేదీ నాటికి 50 ఏళ్లు దాటి ఉండకూడదనే నిబంధనను సమర్థించింది. పీజీ పూర్తయ్యాక పదేళ్ల పాటు రాష్ట్రంలోనే పనిచేయాలనే నిబంధన సరైనదేనని తెలిపింది. దీన్ని ఉల్లంఘిస్తే రూ.50 లక్షలు జరిమానా విధిస్తామని ప్రభుత్వం నిబంధన విధించడాన్ని సమర్థించింది. పీజీ వైద్య విద్య ఇన్ సర్వీస్ కోటా నిబంధనలు సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో 85 విషయంలో తాము జోక్యం చేసుకోలేమని పేర్కొంది. పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్ రఘునందనరావుతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు ఇచ్చింది. పీజీ వైద్యవిద్య ఇన్‌సర్వీస్ కోటా నిబంధనలు సవరిస్తూ గతేడాది జులై 20న రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో 85ను సవాల్ చేస్తూ మేదరమెట్ల ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో సివిల్ అసిస్టెంట్ సర్జన్‌గా పనిచేస్తున్న డాక్టర్ జి చిట్టిబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది నర్రా శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం నిబంధనలు మార్చడంతో అభ్యర్థులు నష్టపోతున్నారన్నారు. అభ్యర్థుల గరిష్ఠ వయస్సు 50 ఏళ్లుగా నిర్ణయించడంతో పీజీ వైద్య విద్య ఇన్ సర్వీస్ కోటాకు పిటిషనర్ అనర్హులు అవుతున్నారన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను కొట్టివేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) ఎస్.ప్రణతి, ఎన్టీఆర్ హెల్త్ యునివర్సిటీ తరఫున న్యాయవాది టీవీ శ్రీదేవి వాదనలు వినిపించారు. పీజీ వైద్య విద్య పూర్తిచేసిన పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసేందుకు ఇష్టపడడం లేదన్నారు. ఈ నేపథ్యంలోనే కమిటీ సిఫారసు మేరకు నిబంధనలు సవరించామన్నారు. ఈ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం జీవో 85 విషయంలో తాము జోక్యం చేసుకోలేమని పేర్కొంది. పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.