Share News

Deputy CM Pawan Kalyan: ఇక స్థానిక ప్రభుత్వాలు

ABN , Publish Date - Apr 25 , 2025 | 03:47 AM

గ్రామ పంచాయతీలు అన్ని రంగాల్లో స్వావలంబిగా మారాలని, పంచాయతీరాజ్‌ శాఖలో పారదర్శక పాలన అమలు చేస్తున్నామని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. ప్రతి గ్రామంలో జాతీయ సమగ్రతకు ప్రతీకగా స్తూపాలు నిర్మించాలన్న సూచనతో పాటు, ఉపాధి శ్రామికులను గౌరవపూర్వకంగా పిలవాలన్నారు.

Deputy CM Pawan Kalyan: ఇక స్థానిక ప్రభుత్వాలు

ప్రతి పంచాయతీలో జాతీయ సమగ్రతా ప్రాంగణం

అందులో జాతీయ స్తూపం ఏర్పాటు.. రాజకీయాలకతీతంగా పంచాయతీలకు నిధులు

వాటి స్థలాలు, ఆస్తులకు ఆడిట్‌ జరగాలి.. అవి స్వయంప్రతిపత్తి సాధించాలి

అభివృద్ధి, ఆకాంక్షలతో స్వర్ణ గ్రామాలుగా వెలగాలి.. నిధుల మళ్లింపు, వృఽథా వ్యయం వద్దని ఆదేశించా

పారదర్శకంగా సిబ్బంది బదిలీలు.. ఉపాధి కూలీలని అనొద్దు

జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవంలో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సూచన

అమరావతి, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థలు అన్ని రంగాల్లో స్వావలంబన సాధించి స్థానిక ప్రభుత్వాలుగా మారేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పిలుపిచ్చారు. దానికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. ప్రతి గ్రామ పంచాయతీలో జాతీయ సమగ్రతా ప్రాంగణాలు నెలకొల్పాలని, అక్కడే జాతీయ స్తూపం నిర్మించాలన్నారు. పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా గురువారం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. గ్రామ పంచాయతీలు బలంగా ఎదగాలని.. ఆర్థిక, సామాజిక, రాజకీయ సమన్వయంతో ఐక్యంగా పనిచేయాలని.. అన్ని రంగాల్లో స్వయంప్రతిపత్తి సాధించాలని.. అభివృద్ధి, ఆకాంక్షలు కలగలిపి స్వర్ణ గ్రామాలుగా వెలగాలని ఆకాంక్షించారు. ‘కూటమి ప్రభుత్వంలో చాలా ఇష్టంగా పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలను చేపట్టాను. 2 నెలల పాటు సమగ్ర పరిశీలన చేసిన తర్వాత అధికారుల సమావేశంలో నేను చెప్పింది ఒక్కటే.. ఏ పనికి ఎంత కేటాయింపు జరిగిందో అదే పనికి నిధులు ఖర్చు చేయాలి. పారదర్శకంగా పనులు జరగాలని.. ఎలాంటి మళ్లింపులు, వృధా ఖర్చులు లేకుండా పల్లెల్లో సౌకర్యాలు, వసతులు సమకూరాలని చెప్పాను. ఆ ప్రకారమే ఇప్పుడు పనులు జరుగుతున్నాయి’ అని తెలిపారు. సిబ్బంది బదిలీలు ఎన్నడూ జరగనంత పారదర్శకంగా జరిపామన్నారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలో సమూల మార్పులు తీసుకొచ్చామని, దీని ఫలితమే సమష్టి కృషితో పల్లెల్లో పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ఈ విషయంలో ఎంతో కృషి చేస్తున్నారంటూ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌, కమిషనర్‌ కృష్ణతేజకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పనులను వేగవంతంగా పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు సంబంధించిన బిల్లులు త్వరలోనే అందుతాయని భరోసా ఇచ్చారు. ఉపముఖ్యమంత్రి ఇంకా ఏం చెప్పారంటే..


ప్రజలకు మేలు చేయాలని..

‘నాకు పాలనాపరమైన అనుభవం లేకున్నా, ప్రజలకు మేలు చేయాలనే త్రికరణ శుద్ధి ఉంది. రాజకీయాలకు అతీతంగా పంచాయతీలకు నిధులు అందిస్తు న్నాం. గతంలో అవి కులాలు, రాజకీయాలు, వర్గపోరుతో సతమతమయ్యేవి. దీనిని క్రమంగా అధిగమిస్తున్నాం. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే సర్పంచ్‌ల ఆత్మగౌరవం నిలిపేలా జాతీయ పండుగలైన రిపబ్లిక్‌డే, ఆగస్టు 15కు ఖర్చు చేసేందుకు నిధులు పెంచాం. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు తగిన గౌరవం ఇస్తున్నాం. గత ప్రభుత్వం పంచాయతీలను నిర్లక్ష్యం చేసింది. వాటి నిధులను ఇష్టానికి వాడేసింది. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆర్థిక సంఘం పెండింగ్‌ నిధులు, వాటికి రావలసిన నిధులను నేరుగా వాటి ఖాతాల్లోనే వేశాం. రూ.1,121 కోట్ల ఆర్థిక సంఘం నిధులను అందించడం గొప్ప విషయం.

కూలీలనడం బాగోలేదు..

ఉపాధి హామీ పథకంలో పనిచేసే వారిని కూలీలు అని పిలవడం మనసును కలిచివేస్తోంది. గ్రామాల అభివృద్ధి చోదకులుగా పనిచేస్తున్న వారిని అలా పిలువడం అంత బాగా లేదు. కూలీ అనే పదం బ్రిటి్‌షవారు భారతీయులతో వెట్టిచాకిరి చేయించుకునేందుకు ఉపయోగించిన పదం. దానిని ఇప్పుడు మనం ఉపయోగించడం సమంజసం కాదు. కూలీ అంటే చాకిరీ చేసేవారుగా అనిపిస్తోంది. ఇక నుంచి ఉపాధి శ్రామికులు లేదా నేస్తాలుగా పిలుద్దాం.


కలప పెంచుదాం.. దేశానికి సేవ చేద్దాం...

భారతదేశం ఏటా రూ.20 వేల కోట్ల కలపను దిగుమతి చేసుకుంటోంది. దీనివల్ల విదేశీ మారకద్రవ్యం ఖర్చవుతోంది. దేశీయ అవసరాలకు ఈ కలపను దేశీయంగానే అందించే ఏర్పాటు చేస్తే ఇటు పంచాయతీలకు ఆర్థిక వృద్ధితోపాటు విదేశీ మాదకద్రవ్యం ఖర్చు కాకుండా కాపాడి దేశసేవ చేసిన వాళ్లమవుతాం. పం చాయతీల్లో విలువైన ఖాళీ స్థలాల్లో కలప పెంచేందు కు ప్రోత్సహిస్తాం. దీనివల్ల పచ్చదనంతో పాటు ఆదా యం కూడా సమకూరుతుంది. పంచాయతీలకు గతం లో ఆదాయం ఆధారంగా గ్రేడింగ్‌ ఇచ్చేవారు. దా నిని తొలగించి జనాభా ఆధారంగా గ్రేడింగ్‌ ఇచ్చే ఏర్పాట్లు చేశాం. ఇంటి పన్నుల వసూళ్లు పెరిగాయి. 9 నెలల్లో రూ.800 కోట్లు వసూలైనట్లు లెక్కలు చెబుతున్నాయి.

ఉగ్రదాడి అమరులకు నివాళులు...

కశ్మీర్‌లో పేలిన తూటా దేశాన్ని కన్నీరు పెట్టేలా చేసిందని, ప్రతి ఒక్కరూ ఆవేదన చెందారని పవన్‌ అన్నారు. కార్యక్రమంలో ముందుగా పహల్గాం ఉగ్ర దాడిలో అమరులైన వారికి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. అనంతరం పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖకు చెందిన సుమారు 15 విభాగాల్లో వివిధ స్థాయుల్లో ఉత్తమ పనితీరు కనబరచిన 74 మందికి ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఆ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి ఏర్పాటుచేసిన వివిధ స్టాళ్లను పవన్‌ కల్యాణ్‌ తిలకించారు. కార్యక్రమంలో శశిభూషణ్‌కుమార్‌, కృష్ణతేజ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌, ఎండీ అనిల్‌కుమార్‌రెడ్డి, ఏపీఎ్‌సఆర్‌డీపీఆర్‌ కమిషనర్‌ ముత్యాలరాజు, గుంటూరు, అనంతపురం, సత్యసాయి జిల్లాల కలెక్టర్లు ఎస్‌.నాగలక్ష్మి, వినోద్‌ కుమార్‌, టీఎస్‌ చేతన్‌, ఉపాధి హామీ పథకం డైరెక్టర్‌ షణ్ముఖ్‌కుమార్‌, ఈఎన్‌సీలు బాలూనాయక్‌, గాయత్రీదేవి, ఇతర ఉన్నతాధికారులు, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు పాపారావు పాల్గొన్నారు.


భూమి లేకుండా అభివృద్ధి ఎలా?

రాష్ట్రంలోని అన్ని పంచాయతీల ఆస్తులు, భవనాలు, అన్యాక్రాంతమైన భూములపై సమగ్ర ఆడిట్‌ జరగాలి. నేను ఇటీవల రైల్వేకోడూరు నియోజకవర్గం మైసూరావారిపల్లెకు వెళ్లినప్పుడు ఆ గ్రామంలో క్రీడా స్థలం ఏర్పాటుకు పంచాయతీ వద్ద భూమి లేదని చెప్పారు. నాకు ఆశ్చర్యం కలిగింది. తర్వాత నా సొంత నిధులతో ప్రైవేటు స్థలం కొనుగోలు చేసి అందించాం. పంచాయతీకి భూమి లేకుంటే అభివృద్ధిలో ఎలా ముందుకెళ్లగలం? గ్రామాలు దేశానికి పట్టుగొమ్మలే కాదు.. జాతి సమగ్రతకు నిండు రూపాలు కావాలి. ప్రతి గ్రామంలో ఎవరెవరివో విగ్రహాలు పెడుతున్నారు. అలా కాకుండా ప్రతి పంచాయతీలోనూ ఓ జాతీయ సమగ్రతకు ప్రాంగణం, అందులో జాతీయ సమగ్రత స్తూపం ఉండాలి. ఇక్కడ దేశం కోసం, దేశ ఐక్యత కోసం పనిచేసిన వారి ప్రతిరూపాలు ఉండాలి. దీనిపై ఉన్నతాధికారులు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేస్తే.. కేబినెట్‌ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తా. అవసరమైతే ప్రధాని మోదీతో చర్చిస్తా. సర్పంచ్‌లకు గౌరవ వేతనాలు పెంచాలని సంఘం నేత పాపారావు కోరారు. పరిశీలించి పరిష్కరిస్తాం. మా ప్రభుత్వం వచ్చిన 9 నెలల్లోనే పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలో రూ.10669 కోట్ల పనులు జరిగాయి. 13,326 గ్రామసభల్లో తీసుకున్న నిర్ణయాలను చక్కగా అమలు చేశాం. 4 వేల కి.మీ మేర సీసీరోడ్లు, 21,564 గోకులాలు, 12,950 నీటి తొట్టెలు, 20,286 పంట కుంటలను అతి తక్కువ కాలంలో పూర్తి చేయడం సమష్టి కృషికి నిదర్శనం. దీంతోపాటు అడవితల్లి బాటలో భాగంగా రూ.1,005 కోట్లతో 1069 కి.మీ మేర రోడ్లను వేసి డోలీ రహిత ఆంధ్రప్రదేశ్‌ సాకారానికి ముందడుగు వేస్తున్నాం.


Also Read:

ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..

లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...

ప్రధాని నివాసంలో కీలక సమావేశం..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 25 , 2025 | 07:31 AM