Panchayat Raj : పంచాయతీ ప్రక్షాళన
ABN , Publish Date - Jan 23 , 2025 | 04:32 AM
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖను ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఆ శాఖను సమూల సంస్కరణల దిశగా నడిపించేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ రంగంలోకి దిగారు. స్థానిక సంస్థల పాలన ప్రజలకు
ఒకే గొడుగు కిందకు వ్యవస్థలు
జిల్లాల్లో ఒకే చోట కార్యాలయాలు
సంస్కరణలకు సంఘాలు ఓకే.. ఏకగ్రీవ ఆమోదం
అమరావతి, జనవరి 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖను ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఆ శాఖను సమూల సంస్కరణల దిశగా నడిపించేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ రంగంలోకి దిగారు. స్థానిక సంస్థల పాలన ప్రజలకు చేరువ కావడంతోపాటు పారదర్శకతకు, జవాబుదారీతనానికి పెద్దపీట వేయనున్నారు. ఈ శాఖకు సంబంధించిన వ్యవస్థలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురానున్నారు. నిపుణులతో సంప్రదించిన ఉపముఖ్యమంత్రి ‘ఎవరికి వారే’ అన్నచందంగా ఉన్న పంచాయతీరాజ్ సంస్థలన్నింటినీ ఒకే చోటకు చేర్చే ప్రయత్నాలు ప్రారంభించారు. బుధవారం ఈ శాఖలో భాగస్వాములుగా ఉన్న డీఎల్‌డీవో, ఎంపీడీవో, డీపీవో, డిప్యూటీ సీఈవో, డీఎల్‌పీవో, ఈవో పీఆర్‌డీల ఉద్యోగ సంఘాలు, పంచాయతీరాజ్ అసోషియేషన్ జేఏసీ నేతలతో తాడేపల్లి కార్యాలయంలో కమిషనర్ కృష్ణతేజ, ఉపముఖ్యమంత్రి ఓఎ్‌సడీ వెంకటకృష్ణ భేటీ అయ్యారు. ప్రభుత్వం ప్రతిపాదించిన సంస్కరణలను అధికారులు ఏకగ్రీవంగా ఆమోదించారు. సంస్కరణలను కమిషనర్ కృష్ణతేజ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.
సమూల మార్పులు
రాష్ట్రంలోని అన్ని శాఖల కంటే పంచాయతీరాజ్ శాఖ చాలా పెద్దది. లక్షమందికి పైగా ఉద్యోగులున్న ఈ శాఖలో పాలన ఒక తాటి మీద లేకపోవడంతో గ్రామీణాభివృద్ధి సజావుగా సాగనిపరిస్థితి నెలకొంది. ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాలు, ఉన్నతాధికారులు ఈ శాఖను సంస్కరించే ప్రయత్నం చేసినా ఫలించలేదు. జిల్లాలో పంచాయతీరాజ్ వ్యవస్థలన్నీ ఒకేచోట ఉండాలని పవన్ కల్యాణ్.. నిర్ణయించారు. ఈ క్రమంలోనే సంస్కరణలకు ప్రాధాన్యం ఇచ్చారు. జిల్లాస్థాయిలో సచివాలయాలను పర్యవేక్షిస్తున్న డీఎల్‌డీవోలకు కార్యాలయాలు లేవు. డీపీవోలకు కూడా భవనాలు లేవు. జడ్పీలు, ఇంజనీరింగ్ విభాగాలకు మాత్రమే కార్యాలయాలున్నాయి. దీంతో జిల్లా స్థాయిలో ఆయా విభాగాలను పర్యవేక్షించేందుకు కలెక్టర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో జడ్పీ సీఈవో, డీఎల్‌డీవో, డీపీవో, పీఆర్ ఇంజనీరింగ్, ఎస్‌ఈ కార్యాలయాలన్నింటినీ ఒకే కాంపౌండ్‌లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
కేడర్ పోస్టులకు ఒకే హోదా
పంచాయతీరాజ్ విభాగంలో డివిజనల్ డెవల్‌పమెంట్ ఆఫీసర్(డీఎల్‌డీవో)ను ఇక నుంచి డీడీవోగా పిలవనున్నారు. అదే విధంగా డీడీవోలు, డిప్యూటీ సీఈవోలు, డీపీవోలను ఒకే కేడర్ కిందకు చేర్చారు. వారు పదోన్నతి పొంది జడ్పీ సీఈవోలు అవుతారు. ఎంపీడీవోలు, డీఎల్‌పీవోలను ఇకనుంచి ఒకే కేడర్ కింద పరిగణిస్తారు. వారికి పదోన్నతి లభిస్తే డీఎల్‌డీవోలు, డిప్యూటీ సీఈవోలు, డీపీవోలు అవుతారు. మండలస్థాయిలో ఈవో పీఆర్ అండ్ ఆర్డీ అధికారులను ఇకనుంచి మండల పంచాయతీ అధికారులుగా పిలుస్తారు. అయితే, ఎంపీడీవోలను దేశవ్యాప్తంగా బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్లు(బీడీవో)లుగా పిలుస్తున్నందున రాష్ట్రంలోనూ అలాగే పరిగణించాలని సంఘాలు కోరాయి. పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని కమిషనర్ తెలిపారు. తాజా సంస్కరణల్లో భాగంగా ఎంపీడీవో పోస్టులు పదోన్నతుల ద్వారానే భర్తీ చేయాలని నిర్ణయించారు. ఇకనుంచి వారిని నేరుగా నియమిం చే విధానానికి స్వస్తి పలకనున్నారు. ఎంపీడీవో స్థాయి కంటే కింద ఈవో పీఆర్ అండ్ ఆర్డీ, సూపరింటెండెంట్‌లు, పంచాయతీ కార్యదర్శులు వేలమంది ఉన్నందున వారికి పదోన్నతులు దక్కేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. డీఎల్‌డీవో పోస్టులను సర్వీసు కమిషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అదేసమయంలో పదోన్నతుల ద్వారా కూడా భర్తీ చేస్తారు. రెవెన్యూ విభాగంలో ఆర్డీవోకు ఏ స్థాయి అధికారాలు ఉంటాయో, పంచాయతీరాజ్‌లో డీఎల్‌డీవోలకు అవే అధికారాలు కల్పిస్తారు. మొత్తంగా అధికారాల్లో ఎలాంటి మార్పులు చేయరు.
మంచి పరిణామం: సంఘాలు
ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ శాఖలో సంస్కరణలు తీసుకురావడం సంతోషంగా ఉందని పంచాయతీరాజ్ జేఏసీ నేత కేఎస్ వరప్రసాద్ తెలిపారు. అధికారులు, ఉద్యోగులు కోరుకుంటున్నట్టుగా సంస్కరణలు ప్రారంభమయ్యాయన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థల ప్రక్షాళనను స్వాగతిస్తున్నామని డీఎల్‌డీవోల సంఘం నేతలు వరప్రసాద్, సూర్యనారాయణ తెలిపారు. ఇది మంచి పరిణామమని, దీంతో ఉద్యోగుల పదోన్నతుల విషయంలో ఇబ్బందులు తొలగుతాయని పంచాయతీరాజ్ జేఏసీ నేత వైవీడీ ప్రసాద్ అన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థలు మరింత బలపడేందుకు సంస్కరణలు దోహదపడతాయని జేఏసీ నేత వెంకట్రావు పేర్కొన్నారు. అడిషనల్ కమిషనర్ సుధాకర్, సత్యనారాయణ, డీఎల్‌డీవో, ఎంపీడీవో, డీపీవో, డీఎల్‌పీవో, ఈవోపీఆర్ అండ్ ఆర్డీ, పంచాయతీ కార్యదర్శుల సంఘాలు, పీఆర్ మినిస్టీరియల్ యూనియన్ నేతలు బండి శ్రీనివాస్, జడ్పీ మినిస్టీరియల్ యూనియన్ నేతలు హాజరయ్యారు.