Tamil Nadu : తమిళనాడుకు చేరిన పవన్ ఆధ్యాత్మిక యాత్ర
ABN , Publish Date - Feb 14 , 2025 | 06:12 AM
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురువారం తమిళనాడులోని తంజావూరు చుట్టుపక్కలున్న వివిధ ఆలయాలను సందర్శించారు. బుధవారం కేరళలోని ఆలయాలను సందర్శించిన పవన్.. గురువారం తొలుత ఓంకార మంత్ర రహస్యాన్ని సృష్టికి అందించిన క్షేత్రంగా, షష్ఠ షణ్ముఖ

తంజావూరు, కుంభకోణం ఆలయాల్లో ప్రత్యేక పూజలు
కందషష్టి కవచ పారాయణంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం
ఆలయాల్లో రాజకీయాలు వద్దు ప్లీజ్..
మీడియాకు జనసేన అధినేత వినతి
చెన్నై, అమరావతి, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురువారం తమిళనాడులోని తంజావూరు చుట్టుపక్కలున్న వివిధ ఆలయాలను సందర్శించారు. బుధవారం కేరళలోని ఆలయాలను సందర్శించిన పవన్.. గురువారం తొలుత ఓంకార మంత్ర రహస్యాన్ని సృష్టికి అందించిన క్షేత్రంగా, షష్ఠ షణ్ముఖ క్షేత్రాల్లో ఐదవదిగా పేరుగాంచిన తంజావూరు జిల్లా స్వామిమలైలో కొలువైన స్వామినాథ స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. పవన్ పంచహారతులతో హారతి ఇచ్చి, ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ధ్వజస్తంభానికి మొక్కారు. స్వామినాథస్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన కంద షష్ఠి కవచ పారాయణంలో పాల్గొన్నారు. తరువాత ఆ ఆలయంలో వెలసిన ఆదిదంపతులు సుందరేశ్వరన్ స్వామి, మీనాక్షి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్‌కు ఆలయ డిప్యూటీ కమిషనర్ ఉమాదేవి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. తంజావూరు జిల్లా కుంభకోణంలో వున్న శ్రీ ఆది కుంభేశ్వరాలయాన్ని పవన్ సందర్శించారు. ఆలయ సంప్రదాయం మేరకు మొదట ఆది వినాయగర్‌ని పూజించారు. అనంతరం శ్రీ ఆదికుంభేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమృతభాండాకారంలో వున్న శివలింగ విశిష్ఠతను ఆలయ అర్చకులు వివరించారు. అమృతం, ఇసుకతో కలగలసి ఉద్భవించిన ఈ లింగానికి అభిషేకాలు నిర్వహించరని తెలిసి, విశిష్ఠ పూజలు నిర్వహించారు. పంచహారతులు ఇచ్చి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆదికుంభేశ్వరాలయంలో స్వామివారికి ఎడమవైపు వెలసిన పార్వతీదేవి అవతారం శ్రీ మంగనాయకి అమ్మవారికి కూడా పవన్ పూజలు నిర్వహించారు. అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో వున్న అగస్త్య ధ్యాన పీఠాన్ని సందర్శించారు. ఈ ప్రాంతంలో కూర్చుంటే తెలియకుండానే ధ్యాన ముద్రలోకి వెళ్తారని మందిరం విశిష్ఠతను అర్చకులు ఈ సందర్భంగా వివరించారు. అంతకు ముందు ఆలయ ఆస్థాన గజం మంగళంతో కలిసి అర్చకులు, అధికారులు, ఆలయ ట్రస్టు బోర్డు సభ్యులు పవన్ కల్యాణ్‌కు స్వాగతం పలికారు. ఆలయ ఆస్థాన ఏనుగుకు పవన్ అరటి పళ్లు అందించి ఆశీస్సులు పొందారు. ఆలయ కార్యనిర్వహణాధికారి మురుగన్, ట్రస్టు బోర్డు సభ్యులు బాల సుబ్రహ్మణ్యం, శంకరరాణి, చిదంబరం తదితరులు పవన్‌కు స్వామి, అమ్మవార్ల చిత్రపటాలను అందించి సత్కరించారు.
ఆలయాల్లో రాజకీయాలు వద్దు ప్లీజ్!
శ్రీ ఆదికుంభేశ్వరాలయ సందర్శనానంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ... ‘నాలుగేళ్లుగా శ్రీ అగస్త్య మహాముని ఆలయం, స్వామిమలై శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్ర దర్శనం కోసం వేచిచూస్తున్నా. ఇప్పటికి ఆ మురుగన్ అనుగ్రహం లభించింది’ అని అన్నారు. తమిళనాడులో విజయ్ రాజకీయ ప్రస్థానం గురించి ప్రస్తావించగా... ఆలయాల్లో రాజకీయాలు వద్దంటూ సున్నితంగా తిరస్కరించారు. కాగా కుంభకోణం వచ్చిన పవన్‌కు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. తెలుగు విద్యార్థులు, అభిమానులతో పవన్ సెల్ఫీలు దిగారు. అదేవిధంగా ఓ దుకాణంలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ‘కుంభకోణం డిక్రీ’ కాఫీని పవన్ రుచి చూశారు. పవన్ వెంట ఆయన కుమారుడు అకిరా నందన్, టీటీడీ ట్రస్టు బోర్డు సభ్యుడు ఆనంద్ సాయి కూడా వున్నారు. ఇదిలా వుండగా శుక్రవారం పవన్ కల్యాణ్ తూత్తుకుడి జిల్లా తిరుచ్చెందూర్, మదురై మీనాక్షి, పళని మురుగన్, తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలను కూడా సందర్శించనున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.