Share News

Kashmir Terror Attack: ఉగ్రవాదుల్ని ఏరిపారేయాలి

ABN , Publish Date - Apr 25 , 2025 | 04:58 AM

ఉగ్రవాదులు ఎక్కడున్నా నిర్దాక్షిణ్యంగా ఏరిపారేయాలని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. కశ్మీర్‌ ఉగ్రదాడిలో మృతిచెందిన సోమిశెట్టి మధుసూదనరావు, చంద్రమౌళి కుటుంబాలకు పరామర్శించారు.

 Kashmir Terror Attack: ఉగ్రవాదుల్ని ఏరిపారేయాలి

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

మధుసూదన్‌రావు, చంద్రమౌళి కుటుంబాలకు పరామర్శ

నివాళులర్పించిన మంత్రులు అనిత, ఆనం, సత్యకుమార్‌, మనోహర్‌, డోలా

బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు..

కావలి, విశాఖపట్నం, బీచ్‌రోడ్డు, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): ఉగ్రవాదులు ఎక్కడున్నా నిర్దాక్షిణ్యంగా ఏరిపారేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. కశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడిలో మృతిచెందిన నెల్లూరు జిల్లా కావలికి చెందిన సోమిశెట్టి మధుసూదనరావు, విశాఖకు చెందిన చంద్రమౌళి మృతదేహాలను ఆయన గురువారం సందర్శించి నివాళులర్పించారు. కావలిలో జరిగిన కార్యక్ర మంలో పవన్‌తోపాటు మంత్రులు ఆనం రామ నారాయణరెడ్డి, నాదెండ్ల మనోహర్‌, సత్యకుమార్‌, కావలి, సర్వేపల్లి, ఉదయగిరి ఎమ్మెల్యేలు వెంకటక్రిష్ణారెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కాకార్ల సురేశ్‌.. పాల్గొన్నారు. అనంతరం పవన్‌ మీడియాతో మాట్లాడుతూ... భార్య, పిల్లల కళ్లెదుటే మధుసూదన్‌రావును ఉగ్రవాదులు అతికిరాతకంగా కాల్చి చంపారని, ఈ ఘటన ఎలా జరిగిందో వాళ్ల కుటుంబ సభ్యులు చెబుతుంటే తనకేపేగులు మెలపెట్టినట్టుగా ఉంద న్నారు. కాగా, ఉగ్రవాద చర్యల వల్ల నష్టపోయిన కటుంబాలకు కూటమిప్రభుత్వం అండగా ఉంటుం దని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారం ప్రకటించినట్లు చెప్పారు. కశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడి ఘటనను చీకటి రోజుగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ అభివర్ణించారు. పరామర్శించిన వారిలో ఎస్పీ క్రిష్ణకాంత్‌, మాజీ ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌ రెడ్డి, వంటేరు వేణుగోపాలరెడ్డి, బీజేపీ, జనసేనతోపాటు వామపక్ష పార్టీల నాయకులు ఉన్నారు. అనంతరం మధుసూదనరావు అంతిమ యాత్రను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు.


చంద్రమౌళి కుటుంబానికి పవన్‌ పరామర్శ

పహల్గాం ఘటనలో మృతిచెందిన విశాఖ వాసి చంద్రమౌళి కుటుంబాన్ని పవన్‌కల్యాణ్‌ గురువారం రాత్రి పరామర్శించారు. ఆయన రాత్రి 8.15 గంటలకు విమానంలో విశాఖకు వచ్చారు. ముందుగా జిల్లా పరిషత్‌ జంక్షన్‌ దగ్గరున్న కనకదుర్గ ఆస్పత్రిలో చంద్రమౌళి మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అక్కడి నుంచి పాండురంగాపురంలో ఉన్న చంద్రమౌళి నివాసానికి వెళ్లి ఆయన భార్య నాగమణి, కుటుంబీకులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

glhj.jpg

పవన్‌ వెంట జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, హోం మంత్రి వంగలపూడి అనిత, విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్‌, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌ ఉన్నారు. కాగా, చంద్రమౌళి కుటుంబానికి అండగా ఉంటామని విశాఖ జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి హామీ ఇచ్చారు. చంద్రమౌళి కుటుంబసభ్యులకు గురువారం ఆయన రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.10 లక్షల చెక్కును అందజేశారు. విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్‌ మాట్లాడుతూ.. పర్యాటకులపై ముష్కరుల దాడి దుర్మార్గ చర్య అని అన్నారు. తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడుతూ.. ఉగ్రవాదులు అమాయకుల ప్రాణాలు తీశారని విచారం వ్యక్తం చేశారు.


Also Read:

ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..

లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...

ప్రధాని నివాసంలో కీలక సమావేశం..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 25 , 2025 | 04:58 AM