పరమశివుడికి పాగాలంకరణ
ABN , Publish Date - Feb 26 , 2025 | 11:57 PM
శ్రీగిరిలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి.

వైభవంగా ఆది దంపతుల కళ్యాణం
నేత్వ పర్వంగా మహా శివరాత్రి ఉత్సవాలు
శ్రీగిరిలో పోటెత్తిన భక్తకోటి...
నంద్యాల, ఫిబ్రవరి26( ఆంధ్రజ్యోతి) : శ్రీగిరిలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి 10 గంటలకు ఆలయ ప్రధాన పూజారులు లింగోద్భవకాల మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ప్రారంభించారు. శివరాత్రి నాడు శ్రీశైలంలోనే ఉండే విశేషం ఆచారం మల్లన్న పాగాలంకరణ కార్యక్రమాన్ని పృథ్వీ వెంకటేశ్వర్లు తనయుడు సుబ్బారావు చేపట్టారు. రుద్రాభిషేకం ఆనంతరం ఆర్ధరాత్రి మల్లన్న, భ్రమరాంబికదేవి కల్యాణం నేత్వపర్వంగా సాగింది. వీటితోపాటు ప్రభోత్సవం, నంది వాహన సేవ ఘనంగా జరిగింది. మహా శివరాత్రి నేపథ్యంలో భక్తులు, శివమాలధారులతో శ్రీశైలం కిక్కిరిసింది.
ఫ అంగరంగ వైభవంగా పాగాలంకరణ...
వివాహ సమయాల్లో పెళ్లి కుమారుడికి తలపాగా చుట్టడం అందరికి తెలిసిందే. ఆట్లాగే మహాశివరాత్రి రోజు శ్రీశైల మల్లికార్జునుడిని పెళ్లి కుమారుడిగా ముస్తాబు చేయడంలో భాగంగా పాగాలంకరణ చేస్తారు. 365 మూరల పాగాను గర్భాలయ విమాన శిఖరం నుంచి ముఖ మండపంపైన ఉన్న నందులకు అనుసంధానిస్తూ తలపాగాను తలపించేలా ముస్తాబు చేశారు. ఎంతో నియమ నిష్టలతో బాపట్ల జిల్లా చీరాల మండలం హస్త్తినాపురం గ్రామానికి చెందిన పృథ్వీ వెంకటేశ్వర్లు కుటుంబం ఏడాది పాటు నేసిన వస్ర్తాన్ని ఇతర ప్రాంతాల నుంచి భక్తులు నేసిన వసా్త్రలను కలిసి పాగాలంకరణకు వినియోగించారు.
ఫ కమనీయం కల్యాణం...
భ్రమరాంబ, మల్లికార్జున స్వామి వార్ల ప్రభోత్సవ కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. కల్యాణోత్సవంలో స్వామి వారు పట్టువసా్త్రలను ధరించి, తలపై ఒకవైపు గంగమ్మను, మరోకవైపు నెల వంకను, మెడలో రుద్రాక్ష మాలను, నుదట విభూది రేఖలతో పెండ్లి కుమారుడిగా ముస్తాబయ్యారు. భ్రమరాంబ దేవి పట్టు వసా్త్రలను ధరించి, నుదట కల్యాణ తిలకాన్ని, బుగ్గన చుక్కను, సూర్యాభరణాలను ధరించి పెళ్లి కూతురిగా తయారయ్యారు. స్వామి, అమ్మ వారు అర్థరాత్రి 12 గంటలకు వెండి పల్లకిలో పెండ్లి మండపానికి చేరుకున్నారు. నుదుట భాషికం కట్టి, తిలకం దిద్ది, కస్తూరి జవ్వాజి సుగంధ పరిమాళాలతో పెండ్లి పీటలపై ఆశీనులయ్యారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల నడుమ స్వామి, అమ్మవార్ల కల్యాణ మహోత్సవం చూసి భక్తులు పరవశించిపోయారు.
ఫ మహా రుద్రాభిషేకం..
మహా శివరాత్రిని పురస్కరించుకుని రాత్రి 10 గంటల నుంచి స్వామి అమ్మ వార్లకు లింగోద్భవకాల మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేశారు. వేద పండితులు.. ఎంతో నిష్ణాతులైన 11మంది అర్చకులచే ఆలయ ప్రాంగణంలోని పవిత్రమైన మల్లికాగుండంలోని జలాలు, పంచామృతాలు, పలు ఫలోదకాలతో అభిషేకం జరిపించారు
ఫ ఊరేగిన మల్లన్న...
ఉభయ దేవాలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి ఆలంకార మండపంలో నందివాహన సేవను నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలతో హారతులు ఇచ్చి నంది వాహనంపై కొలువైన ఆది దంపతులను ఆలయ ప్రదక్షిణ చేయించి ఊరేగించారు. కళాకారులు నృత్య ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి.