అవుటర్ ఆశలు
ABN , Publish Date - Feb 24 , 2025 | 01:09 AM
అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్)తో ఉమ్మడి కృష్ణాజిల్లాలోని పల్లెలకు మహర్దశ పట్టనుంది. తాజాగా ఓఆర్‌ఆర్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం లభించింది. గ్రామీణుల భూములు, ఆస్థుల విలువ పెరగనుంది. మారుమూల గ్రామాలకు సైతం మౌలిక సదుపాయాలు సమకూరనున్నాయి. రెసిడెన్షియల్, కమర్షియల్‌గా ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందటంతో పాటు స్థానిక యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు రానున్నాయి.

- రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం
- మౌలిక సదుపాయాల కల్పనకు అవకాశాలు
- పెట్టుబడుల ఆకర్షణతో ఉపాధి, ఉద్యోగాల కల్పన
- రాజధాని, విజయవాడ, గుంటూరు నగరాలతో అనుసంధానం
- పరిశ్రమల స్థాపన, పర్యాటక, ఆతిథ్య రంగాల అభివృద్ధికి బాటలు
అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్)తో ఉమ్మడి కృష్ణాజిల్లాలోని పల్లెలకు మహర్దశ పట్టనుంది. తాజాగా ఓఆర్‌ఆర్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం లభించింది. గ్రామీణుల భూములు, ఆస్థుల విలువ పెరగనుంది. మారుమూల గ్రామాలకు సైతం మౌలిక సదుపాయాలు సమకూరనున్నాయి. రెసిడెన్షియల్, కమర్షియల్‌గా ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందటంతో పాటు స్థానిక యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు రానున్నాయి.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్)కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఉమ్మడి కృష్ణాజిల్లాలో పండుగ వాతావరణం నెలకొంది. ఎన్టీఆర్ జిల్లాలో కంచిచర్ల, వీరులపాడు, జి.కొండూరు, మైలవరం, కృష్ణాజిల్లాలో బాపులపాడు, గన్నవరం, ఉంగుటూరు, కంకిపాడు, తోట్లవల్లూరు మండలాల పరిధిలోని మొత్త 52 గ్రామాల మీదుగా ఈ అవుటర్ రింగ్ రోడ్డు వెళుతుంది. కంచికచర్ల నుంచి మొదలై జుజ్జూరు, నందిగామ, జి.కొండూరు, మైలవరం, అంపాపురం, పెద్ద అవుటపల్లి, మారేడుమాక, దావులూరు, రొయ్యూరు, చిన పులిపాకల మీదుగా గుంటూరు జిల్లాలోకి ప్రవేశిస్తుంది. అలైన్‌మెంట్ పరిధిలోకి వచ్చే ఆయా ప్రాంతాలన్నింటికీ మహర్దశ పట్టనుంది. విజయవాడ ఈస్ట్ బైపాస్ ప్రతిపాదన వెనక్కిపోవటంతో నిరాశతో ఉన్న ఉమ్మడి కృష్ణాజిల్లా ప్రజల్లో అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) ఆశలు రేకెత్తిస్తోంది. ఓఆర్‌ఆర్‌ను నమ్ముకుని పెట్టుబడులు పెట్టిన వారిలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అతి త్వరలోనే ఓఆర్‌ఆర్‌కు భూ సేకరణ నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. ఏడాది లోపు ఈ ప్రక్రియ పూర్తయి పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఓఆర్‌ఆర్‌తో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలకు ఊతం ఇవ్వడంతో పాటు, అభివృద్ధి అవకాశాలను సృష్టించడం వంటివి జరగనుండటంతో భూముల బూమ్ నెలకొంది.
పెరగనున్న భూములు, ఆస్థుల విలువ
అవుటర్ రింగ్ రోడ్డు అనుసంధానమవుతున్న ప్రాంతాల్లో భూములు, ఆస్థుల విలువలు గణనీయంగా పెరగనున్నాయి. ప్రధానంగా నందిగామ, జి.కొండూరు, మైలవరం, గన్నవరం, కంకిపాడు, పెనమలూరు వంటి ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందటానికి అవకాశం ఉంది. ఓఆర్‌ఆర్ సమీపంలోని భూములు రెసిడెన్షియల్, కమర్షియల్‌గా అభివృద్ధి చెందటానికి దోహదపడుతుంది. అవుటర్ రింగ్ రోడ్డు వెంబడి ఉన్న ప్రాంతాలు వాణిజ్య కేంద్రాలుగా మారనున్నాయి. షాపింగ్ మాల్స్, ఆఫీసులు, వెంచర్లు, నివాస ప్రాంతాలు, కాలనీలు, దాబాలు, షాపులు ఇలా అనేక రకాల కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. ఇలాంటి కార్యకలాపాల వల్ల రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు ఊపందుకోవటానికి ఆస్కారం ఏర్పడుతుంది. అవుటర్ వెంబడి కొత్త ప్రాజెక్టులను ప్రారంభించటానికి అవకాశం కలుగుతుంది. రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు ఎక్కువుగా సాగటం వల్ల స్థానిక ప్రాంతాల్లో ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. అనేక ఉపాధి, ఉద్యోగావకాశాలు ఏర్పడతాయి.
పెట్టుబడుల ఆకర్షణ
అవుటర్ రింగ్ రోడ్డు వల్ల పెట్టుబడులను ఆకర్షించటానికి అవకాశాలు పెరుగుతాయి. ప్రధానంగా మేజర్ గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీలు, పట్టణ ప్రాంతాల పరిధిలో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతారు. పెట్టుబడులు ఏ స్థాయిలో అయినా ఉండవచ్చు. స్థానిక పెట్టుబడులతో పాటు జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులను కూడా ఆకర్షించటానికి వీలుగా పరిస్థితులు ఉంటాయి.
మౌలిక సదుపాయాల కల్పనకు ఊతం
అవుటర్ రింగ్ రోడ్డు సాకారమవుతున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ఆయా ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కూడా జరుగుతుంది. ప్రధానంగా ప్రభుత్వం ద్వారా నిరంతరాయ విద్యుత, వాటర్ నెట్‌వర్క్, సీవరేజీ నెట్‌వర్క్, అనుసంధాన రోడ్లు, ఉద్యానవనాలు, పాఠశాలలు, కాలేజీలు వంటివి ఏర్పాటు కావటానికి అన్ని అవకాశాలు ఉన్నాయి.
పరిశ్రమలు, వ్యాపార కేంద్రాల ఏర్పాటుకు మార్గం
అవుటర్ రింగ్ రోడ్డు వల్ల మెరుగైన కనెక్టివిటీని దృష్టిలో పెట్టుకుని పరిశ్రమలు కూడా అవుటర్ వెంబడి కొలువుదీరటానికి అవకాశం ఉంది. అవుటర్ వెంబడి పరిశ్రమల ఏర్పాటు వల్ల తమ ఉత్పత్తులను అత్యంత తేలిగ్గా ఇతర రాష్ర్టాలకు ఎగుమతులు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. అలాగే దిగుమతులు చేసుకోవటానికి కూడా తేలిగ్గా ఉంటుంది. అనేక రకాల వ్యాపారాలను కూడా స్థాపించటానికి అవకాశం ఉంది. ఈ కార్యకలాపాల వల్ల స్థానికంగా ఉద్యోగావకాశాలు గణనీయంగా పెరుగుతాయి.
పర్యాటకంగా అభివృద్ధి
ఓఆర్‌ఆర్ వల్ల పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుంది. ఓఆర్‌ఆర్ అలైన్‌మెంట్ తోటపల్లిలోని బ్రహ్మయ్య లింగం చెరువు పక్క నుంచి వెళుతోంది. దీంతో బ్రహ్మయ్య లింగం చెరువు, బ్రహ్మకైలాసం వంటివి దైవక్షేత్రం పర్యాటకంగా, ఆధ్యాత్మికంగా మరింతగా అభివృద్ధి చెందటానికి దోహదపడనుంది. ఇలా ఎన్నో ప్రాంతాల్లో స్థానికంగా ఉన్న పర్యాటక వనరులను బట్టి పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది. అలాగే హోటల్స్, రెస్టారెంట్లు, కాటేజీలతో ఆతిథ్య రంగం కూడా విస్తరించనుంది.
గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు అనుసంధానం
అమరావతి, విజయవాడ, గుంటూరు వంటి పట్టణ ప్రాంతాలతో సెమీ అర్బన్ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలకు ఓఆర్‌ఆర్ వల్ల అనుసంధానం ఏర్పడుతుంది. దీనివల్ల పట్టణ ప్రాంతాలతో తేలిగ్గా అనుసంధానం కావటంతో పాటు తమ ఆర్థిక కార్యకలాపాలను విస్తరించుకోవటానికి కూడా ఉపయోగపడుతుంది.