Organ Donation: చనిపోతూ.. పలువురి జీవితాల్లో వెలుగులు
ABN , Publish Date - Jul 10 , 2025 | 05:13 AM
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన 63 ఏళ్ల వృద్ధురాలు..
బ్రెయిన్ డెడ్‌కు గురైన మహిళ అవయవదానం
63 ఏళ్ల వృద్ధురాలికి ఎయిమ్స్ వైద్యుల నివాళి
మంగళగిరి సిటీ, జూలై 9 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన 63 ఏళ్ల వృద్ధురాలు.. అవయవదానం చేసి పలువురు జీవితాల్లో వెలుగులు నింపింది. మంగళగిరి ఎయిమ్స్ వైద్య వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నిడమర్రు గ్రామానికి చెందిన మండెపూడి శేషారత్నం ఈ నెల 1న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో కుటుంబ సభ్యులు ఎయిమ్స్‌లో చేర్పించారు.మంగళవారం బ్రెయిన్ స్టెమ్ డెడ్‌కు గురైనట్లు వైద్యులు ప్రకటించారు. కుటుంబ సభ్యుల అంగీకారంతో జీవన్‌దాన్ సంస్థ సమన్వయంతో అవయవ పునరుద్ధరణ ప్రక్రియను ప్రారంభించారు. ఒక కిడ్నీని ఎయిమ్స్ ఆస్పత్రిలోనే వేరొకరికి కేటాయించగా.. మరో కిడ్నీని చినఅవుట్‌పల్లిలోని పిన్నమనేని సిద్ధార్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్‌కు, కాలేయాన్ని తాడేపల్లిలోని మణిపాల్ హాస్పిటల్‌కు, కళ్లను విజయవాడలోని ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంకుకు తరలించారు. అవయవదానానికి అంగీకరించిన శేషారత్నం కుటుంబ సభ్యులకు ఎయిమ్స్ ప్రతినిధులు, వైద్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఎయిమ్స్ ప్రతినిధులు, సిబ్బందితోపాటు ఏడీఎంహెచ్‌వో డాక్టర్ ఎరుగుల అన్నపూర్ణ, తహసీల్దారు కే.దినేష్, ఆర్‌ఐ కే.గోపి తదితరులు బుధవారం ఉదయం శేషారత్నం భౌతికకాయానికి నివాళులర్పించి అంతిమ వీడ్కోలు పలికారు.