Share News

Onion Farmers Face Heavy Losses: ఉల్లి రైతు కన్నీరు

ABN , Publish Date - Aug 29 , 2025 | 03:48 AM

అధిక వర్షాలకు ఉల్లి కుల్లిపోయింది. దిగుబడులు భారీగా తగ్గాయి. అరకొర పంటను మార్కెట్‌కు తీసుకెళ్తే నాణ్యత లేదంటూ వ్యాపారులు ధరలు తగ్గిస్తున్నారు. ధర భారీగా పతనం కావడంతో రవాణా కూలీలు కూడా గిట్టుబాటు కాక పొలంలోనే పంటను వదిలేసే పరిస్థితి వచ్చింది..

Onion Farmers Face Heavy Losses: ఉల్లి రైతు కన్నీరు

  • ధర భారీగా పతనం

  • క్వింటా కనిష్ఠంగా రూ.500

  • అధిక వర్షాలకు తగ్గిన దిగుబడి

  • పెరిగిన పెట్టుబడి.. దక్కని గిట్టుబాటు

(కర్నూలు-ఆంధ్రజ్యోతి): అధిక వర్షాలకు ఉల్లి కుల్లిపోయింది. దిగుబడులు భారీగా తగ్గాయి. అరకొర పంటను మార్కెట్‌కు తీసుకెళ్తే నాణ్యత లేదంటూ వ్యాపారులు ధరలు తగ్గిస్తున్నారు. ధర భారీగా పతనం కావడంతో రవాణా కూలీలు కూడా గిట్టుబాటు కాక పొలంలోనే పంటను వదిలేసే పరిస్థితి వచ్చింది. పెట్టుబడి కూడా చేతికి రాక ఉల్లి రైతులు అప్పులపాలై తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. కర్నూలు మార్కెట్‌లో గురువారం క్వింటా కనిష్ఠంగా రూ.520 పలికితే గరిష్ఠంగా రూ.1,149కు మించడంలేదు. అత్యధికంగా రూ.550-750 మధ్య అమ్ముడుబోతోంది.

సాగు విస్తీర్ణం రెట్టింపు..

రాష్ట్రంలోనే ఉల్లిసాగులో కర్నూలు జిల్లా అగ్రస్థానంలో ఉంది. రోజురోజుకు ధర పతనం కావడంతో ఉల్లి రైతు కంట కన్నీళ్లు పెట్టిస్తోంది. జిల్లాలో గతేడాది 5,911 హెక్టార్లలో ఉల్లి సాగుచేయగా, ఈ ఏడాది 10,797 హెక్టార్లలో సాగు చేశారు. ఇప్పుడిప్పుడే పంట దిగుబడులు చేతికొస్తున్నాయి. అయితే 20 రోజులుగా జిల్లాలో కురుస్తున్న అధిక వర్షాల వల్ల భూమిలో తేమశాతం పెరిగి ఉల్లిగడ్డ కుల్లిపోతోంది. ఫలితంగా దిగుబడులు భారీగా తగ్గిపోతున్నాయి. అలాగే, కోత అనంతరం గ్రేడింగ్‌ కోసం రైతులు భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. సాధారణంగా ఎకరాకు 250- 300 బస్తాలకుపైగా దిగుబడి వచ్చేది. అయితే, అధిక వర్షాల వల్ల 80-120 బస్తాలకు మించి రావడంలేదు. కొన్ని పొలాల్లో అయితే 50 బస్తాలు కూడా రావడంలేదు. ప్రధానంగా గోనెగండ్ల, దేవనకొండ, ఎమ్మిగనూరు, బెళగల్‌, మంత్రాలయం, కోసిగి, ఆదోని, ఆస్పరి, ఆలూరు మండలాల్లో ఉల్లిని అధికంగా సాగుచేస్తున్నారు. ఎకరాకు సగటున రూ.75వేల నుంచి రూ.లక్షకుపైగా పెట్టుబడి పెడుతున్నారు. దిగుబడి తగ్గడం.. ధరలు పతనం కావడంతో అన్నదాత నష్టాల ఊబిలో కురుకుపోయి అప్పులపాలవుతున్నారు.


ధర పతనం..

గతేడాది ఇదే సమయంలో క్వింటా రూ.1,550 నుంచి రూ.2,500కుపైగా విక్రయించారు. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో ధరలు ఉంటాయని ఆశించడంతో సాగుబడి రెట్టింపు అయింది. అయితే, వ్యాపారుల మాయాజాలం కారణంగా ఒక్కసారిగా ధర పతనమైంది. కర్నూలు ఉల్లి మార్కెట్‌కు 8,428 బస్తాల(3793 క్వింటాళ్లు) దిగుబడులను రైతులు అమ్మకానికి తెచ్చారు. క్వింటా ధర కనిష్ఠంగా రూ.520, గరిష్ఠంగా రూ.1,149, సగటున రూ.739 పలికినట్లు మార్కెట్‌ అధికారుల లెక్కలు వెల్లడిస్తున్నాయి. అయితే, కనిష్ఠంగా రూ.350 కూడా పలకలేదని, పెట్టుబడి మాట దేవుడెరుగు పంట కోత కూలీలు, రవాణా ఖర్చులు కూడా చేతికి రావడంలేదనిత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు పొలాల్లోనే పంటను వదిలేయగా.. మరికొందరు కల్లాల్లోనే వచ్చినకాడికి అమ్మేస్తున్నారు. ప్రభుత్వం తమకు అండగా నిలిచి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

నిలువునా ముంచిన వాన

రెండెకరాల్లో ఉల్లి సాగుచేశాను. రూ.1.70 లక్షలు పెట్టుబడి పెట్టాను. దిగుబడి చేతికొచ్చే సమయంలో వర ్షం నిలువునా ముంచేసింది. 80 క్వింటాళ్లకు మించి దిగుబడి రాలేదు. కల్లంలోనే క్వింటా రూ.500కు వ్యాపారులు కొన్నారు. రూ.40వేలు మాత్రమే చేతికొచ్చింది. పెట్టుబడి, చేసిన కష్టం మట్టిపాలయ్యాయి. ప్రభుత్వం ఆదుకోవాలి.

- రంగన్న, రైతు, ఈరంపల్లి,

గోనెగండ్ల మండలం, కర్నూలు జిల్లా

GNDZ.jpg


XBXFB.jpg

క్వింటా రూ.450కు కూడా అడగట్లేదు

రెండెకరాల్లో ఉల్లిసాగు చేశాను. రూ.1.50 లక్షలు పెట్టుబడి పెట్టాను. అధిక వర్షాలకు ఆశలు నీటిపాలయ్యాయి. ఎకరాకు 300 బస్తాళ్లు వస్తాయని ఆశిస్తే 80 బస్తాలు కూడా రాలేదు. క్వింటా రూ.450కు కూడా అడగడంలేదు. వచ్చినకాడికి సరిపెట్టుకుని పొలాల్లోనే అమ్మేశాను.

-మిన్నల్లా, రైతు, కప్పట్రాళ్ల, దేవనకొండ మండలం

Updated Date - Aug 29 , 2025 | 03:49 AM